ప్రాణాలకు తెగించిన కస్టమర్
ముంబయి: ఆర్ధిక రాజధాని ముంబయి నగర వీధిలో దారుణం చోటుచేసుకోబోయింది. వికలాంగుడైన రజ్నీష్ సింగ్ ఠాకూర్ అనే ఓ మొబైల్ షాప్ యజమానిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అదే సమయంలో షాపులో ఫోన్ కొనేందుకు వచ్చిన ఒక వినియోగదారుడు ఎంతో ధైర్యం చేసి ఆ వ్యక్తిని అడ్డుకోవడమే కాకుండా తన చేతుల్లో బంధించి పక్కన ఉన్న వ్యక్తులకు అప్పజెప్పాడు. ఆ వినియోగ దారుడు సాహసం చేసి ఉండకపోతే ఆ యజమాని చనిపోయేవాడు.
అప్పటికే హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి రెండుసార్లు కత్తితో దాడి చేయడంతో చేతికి, మెడకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ దృశ్యం అంతా కూడా ఆ షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటన వెనుక మొత్తం ఆరుగురు వ్యక్తుల హస్తం ఉందని పోలీసులు తేల్చారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి మరో ఇద్దరి కోసం గాలింపులు ప్రారంభించారు. అసలేం జరిగిందంటే.. ఈ మధ్య రౌడీయిజం చేస్తూ కొందరు వ్యక్తులు రోజుకు వెయ్యి రూపాయలు తమకు చెల్లించాలని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండాలని, ఎవరైనా మాముళ్లు ఇస్తే వారి షాపులు తగులబెడతామని కూడా ఆ పోస్టర్లో హెచ్చరించారు.
దీంతోపాటు ఎవరైనా వసూళ్లకు పాల్పడేవారు వస్తే తనకుగానీ, తన సోదరుడికిగానీ ఫోన్ చేయవచ్చని కూడా అందులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే వసూళ్లకు పాల్పడేవారు మొత్తం ఆరుగురు కలిసి రజ్నీష్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. మొత్తం ఆరుగురిలో ఐదుగురు కారులో కూర్చోగా ఒకరు మాత్రం కత్తితో వచ్చి సింగ్ పై దాడి చేయగా ఓ వినియోగదారుడు ధైర్యంగా అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి సింగ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ కస్టమర్ లేకుంటే తన సోదరుడు చనిపోయేవాడని సింగ్ సోదరుడు తెలిపాడు.