గురుతు చెరగని మనిషి | A legend unmemorable person Bapu Ramana reddy | Sakshi
Sakshi News home page

గురుతు చెరగని మనిషి

Published Mon, Sep 1 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

గురుతు చెరగని మనిషి

గురుతు చెరగని మనిషి

రేఖ పుట్టిన దగ్గరినుంచీ అనాది మానవ జీవన కాలం నుంచి ఎంతమంది చిత్రకారులు.. ఎన్ని లక్షలు, కోట్ల గీతలు వేసి ఉంటారు. కానీ బాపూ గీత కొట్టొచ్చినట్లుంది. బాపూ బొమ్మ అప్పుడే పుట్టినట్లుంటుంది. తెలుగు జీవంతో ముద్దుగా, ఒద్దికగా ఉంటుంది. ప్రత్యేక శైలికి చెందిన చిత్రకారుడిగా ఆయన స్థానం ఎప్పటికీ చెరగనిదీ, చలించనిదీ. ఆయన చిత్రకళలాగే ఆయన చలన చిత్ర కళా అద్భుతమైంది.
 
 బాపు...తన కలలను కాన్వాస్‌తోనే పంచుకున్నవాడు. రంగుల జలపాతాలను ఉరికించినవాడు. వేల ఇంద్రధనుస్సులను నేల మీద పరిచినవాడే కాదు, వెండితెర మీద రంగులతో మాట్లాడించినవాడు. వందల పేజీల భావాన్ని ముఖపత్రం మీది సప్తవర్ణ మౌనంతో ఆవిష్కరించినవాడు. కొంటె బొమ్మల బాపు.. నిజానికి కోటి బొమ్మల వేలుపు. ‘నా బొమ్మ తగిలించడానికి గోడ లేకుండా పోయింద’ని తన ఆత్మీయుడు ముళ్లపూడి గురించి బాధపడిన బాపు, ఎన్నెన్నో బొమ్మలను మూసిన కళ్లలోనే వదిలేసి వాటికి కాన్వాసే లేకుండా చేశాడు.
 
 బుడుగు, సీగానపెసూనాంబ, అప్పారావు వంటి సాదాసీదా మనుషుల బొమ్మలు మొదలు ఆజానుబాహులైన పురాణ పురుషులూ, ఆకర్ణాంత నయనాలతో అచ్చెరువొందించే పురాణ స్త్రీల బొమ్మలూ, సమకాలీనుల క్యారికేచర్లు... ఎన్ని వందలు ఆయన కుంచె నుంచి జనం మధ్యకు వచ్చాయి! బాపు తెలుగు వర్ణమాలను సప్తవర్ణ శోభితం చేయాలని స్వప్నించాడు. అక్షరానికి కొత్త రూపు ఇచ్చాడు. రాత మీద మమకారం పెంచాడు. తెలుగు నుడికారాన్ని రేఖలుగా మలిచాడు. తెలుగునేల సౌందర్యానికి కొత్త రంగులద్దాడు. ఆరుద్ర చెప్పినట్టు ‘కొంటెబొమ్మల బాపు/ కొన్నితరముల సేపు/ గుండెలూయలూపు/ ఓ కూనలమ్మా!’ బాపు లేని తెలుగునేల, రంగు వెలిసిన కల.
 ‘సాక్షి’తో ప్రయాణం ప్రారంభించిన బాపు గారికి
 ‘తెలుగువారి మనస్సాక్షి’ నివాళి
 
 జంటతారలలో మరో తార కూడా వెళ్లిపోయింది. తాత్కాలిక వియోగం తర్వాత తిరిగి బాపు-రమణ కలిసిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో బాపుగారు తెలుసు. తెలుగు వారికి మరీనూ. కళాకారులకీ, రచయితలకీ, సినిమావారికీ మరీమరీ తెలుసు. తెలుగు సినీ గమనంలో బాపు ఓ ప్రత్యేక ప్రవాహం. మొదటి సినిమాతోటే తన ముద్రను ప్రత్యేకంగా చాటి సాక్ష్యంగా నిలబెట్టిన ఘనత బాపూది. ఆయన సినిమాల్లో ఏ దృశ్యం గుర్తు తెచ్చుకున్నా ఆయన గుర్తొస్తారు. ఆయన గుర్తొస్తే చాలు.. ఆయన అద్భుతంగా మన ముందు నిలిపిన దృశ్యాలు గుర్తొస్తాయి. ‘సాక్షి’ సినిమాలో ఒక సామాన్యుడికి రౌడీ అంటే ఉండే భయం, నిస్సహాయత కళ్లముందు కదిలితే ‘బుద్ధిమంతుడు’లో ఎ.ఎన్.ఆర్ భగవంతుడితో జరిపిన సంభాషణా చాతుర్యం మనని ఎప్పటికీ వదలదు. ‘గంగావతరణం’, ‘సంపూర్ణ రామాయణం’లో రావణుడు, ‘శ్రీరామరాజ్యం’లో సీతమ్మ తల్లి భూమాత ఒడి చేరిన తీరు ఒకటేమిటి, అనేకానేక దృశ్యాలు దేనికదే ప్రత్యేకం.
 
