కోడెలకు కోర్టు సమన్లు
- ఏప్రిల్ 20న స్వయంగా హాజరుకండి
- ఎన్నికల వ్యయం కేసులో కరీంనగర్ కోర్టు ఆదేశం
కరీంనగర్, లీగల్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు కరీంనగర్ స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 20న స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆయన్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌లోని వావిలాలపల్లికి చెందిన సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి 2016 జూలై 11న కరీంనగర్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు.
‘‘2016 జూన్ 19న నేను ఒక తెలుగు టీవి న్యూస్ చానల్ చూస్తుండగా కోడెలకు సంబంధించిన కార్యక్రమం ప్రసారమైంది. అందులో భాగంగా ఎన్నికల్లో ఆయన ఖర్చుపెట్టిన వ్యయం గురించి ప్రస్తావన వచ్చింది. కోడెల మాట్లాడుతూ తాను 1983 మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రూ.30 వేలు మాత్రమే ఖర్చయిందని, ఆ మొత్తం కూడా గ్రామాల ప్రజల నుంచి చందాల రూపంలో వచ్చిందని చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తనకు రూ.11.5 కోట్లు ఖర్చయిందని సదరు చానల్ ఇంటర్వూ్యలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయేందుకు ఆయన ఏకంగా రూ.11.5 కోట్లు ఎలా ఖర్చు చేశారు? ఎన్నికల సంఘం అనుమతించిన వ్యయ పరిమితి కంటే దాదాపు 40 రెట్లు ఎక్కువగా ఖర్చు చేశారు! ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల ఖర్చు వివరాలన్నింటినీ ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. మరి ఇలా ఇంత అధిక మొత్తంలో ఖర్చు చేశారంటే ఓటర్లను, అధికారులను ఆయన మభ్యపెట్టారా? ఈ అంశాన్ని దర్యాప్తు చేయాలి’’ అని భాస్కర్‌రెడ్డి తన ఫిర్యాదులో కోర్టును కోరారు.
దీనిపై అంతకు ముందు ఆయన కరీంనగర్ త్రీ టౌన్‌లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఎన్నికలకు సంబంధించిన న్యాయస్థానానికి కేసును కోర్టు బదిలీ చేసింది. న్యాయపరిధిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో భాస్కర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు వివరాలను పరిశీలించిన హైకోర్టు, కేసును విచారించాలని చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ సీసీ నెంబరు 01/2017గా కేసు నమోదు చేసి ఎన్నికల వివాదాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరీంనగర్ స్పెషల్ జుడిషియల్ మేజిస్ట్రేట్ (మొబైల్ కోర్టు) కోర్టుకు కేసును బదిలీ చేసింది.