మోసంచేసిన సుమలత
సాక్షి, మంచిర్యాలక్రైం/బెల్లంపల్లి: ఉద్యోగాల కల్పన పేరుతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమాయకులైన నిరుద్యోగులను తన మాయమాటలతో నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేసింది.
ఊరు, పేరు తెలియకపోయినా.. కేవలం పరిచయమైతే చాలు.. బుట్టలో వేసుకోవడంలో ఆమెకామె సాటి. ఏం ఉద్యోగం చేస్తున్నావని, ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆత్మీయురాలిగా కుశలప్రశ్నలు వేసి ఆకట్టుకోవడంలో దిట్ట. ఇలా ఆ మహిళ ఒక్కరుకాదు.. ఇద్దరు కాదు ఏకంగా 100 మందిని బోల్తాకొట్టించింది. రూ.కోట్లు వసూలు చేసి చివరికి ఐపీ పెట్టింది. నోటీసులు అందుకున్న బాధితులు మంచిర్యాల డీసీపీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
డిగ్రీ చదివిన ఓ ఇల్లాలు
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి కన్నాల బస్తీ (ఇందిరమ్మ కాలనీ)కి చెందిన సుమలత డిగ్రీ చదువుకుంది. ఓ కొడుకు జన్మించాక భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయినట్లు సమాచారం. అప్పటినుంచి సదరు మహిళ మోసాలు చేయడం అలవా టు చేసుకున్నట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి బజారుఏరియా, గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న ఓ ఇద్దరు యువకులను అసిస్టెంట్లుగా పెట్టుకుని దందాకు తెరతీసినట్లు ప్రచారంలో ఉంది.
నిరుద్యోగులే టార్గెట్
సుమలత దూర ప్రాంతాల నిరుద్యోగులను ఎంచుకుంది. ప్రభుత్వం ఏదైనా నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు.. ఆమె పంట పండినట్లే. అసిస్టెంట్లతో కలిసి అద్దెకారులో బయల్దేరి నిరుద్యోగులను వెదికేవారు. ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్నట్లు అసిస్టెంట్లు నిరుద్యోగులకు పరిచయం చేసి.. సింగరేణి, ఏసీసీ, జైపూర్ విద్యుత్ ఫ్లాంట్, దేవాపూర్ ఓసీసీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏ రకమైనా ఉద్యోగమైనా సరే ఉన్నతాధికారులతో మాట్లాడి పెట్టిస్తుందని, ఆమె తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నమ్మించి వలలో వేసుకునేవారు. అలా ఒక్కొక్కరి నుంచి కని ష్టంగా రూ.లక్ష.. గరిష్టంగా రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను వంచించడంలో ఆమె ఎంతగానో ఆరితేరింది.
అవసరాలకు అనుగుణంగా నేతల పేర్లు
సుమలత ఏమాత్రం అనుమానం రాకుండా నిరుద్యోగుల వద్ద రాజకీయ నాయకుల పేర్లు ఎన్నోసార్లు వాడుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. అధికార పార్టీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పి ఉద్యోగాలు పెట్టిస్తానని నమ్మబలికేది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల పేర్లనూ వదలలేదని సమాచారం. బాధితుల సంఖ్య పెరగడం, ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడం.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు తీవ్ర ఒత్తిడి తేవడం ప్రారంభించారు. దీంతో సదరు కిలేడీ ఐపీ పెట్టినట్లు తెలుస్తోంది.
డీసీపీని కలిసిన బాధితులు
గురుకులంలో ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి సదరు సుమలత 132 మంది నిరుద్యోగులను మోసం చేసి చివరికి ఐపీ నోటీసులు పంపడంతో న్యాయం చేయలంటూ బాధితులు మంచిర్యాల డీసీపీని కలిశారు. డబ్బులు తీసుకుని కొంతకాలం ఉద్యోగాల విషయం కోర్టుకేసులో ఉందని, ఎన్ని కల కోడ్ ఉందని కాలయాపన చేసి ఇప్పుడు నిం డా ముంచిందని, తీసుకున్న డబ్బులకు ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, బాండ్‌పేపర్‌పై అగ్రిమెంట్ కూడా రాసిచ్చిందని విన్నవించారు. ఈనెల14న ఐపీ నోటీసులు పంపిన సుమలత తన సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిందని పేర్కొన్నారు.
పుస్తెలతాడు అమ్మిచ్చి డబ్బులు తీసుకుంది..
గురుకులంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటే వెళ్లి కలిశాం. నేను ఏఎన్‌ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకున్న. ఉద్యోగానికి రూ.లక్ష అవుతుందని నమ్మిచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తామంటే ఇప్పుడే ఇవ్వాలంది. లేదంటే పనికాదంది. డబ్బుల్లేవంటే నీ మెడలో పుస్తెలతాడు, రింగులున్నయి కదా.. అవి అమ్మియ్యుమని దగ్గరుండి మరీ మార్కెట్లో అమ్మిచ్చి డబ్బులు తీసుకొని వెళ్లిపోయింది. నా బంగారం పోయింది. ఉద్యోగం రాలే.
– రత్నం భారతి, బెల్లంపల్లి
అప్పులపాలయినం...
ఉద్యోగం వస్తుందంటే నాలుగు పైసల వడ్డీకి తెచ్చి రూ.4లక్షలు అప్పు చేసి ఇచ్చినం. రెండున్నరేళ్లుగా వడ్డీలు కట్టలేక అప్పులపాలైనం. ఉద్యోగం ఇప్పించకపోగా.. మాపేనే కేసులు పెట్టింది. ఉన్నతాధికారులు స్పందించి సుమలతపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి.
– రామటెంకి తిరుపతి, కాసిపేట
Comments
Please login to add a commentAdd a comment