 బాపు దేన్నయినా అందంగానే తీస్తారు అన్నది చాలామంది అభిప్రాయం. దేనిలోనయినా అందాన్ని, సౌందర్యమూలాన్ని పట్టుకోవటం ఆయనకే చెల్లిన ప్రత్యేక బాణీ. దృశ్యం, మాట, పాట, సంగీతం, చీకటి వెలుగులు, అందాల రంగుల కలయిక, అద్భుత ఊహాలోకం, నిఖార్సయిన జీవితం.. వీటన్నిటి కలగలుపు మంచి చిత్రమైతే, అవన్నీ బాపూ గారి సినిమాలు. పాఠ్య పుస్తకాల్లాంటి సినిమాలు తీసినా, ప్రేక్షకులు పరవశించి పదే పదే చూసిన సినిమాలు తీసినా ఆయనకే చెల్లింది. చలన చిత్రాల్లో నలుపు తెలుపు నుంచి రంగుల చలన చిత్రాల వరకు సాగింది ఆయన ప్రస్థానం. చిత్రకారుడిగానే కాదు, చిత్రదర్శకుడిగా కూడా నిరంతర అధ్యయన శీలి. అయినా ఒక్కమాటగానైనా తనకి చలనచిత్రాల గురించి ఇంత తెలుసు, అంత తెలుసు అని ఏనాడూ అనని సౌమనస్యజీవి.
 ఒక్కసారైనా ఆయన తమ కథకు బొమ్మేస్తే చాలు అని కోరుకున్న రచయితలు ఎందరో. కథా హృదయం పట్టుకుని అది ప్రతిబింబించేలా ఇలస్ట్రేషన్ చెయ్యటం ఆయనకే చెల్లింది. కథ బావుండక పోవచ్చునేమో కానీ, బాపూ వేసిన బొమ్మ బావుండని సందర్భాలు లేవనే చెప్పాలి. రేఖ పుట్టిన దగ్గరినుంచీ అనాది మానవ జీవన కాలం నుంచి ఎంతమంది చిత్రకారులు.. ఎన్ని లక్షలు, కోట్ల గీతలు వేసి ఉంటారు.
 
  కానీ బాపూ గీత కొట్టొచ్చినట్లుంది. బాపూ బొమ్మ అప్పుడే పుట్టినట్లుంటుంది. తెలుగు జీవంతో ముద్దుగా, ఒద్దికగా ఉంటుంది. ప్రత్యేక శైలికి చెందిన చిత్రకారుడిగా ఆయన స్థానం ఎప్పటికీ చెరగనిదీ, చలించనిదీ. ఆయన చిత్రకళలాగే ఆయన చలన చిత్ర కళా అద్భుతమైంది. స్నేహంతో, స్నేహం కోసం చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన తీరే విలక్షణం. వారు ఎన్నుకున్న కథా వస్తువులు, చిత్రీకరణ తీరులో వారి ముద్ర సుస్పష్టం. వేల కొద్దీ ఉన్న తెలుగు సినిమాలలో బాపూ సినిమా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మొదటి ఫ్రేమ్ నుంచి ముగింపు వరకు ఎక్కడా మర్యాదని దాటకపోవటం బాపూ సినిమా ప్రత్యేకత. రామభక్తి అయినా, రావణనీతి అయినా, అభినవ రామాయణం ‘ముత్యాల ముగ్గు’ అయినా, ఆ నడక, నడత వారిదే. ప్రతి సినిమా ఓ పుస్తకం. ఓ అధ్యయన గ్రంథం. ఎన్నో రంగాలకి చెందిన, దేశ విదేశీ స్నేహ సంపద అపారం బాపుగారికి. ఆయనకి రచన నచ్చితే ఎంత బలవంతం చేసినా ఆయన వేసిన బొమ్మలకి పారితోషికం తీసుకోకపోవటం మిత్రులకి తెలుసు. బాపూ గారి బొమ్మల్ని చూసి మురిసిన వారిలో మూడు నాలుగు తరాల వారు ఉన్నారు. బొమ్మలూ, సినిమాలనే కాదు. బాపు గారు తెలుగు కథల్ని  కూడా బాగా ఎరిగిన వ్యక్తి. బాపూ మన్నన పొందితే అది అంతర్జాతీయ స్థాయి కథ అని ధీమాగా చెప్పొచ్చు. దానికి తార్కాణంగా ఆయన సంకలనం చేసిన ‘కథ’ సంకలనాన్నే చెప్పొచ్చు.
 
