కొత్త పుస్తకాలు
న్యూ రిలీజ్
పవర్ ఆఫ్ ఎ కామన్ మేన్
ప్రపంచంలోని నటులందరిలోనూ షారూక్‌ఖాన్ అధిక సంపన్నుడని ఈ మధ్యే ఎవరో తేల్చారు. హాలీవుడ్‌వాళ్లు కూడా మనవాడి వెనుక నిలబడి ఎక్కడ వెనుకబడ్డామా అని లెక్కలేసుకుంటున్నారట. ఆ మాట నిజమో కాదోగాని భారత ఉపఖండంలో ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా షారూక్‌ఖాన్ మూట గట్టుకున్న అభిమానులు తక్కువేం కాదు. చాలామంది ఇంతటితో ఆగిపోతారు. అయితే షారూక్ వాళ్లందరినీ అభిమానులుగా కాక వినియోగదారులుగా కూడా చూశాడు.
అందుకే తనే ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా మారి చాలా ప్రాడక్ట్స్‌కు ప్రమోషన్ ఇచ్చాడు. ఇవాళ షారూక్ మైనస్ మార్కెట్‌ను ఊహించడం కష్టం అంటారు మార్కెట్ రంగ నిపుణులు. పుస్తకాలు రాసేవాళ్లు కూడా మార్కెట్‌నే దృష్టిలో పెట్టుకుని ఉంటారు. ఇదంతా గమనించిన కొరల్ దాస్‌గుప్తా అనే రచయిత్రి షారూక్ మీద తాజాగా ‘పవర్ ఆఫ్ ఎ కామన్ మేన్’ అనే పుస్తకాన్ని వెలువరించింది. ఇది ఇటీవల ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో షారూక్ వాడిన డైలాగ్. షారూక్‌ని కేవలం నటుడిగా కాకుండా అతడి వెనుక ఉన్న వ్యాపార వ్యూహాలను ఆమె ఈ పుస్తకంలో చర్చించింది. ఒక సాదాసీదా ఢిల్లీ కామన్ మేన్ ఇవాళ ఇంత పెద్ద విజేత ఎలా అయ్యాడో తెలియాలంటే ఈ పుస్తకం చదవాలి.
పబ్లిషర్: Westland వెల: రూ. 395
సివిల్స్ తెలుగు అభ్యర్థుల కోసం వ్యాస కల్హారాలు
గుణనిధి కథ, సుగాత్రీ శాలీనుల కథ, ఆంధ్రప్రశస్తి, జాషువా గబ్బిలం, కర్పూర వసంతరాయలు, మహాప్రస్థానం ఆధ్యాత్మికత, అల్పజీవి నవల తదితర అంశాలపై పోటీ పరీక్షలకు తగినట్టుగా వ్యాసాలు. రచయిత్రి సర్వమంగళ గౌరి దశాబ్దాలుగా పోటీ పరీక్షల బోధనా రంగంలో ఉండటం వల్ల విద్యార్థులు తప్పక పరిశీలించదగ్గ పుస్తకం.
వెల: రూ.120 ప్రతులకు: 9866222978
కారంచేడు నుంచి లక్షింపేట దాకా
1985 కారంచేడు నరమేధం నుంచి 2012 లక్షింపేట మారణ కాండ దాకా దళితులపై జరిగిన సామూహిక దాడులు, హంతకుల శిక్షకై జరిగిన పోరాటాలు, చర్చలు... వీటన్నింటి సమగ్ర కూర్పు ఇది. దళిత పోరాటాల నేపధ్యం తెలియాలంటే ఈ పుస్తకం చదవక తప్పదు. ఎన్నో వ్యయప్రయాసలతో ఈ భారీ సంకలనాన్ని తీర్చిదిద్దిన పాపని నాగరాజు అభినందనీయుడు.
వెల: ఇవ్వలేదు ప్రతులకు: 9948872190