అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్? రీ కౌంటింగ్ కు పట్టు!
అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్? రీ కౌంటింగ్ కు పట్టు!
Published Thu, Nov 24 2016 10:58 AM | Last Updated on Fri, Aug 24 2018 6:21 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా స్వింగ్ రాష్ట్రాల్లో హ్యాకింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్వింగ్ రాష్ట్రాలైన మిచిగాన్, విస్కన్సిన్, పెన్సిల్వేనియా ఎన్నికల్లో హ్యాంకింగ్ జరిగిందనడానికి తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని ఆ దేశానికి చెందిన ప్రముఖ డేటా సైంటిస్టులు, ఎలక్టోరల్ న్యాయవాదులు చెబుతున్నారు. ఈ మూడు స్వింగ్ రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు.
కాగా, సైంటిస్టులు, ఎలక్టోరల్ న్యాయవాదుల ఆధారాలతో రీకౌంటింగ్ చేపట్టాలని గ్రీన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి జిల్ స్టెయిన్ డిమాండ్ చేశారు. ఇందుకోసం ఓ ఆన్ లైన్ ఫండ్ రైజింగ్ పేజీని ప్రారంభించి ఇప్పటికే 2 మిలియన్ డాలర్లను సేకరించారు. ఎన్నికల ఫలితాలను పునఃసమీక్షించేలా చేయడానికే నిధులు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఓటర్ల సమాచారం, పార్టీల డేటా బేస్ లు, కొంత మంది ఈ-మెయిల్ అకౌంట్లు ఎన్నికల సందర్భంగా హ్యాకింగ్ కు గురయ్యాయని అన్నారు.
2016 ఎన్నికల్లో గెలుపొందిన వ్యక్తి పదవిని చేపట్టకముందే హ్యాకింగ్ పై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. జిల్ స్టెయిన్ వ్యాఖ్యలపై స్పందించిన డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ప్రతినిధి హేమా అబెదిన్ ఎన్నికల హ్యాకింగ్ పై జస్టిస్ డిపార్ట్ మెంటు ద్వారా స్వతంత్ర విచారణ జరగాలని ప్రజలు కోరాలని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దాదాపు 2 మిలియన్ల పాపులర్ ఓట్లను గెలుచుకున్న హిల్లరీ క్లింటన్ ఎలక్టోరల్ కాలేజ్ సిస్టం వల్ల ఎన్నికల్లో ఓడిపోయారు.
మిచిగాన్, విస్కన్సిన్, పెన్సిల్వేనియాల్లో హ్యాకింగ్ కారణంగానే క్లింటన్ ఓడిపోయారని సైంటిస్టులు అంటున్నారు. ఎన్నికల్లో 70శాతం పేపర్ బ్యాలెట్లు(బ్యాకప్ కోసం) ఉపయోగించినా వాటిని సరిగా చెక్ చేయలేదని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ప్రొ.జే అలెక్స్ హాల్డర్ మ్యాన్ అన్నారు. అంతేకాకుండా ఓటింగ్ మెషీన్లు అన్నింటిలో సైబర్ సెక్యూరిటీ సమస్యలు ఉన్నట్లు చెప్పారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగి ఉంటే రిగ్గింగ్ కు ఆస్కారం ఉండేది కాదని అన్నారు.
మూడు స్వింగ్ రాష్ట్రాల్లోని నాయకులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించక తప్పదని చెప్పారు. ఎన్నికల ఓట్లు రీ కౌంటింగ్ కు చివరి అవకాశం ఈ శుక్రవారం నుంచి బుధవారం వరకూ మాత్రమే ఉంది. ట్రంప్ కు పెన్సిల్వేనియాలో 20, మిచిగాన్ లో 16, విస్కన్సిన్ లో10 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వచ్చాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వచ్చిన ఆధిక్యంతోనే అధ్యక్ష పదవికి అవసరమయ్యే 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను ట్రంప్ కైవసం చేసుకున్నారు.
Advertisement