 1960 నవంబర్‌లో ‘కథ’ అన్న పదకొండు కథల సంపుటిని ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ వారు తమ ఇంటింటా స్వంత గ్రంథాలయం ప్రణాళికలో భాగంగా ప్రచురించారు. ఈ పదకొండు కథలకి బొమ్మలు వేయటమే కాక ఆ కథల్ని ఎంపిక చేసి సంకలనం చేసింది బాపు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఇది ఒక విశిష్ట కథా సంకలనం. కళ్యాణ సుందరీ జగన్నాథ్ ‘మాడంత మబ్బు’, రాచకొండ విశ్వనాథశాస్త్రి ‘వర్షం’, కొడవటి గంటి కుటుంబరావు ‘ఫాలౌట్’, సి. రామచంద్రరావు ‘నల్లతోలు’, అరిగే రామారావు ‘నచ్చినోడు’, రావి కొండలరావు ‘మాయమైన మనీపర్సు’, రుద్రాభట్ల నరసింగరావు ‘వరలక్ష్మికి వరుడు’, పూసపాటి కృష్ణం రాజు ‘సీతాలు జడుపడ్డది’, భమిడిపాటి జగన్నాథరావు ‘లౌక్యుడు’, శివరాజు సుబ్బులక్ష్మి ‘మనోవ్యాధికి మందుంది’, మల్లాది రామకృష్ణ శాస్త్రి ‘కొమరయ్య కోన’ ఈ పదకొండు కథలు ఈ సంకలనంలో ఉన్నాయి.
 
  వీటిని చదివితే వ్యక్తుల మనస్తత్వం, వివిధ సందర్భాల ప్రభావం, సంస్కృతీ బలం, ఆధునిక మార్పులు, మనుషుల్లో హెచ్చుతగ్గులు, ఆశ నిరాశల శక్తి వెరసి మొత్తం తెలుగు జీవితం అంతా కళ్లముందు పరుచుకుంటుంది. ఒక కథ పోలిక మరో కథలో ఎంతమాత్రం లేకపోవటం ఈ సంకలనం ప్రత్యేకత. రచయితలు ఎంత ప్రతిభతో ఈ కథలను రాశారో, అంతటి ప్రతిభతో వీటిని సంకలనం చేశారు బాపూ. నచ్చిన రచనని పనిగట్టుకుని ఓ ఉద్యమంలా ప్రచారం చెయ్యటంలోనూ, అద్భుతమైన సంగీత, సాహిత్య, సినిమా సంపదని ప్రోది చెయ్యటంలోనూ ఆయన ప్రత్యేకత ఆయనదే. మహా గాయకుడు బాలమురళీ కృష్ణ గారిచేత తన అన్ని సినిమాల్లోనూ పాడించారు.
 
 ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో!
 ఆయనకు నా పైన అమితమైన వాత్సల్యం ఉండేది. ఆయన నన్ను ఫ్రెండ్ అనేవారు. చిన్నవాడిననీ, చితకవాడిననీ చూసింది ఎప్పుడూ లేదు. నాకు ఫలాని ఆర్టిస్టు బొమ్మలంటే ఇష్టం అని తెలుసుకుని వారి బొమ్మల పుస్తకాలు ఎక్కడున్నా తెప్పించి ప్రజెంట్ చేసేవారు. ఒకసారి సెర్గియొ టొప్పి అనే చిత్రకారుడి పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవని దిగాలు మొహం పెట్టుకుని ఆయన ముందు నిలబడితే, నా మొహంలో నవ్వు తెప్పించడానికి ఇరవై వేల రూపాయల చెక్కు నా పేర రాసి నా మొహాన నవ్వు రప్పించారు. నేను మంచి ఉద్యోగంలో పెద్ద పొజిషన్లో ఉండాలని ఎప్పుడూ కోరుకునేవారు. ఓసారి బెంగళూరులో ఒక పెద్ద సంస్థలో నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఆ సాయంకాలం నాకు ఫోన్ చేసి ‘ఏవండీ! నేనూ రమణగారూ మీ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నామ’ని ఆనందపరిచారు.

