గోరఖ్‌పూర్ ఘోరకలి: 63కు పెరిగిన మరణాలు
- బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మృత్యువు విలయతాండవం
- శుక్రవారానికి 60 మంది.. శనివారం మరో ముగ్గురి మృతి
- మరణాలను ధృవీకరింస్తూ వైద్యుల ప్రకటన
- యూపీ సర్కారుపై తీవ్ర విమర్శలు.. మంత్రులతో సీఎం యోగి అత్యవసరభేటీ
గోరఖ్‌పూర్: చిన్నారుల వరుస మరణాలతో ఉత్తరప్రదేశ్ వణికిపోతోంది. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పిల్లల సంఖ్య 63కు పెరిగింది. ఆస్పత్రిలో ద్రవరూప ఆక్సిజన్ అందుబాటులో లేని కారణంగానే వీరంతా మృత్యువాత పడ్డారు. కానీ వైద్యులు మాత్రం మరణాలకు వేర్వేరు కారణాలున్నాయని వాదిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం బీఆర్‌డీ ఆస్పత్రి అధికారులు విడుదల చేసిన ప్రకటనను బట్టి.. పిల్లల వార్డు, మెదడువాపు వార్డుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 9 నుంచి 11 వరకూ చోటుచేసుకున్న ఈ మరణాల్లో కేవలం 11 కేసులపై మాత్రమే శాఖాపరమైన విచారణకు ఆదేశించామని అధికారులు చెప్పారు. మిగిలినవారంతా రకరకాల వైద్య కారణాలతో చనిపోయారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, శనివారం తెల్లవారు జాము నుంచి ఉదయం 11 గంటల మధ్య మరో ముగ్గురు చిన్నారులు తుదిశ్వాస విడిచారు.
చిన్నారుల మరణాల సంఖ్య గంటగంటకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ శనివారం ఉదయం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. వైద్య శాఖ మంత్రి సిద్దార్థ్ నాథ్ సింగ్ సహా శాఖల ఉన్నతాధికారులు, బీఆర్‌డీ మెడికల్ కాలేజీ డీన్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. చిన్నారులు చనిపోవడానికి కారణంగా భావిస్తోన్న ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం.. అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
అసలేం జరిగింది?
యూపీ సీఎం ఆదిత్యనాథ్ గతంలో ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్‌లో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ. గోరఖ్‌పూర్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన పేదలంతా వైద్యం కోసం ఇక్కడికే వస్తుంటారు. ఆస్పత్రిలో రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా కాంట్రాక్టును ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. అయితే కొద్ది నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో సుమారు రూ.70 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. పలుమార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేకపోవడంతో సదరు ప్రైవేటు సంస్థ.. ఆగస్టు 9 నుంచి ఆక్సిజన్ సరఫరా నిలిపివేసింది. దీంతో చిన్నారులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోవడం మొదలైంది. శనివారం ఉదయం 11 గంటల వరకు చనిపోయినవారి సంఖ్య 63కు పెరిగింది.