కోటీశ్వరుల క్లబ్బులుగా చట్టసభలు
► సీపీఐ సవాళ్లను ఎదుర్కొంటోంది: సురవరం
► ప్రజల్లో విశ్వాసం కలిగించగలగాలి
►ఎమర్జెన్సీని బలపరచడం, లెఫ్ట్ చీలికను ఆపలేకపోవడం
►దళిత పోరాటాల్లో పాల్గొనకపోవడం మా పొరపాట్లు
► దేశానికి శత్రువు బీజే పీయేనన్న సీపీఐ సారథి
►పార్టీ 90వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భ్రష్టుపట్టింది. పార్లమెంటు, అసెంబ్లీలు కోటీశ్వరుల క్లబ్బులుగా మారాయి. శతకోటీశ్వరులు మంత్రులుగా ఉన్నారు. దామాషా పద్ధతిపై ఎన్నికలు జరిగితే ప్రజలకు మరింత న్యాయం చేసేందుకు అవకాశముంది. దాని కోసం పోరాడాల్సి ఉంది’’ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం సీపీఐ 90వ వ్యవస్థాపక దినం సందర్భంగా ‘సాక్షి’కి సురవరం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు...
మా పాత్ర పట్ల గర్విస్తున్నాం
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల అవగాహనలు కొన్నిసార్లు అనివార్యమే అయినా కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు, ఎన్నికల అవగాహన కమ్యూనిస్టుల పోరాట పటిమను నష్టపరిచాయి. పొత్తు వాటికే ఉపయోగపడ్డాయి తప్ప మాకు కాదు. పార్లమెంటరీ పంథాకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరాటాల్లో బలహీనతలకు దారితీసిందనే అభిప్రాయంపై సీపీఐ 22వ జాతీయ మహాసభల్లో చర్చించాం. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని బలపరచడం సీపీఐ ప్రస్థానంలో పెద్ద రాజకీయ పొరపాటు. వామపక్షాల చీలికను నివారించలేకపోవడమూ అంతే. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తోనూ, కులవివక్ష వ్యతిరేక పోరాటాల్లో అంబేద్కర్‌తోనూ కలసి పని చేసే అవకాశాలను దూరం చేసుకోవడమూ పొరపాటే. అలాగే దళితుల ఆత్మగౌరవ పోరాటాల్లోనూ మమేకం కాలేకపోయాం. ఈ అంశాలను చాలా ఆలస్యంగా గమనించాం. భారత్‌లో కులమనేది చేదు నిజం. అయితే దేశ రాజకీయాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో బలమైన ముద్ర వేసే పాత్ర నిర్వహించినందుకు గర్వపడుతున్నాం.
పార్టీ సంక్షోభంలో లేదు
మా పార్టీ పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది కానీ సంక్షోభంలో పడినట్టు భావించడం లేదు. వామపక్షాల వరకూ ఎన్నికల ఓటమి కంటే కూడా మాకు ఓటింగ్ బలం తగ్గడమే ఎక్కువ ఆందోళనకరం. స్థానిక సమస్యలపై పోరాటాలతోనే దీన్ని అధిగమిస్తాం. ఉద్యమాలు, పోరాటాల ద్వారా కమ్యూనిస్టు ఉద్యమ పునరుజ్జీవనానికి అవకాశముంది. దేశంలో రాజకీయ విలువలు దిగజారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా తీవ్ర సంక్షోభంలో ఉంది. దేశంలోనూ బీజేపీ మతోన్మాదం, వారి కార్పొరేట్ అనుకూల విధానాలు, వారి అనుయాయుల అసహన దాడులు అనిశ్చిత వాతావరణానికి దారితీశాయి. దీనిపై ప్రజలే తిరగబడుతున్నారు. కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా 15 కోట్ల మంది కార్మికులు చేసిన సమ్మె ప్రపంచంలోని అతిపెద్ద సమ్మెల్లో ఒకటి. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, యూపీ, గుజరాత్ తదితర రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా ప్రజలు తమ వ్యతిరేకతను స్పష్టం చేశారు.
ప్రజల్లో విశ్వాసం కలిగించగలగాలి
ప్రజా సమస్యలు పరిష్కరించగలిగే శక్తి కమ్యూనిస్టులకే ఉంది. ప్రజలు పోరుబాట పట్టే పరిస్థితులు రావాలంటే కమ్యూనిస్టులపై వారికి విశ్వాసం పెరగాలి. అది కమ్యూనిస్టుల పునరైక్యత ద్వారానే సాధ్యం. ఇతర పార్టీలతో పొత్తు తాత్కాలికమేనని, పాలక పార్టీలతో వర్గ ఘర్షణలుంటాయని మా కేడర్ అర్థం చేసుకుంది గానీ దాన్ని పార్టీ మద్దతుదారులు అర్థం చేసుకోవడం లేదు.
పుంజుకుంటున్నాం: బీజేపీ కేవలం రాజకీయ ప్రత్యర్థే కాదు, దేశానికి శత్రువు. కాంగ్రెస్‌వి అవకాశవాద రాజకీయాలు. బీజేపీ తిరోగమన దశ మొదలైంది. కాంగ్రెస్ కూడా బలపడటం లేదు. బెంగాల్లో మళ్లీ లెఫ్ట్ పుంజుకుంటోంది. కేరళలో వచ్చే ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ గెలుస్తుంది.