క్రమక్రమంగా ఆయన్ని కలిసిన ప్రతిసారీ హెచ్చరించేవారు. ‘మీరు మీ టాలెంట్‌ని వృధా చేసుకుంటున్నారు. నా మాట విని ఈ ఇలస్ట్రేషన్ వదిలేయండి. టెక్నాలజీ వైపు మళ్లండి..’ ఆయనకు ఏం చెప్పాలో నాకు తోచేది కాదు. గత సంవత్సరం డిసెంబర్ 15న ఆయన పుట్టిన రోజు. హెల్త్ చెకప్‌కు హైద్రాబాద్ వచ్చారు. ఆస్పత్రిలో ఆయన్ని కలవడం అంతగా ఇష్టపడేవారు కాదు. ఆయన హైద్రాబాద్‌కు వచ్చినా నేను కలవకపోతే మొహం మాడ్చుకునేవాడిని. చెకప్ అయిపోయాక వెళ్లేదారిలో సాక్షి ఆఫీసు ముందు ఆగి, కిందికి రమ్మన్నారు. రోడ్‌పై ది గ్రేట్ బాపుగారు ప్రేమగా తన చేతుల్లోకి నా చేతుల్ని తీసుకున్నారు. ఆయన చేతుల మధ్యనుంచి ఒక కవర్ నా చేతులపైకి వచ్చింది. ‘పెద్దవాణ్ణి ఇస్తున్నా.. కాదు అనరాదు..’ అంటూ చిరునవ్వుతో నా తల నిమిరి కారెక్కి కూచున్నారు. ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీన మధ్యాన్నం ఫోన్ చేశారు. ‘నాకో సహాయం చేయాలండీ’ అన్నారు. ‘ఏంటి సార్’ అనడిగాను. ‘మీకు ప్రపంచంలోని ఇంతమంది చిత్రకారుల బొమ్మలు వారి రీతులు తెలుసు కదా. విజయవాడ గంధం ప్రసాద్ గారు నా బొమ్మలన్నీ కలిపి ఒక బుక్ తెస్తున్నారు. దానికి మీరు ముందుమాట వ్రాయాలని నా కోరిక’ అన్నారు. నేను తెలీక ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. దాని ఫలం పేరు బాపు.
 - అన్వర్
 
 చిన్నబోయిన ముఖచిత్రం

కుంచె కన్నీటి కెరటమైంది. తెలుగు అక్షరం చిన్నబోయింది. ముఖ చిత్రం మూగబోయింది. వర్ణాలన్నీ వివర్ణమయ్యాయి. ఆయన బొమ్మలన్నీ కొలువు దీరి నాన్న దూరమయ్యాడని వెక్కివెక్కి రోదించాయి. తెలుగింట్లో బుడుగులు,  బాపు బొమ్మలాంటి అమ్మాయిలు శోకతప్తులయ్యారు. బాపు ఇక లేరన్న వార్త ఆయన అభిమానులందర్నీ కలచి వేసింది. కవిత్వాన్ని మహాకవి శ్రీశ్రీ ఏరీతిగా భూమార్గం పట్టించారో..చిత్రకళను బాపు ప్రజల్లోకి తీసుకువచ్చారు. ఇదేమంత ఆషామాషీ వ్యవహారం కాదు. గతంలో రవివర్మ ఆ పని మొదలుపెడితే బాపు దానిని కొనసాగించారన్నమాట కూడా ఉంది. గీత రహస్యాన్ని అతను కాచివడబోశాడు. ‘బాపు చిత్రాలు చూచి ఆనందించడం మన కళాభిజ్ఞతకు వన్నె..’ అని మల్లాది రామకృష్ణశాస్త్రి గారన్నమాటలు అక్షర సత్యం. చిత్రకళను ప్రజల్లోకి తీసుకురావటం అంత ఆషామాషీ కాదు. ఇతర చిత్రకారులు అసూయపడే విధంగా ఆయన గీత ఉంటుందన్నది నండూరి రామమోహనరావు వ్యాఖ్య. తన గాలిబ్ గీతాలకు బాపు వేసిన బొమ్మలను చూసి దాశరథి మురిసిపోయారు. ‘దూది చూడడానికి సాదాగా ఉంటుంది. కానీ అది ఎందరి మానాలను కాపాడుతుందనీ..బాపు బొమ్మలు అంతే నిరాడంబరంగా ఉంటాయి. కానీ గుండె పొరల వెనకాల ఉన్న స్వాభిమానాలకు హాయిగా చురకలు పెడతాయి.. బాపులో ఒక దర్శకుడు ఉన్నాడు.. దార్శనికుడు ఉన్నాడు’ అంటారు సినారె.  ‘బాపు ప్రతిభ తెలుగు తల్లి ప్రాంగణంలో పెట్టిన మంచి ముత్యాల ముగ్గు ..ఇంది ఎంచిన సత్యాల నిగ్గు..’అన్నారు ఆరుద్ర.

 అది 1943వ సంవత్సరం...అది న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య)గారి ‘బాల’ పత్రికా కార్యాలయం. పదేళ్ల బాలుడు ఆయన ఎదురుగా నిల్చుని నేను బొమ్మలు గీస్తాను. మీ పత్రికలో వేస్తారా అని ధైర్యంగా అడిగేశాడు. వెంటనే అతని ఉత్సాహాన్ని గమనించి రంగులు, కుంచెలు ఇచ్చి బొమ్మలు గీయమన్నారు. చకచకా అతను వేసిన చిత్రాలన్నింటినీ చూసి ఆశ్చర్యపడి తన పత్రికలో వేయించారు. ఆ బాలుడి గీతాభ్యాసం అలా మొదలై ఏడు దశాబ్దాలపాటు తెలుగు భాష గీతనే మార్చేసింది.  సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే ఆ బుడతడు అనంతర కాలం బాపుగా అవతరించి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.  తొలినాళ్లలో బాపు చిత్రకళాభ్యాసానికి గురువులైన గోపులుగారు, చామకూరగారు మెరుగులు దిద్దారు. అప్పటి నుంచి బాపు బొమ్మలు, కార్టూన్లు, కామిక్స్, కవర్ డిజైన్లు దర్శనమివ్వటం ప్రారంభించాయి. 1954లో ఫ్రీ హేండ్ అవుట్‌లైన్ అండ్ మోడల్ డ్రాయింగ్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. 1955లో ఆంధ్రపత్రికలో రాజకీయ కార్టూనిస్టుగా రంగప్రవేశం. 1978లో లండన్‌లో ‘వన్‌మేన్ షో’ప్రదర్శన.  ప్రతి గీత ప్రాణం పలుకుతుంది. ఆయన రాసిన ప్రత్యక్షరం నవలాస్యం చేస్తుంది. 1955-65 మధ్యకాలంలో ఆర్టిస్టుగా, ఆర్ట్ డైరక్టర్‌గా ఉద్యోగం. ఆయన మృతితో ఒక తెలుగు జాతి వెలుగు రేఖ చీకటైపోయింది. బాపు టైటిల్‌తోనే ఏదైనా పుస్తకానికి సార్థకత. ఈ ఏడాదిలోనే మా నాన్నగారు మధునాపంతులవారి పుస్తకానికి ఆయన వేసిన ముఖచిత్రమే ఇటీవల కాలంలో ఆయన వేసిన టైటిల్ అయి ఉంటుందని భావిస్తున్నాను. నా అభ్యర్థన మేరకు పదికి పైగా పుస్తకాలకు  అద్భుతమైన ముఖచిత్రాలను సహృదయంతో వేసి ఇచ్చిన ఆయన రుణం తీరేదెలా..!
 - మధునాముర్తి
 
 మిత్రుడు కె. వివేకానందమూర్తితో కలిసివెళ్లి ఆయన ఇంట్లో నేను ఆత్మీయంగా గడిపిన కాలం మరపురాదు. అలాగే శ్రీరామరాజ్యం చిత్రాన్ని గోవా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆయన పక్కనే కూర్చుని చూసిన సమయం కూడా.. చక్కటి చిరునవ్వు, మెత్తటి పాట, నిష్కర్షగా నిజ వ్యక్తీకరణ, ఇంక మళ్లీ అలా ఆయన్ను చూడలేం అన్న బాధ, ఆయన కళ్లబడరన్న దిగులు. నాకే కాదు.. నన్ను మించి ఎందరెందరికో.. ఓ గొప్ప, అపురూప వ్యక్తి కాలంలో కలిసిపోయారు. కానీ ఆయన గురుతు, గీత, మాట, చేత, దృశ్యం, తెలుగుతనం, చిలిపితనం, మొహమాటం ఎప్పటికీ అలాగే ఉంటాయి. ప్రత్యక్షంగా ఎరిగిన వారికి ఆయన మరపురారు. అలా ఎరగనివారికి ఆయన బొమ్మలు, చలనచిత్రాలు, రాతలు మరపురావు.    
- వి.రాజారామమోహనరావు
 (వ్యాసకర్త నవలా రచయిత, సినీ విమర్శకులు )

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement