Yasangi
-
బ్లాక్‌లిస్టులో మిల్లులు.. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సెక్యూరిటీ డిపాజిట్ కానీ, బ్యాంక్ గ్యారంటీ కానీ లేకుండానే వేల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించే విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం ఇచ్చేటప్పుడే మిల్లర్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలని, సకాలంలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అప్పగించక పోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తాజాగా చర్చనీయాంశమైన 2022–23 రబీ సీజన్‌లోని 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) ధాన్యాన్ని సీఎంఆర్ చేయని, తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థలకు ధాన్యం అప్పగించని మిల్లులపై కొరడా ఝుళిపించనుంది. మిల్లర్ల విషయంలో ఉదాసీనత గత కొన్నేళ్లుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మిల్లర్ల విషయంలో అవలంభించిన ఉదాసీన వైఖరి ఇప్పుడు సర్కార్‌కు ఇబ్బందికరంగా మారింది. మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకున్న 2022–23 రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించిన 35 ఎల్ఎంటీల ధాన్యం రికవరీ బాధ్యతలను.. ప్రభుత్వం టెండర్ల ద్వారా నాలుగు సంస్థలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే 3 నెలలు గడిచినా 35 ఎల్‌ఎంటీల్లో 2 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా రికవరీ చేయలేదు. దీంతో విపక్షాలు ఈ ధాన్యం రికవరీ టెండర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2022–23 యాసంగి సీజన్లో మిల్లుల్లో నిల్వ చేసినట్లుగా చెపుతున్న ధాన్యాన్ని 4 కాంట్రాక్టు సంస్థలకు అప్పగించకపోతే.. వాటిని డిఫాల్ట్ మిల్లులుగా పేర్కొంటూ బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. 2022–23 యాసంగి ధాన్యంపైనే రచ్చ ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్ధతు ధరకు కొని..సీఎంఆర్ కోసం మిల్లులకు పంపడం జరుగుతుంది. ఖరీఫ్ ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి సీఎంఆర్ కింద అప్పగించే మిల్లర్లు, రబీ ధాన్యాన్ని మాత్రం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం)గా ఎఫ్‌సీఐకి ఇవ్వడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. రాష్ట్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రబీ ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలుగా విరిగిపోతాయి. ఈ నేపథ్యంలో 2021లో కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి బాయిల్డ్ రైస్‌ను సీఎంఆర్‌గా తీసుకునేది లేదని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపుల తర్వాత ప్రతి ఏటా 10 నుంచి 15 ఎల్ఎంటీల బియ్యాన్ని మాత్రమే బాయిల్డ్ రైస్‌గా తీసుకునేందుకు ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో 2020– 2021, 2021–2022లలో మిల్లర్లు రబీ ధాన్యాన్ని కూడా ముడిబియ్యంగా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించారు. కాగా 2022–23 రబీ సీజన్లో 65 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం యధావిధిగా మిల్లులకు అప్పగించింది. అయితే మిల్లర్లు ప్రభుత్వం వెసులుబాటు ఇచి్చన విధంగా సుమారు 20 ఎల్ఎంటీల ధాన్యాన్ని మాత్రమే బాయిల్డ్ రైస్‌గా మిల్లింగ్ చేసి, మిగతా ధాన్యాన్ని మిల్లులు, గోడౌన్లకు పరిమితం చేశారు. అప్పటి ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ, తాము యాసంగి బియ్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించలేమని మిల్లర్లు తెగేసి చెప్పారు. దీంతో పౌరసరఫరాల శాఖ మిల్లుల్లోని ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించగా ఏడు సంస్థలు క్వింటాల్ ధాన్యాన్ని సగటున రూ.1,860 చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. ధర తక్కువగా రావడంతో ఆ బిడ్లను రద్దు చేసిన అధికారులు మళ్లీ టెండర్లను పిలిచారు. ఈసారి 10 వేల టన్నుల కెపాసిటీ గల మిల్లర్లంతా టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు. అంటే ఏ మిల్లులో ఉన్న ధాన్యం ఆ మిల్లరే కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించారు. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో ఈ టెండర్లు ఆగిపోయాయి. కొత్త టెండర్లు.. స్కామ్ ఆరోపణలు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాగానే మిల్లుల్లో ఉన్న 2022–23 రబీ ధాన్యాన్ని విక్రయించడంపై దృష్టి పెట్టింది. కానీ ఈ ధాన్యాన్ని ఇంతవరకు ఎందుకు మిల్లింగ్ చేయలేకపోయారనే అంశంపై శ్రద్ధ పెట్టలేదు. ఎప్పటిలాగానే మిల్లర్లకు భారం కాకుండా నిబంధనలను మార్చి మిల్లుల్లో ఉన్నట్టు చెబుతున్న 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు కొత్తగా టెండర్లు పిలిచారు. ఆరు సంస్థలు ధాన్యం కొనుగోలుకు ముందుకు రాగా, మూడు నెలల క్రితం నాలుగు సంస్థలను ఎంపిక చేశారు. క్వింటాలు ధాన్యానికి సగటున రూ.2,007 రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేలా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 90 రోజుల్లోగా అంటే ఈనెల 23వ తేదీ లోగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి రూ.7 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. కానీ ఈ 4 సంస్థలు కలిపి ఇప్పటివరకు 2 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా సేకరించలేదని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లోపు విపక్షాలు ఈ తతంగాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వంపై ఆరోపణా్రస్తాలు సంధించడం మొదలు పెట్టాయి. మిల్లుల వద్ద ధాన్యానికి బదులు క్వింటాలుకు రూ.2,223 చొప్పున కాంట్రాక్టు సంస్థలు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. మొత్తంగా రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, ఈ ధాన్యం వేలం ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లోనే నిరుటి 35 ఎల్ఎంటీల రబీ ధాన్యం విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. 4 సంస్థలకు మరో 3 నెలల గడువు ఇవ్వడంతో పాటు అప్పటికి ధాన్యం అప్పగించని మిల్లర్లను డిఫాల్టర్లుగా గుర్తించి బ్లాక్‌లిస్టులో పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్లలో జవాబుదారీతనం పెంచేలా.. మిల్లర్లలో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఇకపై వారివద్ద సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ధాన్యం అప్పగించేటప్పుడే సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు. ఈ విధానాన్ని అమలు చేస్తే మిల్లర్లలో జవాబుదారీతనం పెరగడంతో పాటు ధాన్యం కొనుగోళ్ల కోసం చేసే అప్పులు కూడా కొంతవరకు తగ్గుతాయని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 3,500 పైగా రైస్ మిల్లులు ఉండగా, ఒక్కో మిల్లర్ నుంచి రూ.కోటి చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్నా రూ.3,500 కోట్లకు పైగా జమయ్యే అవకాశం ఉంది. ఏపీలో 100% సెక్యూరిటీ డిపాజిట్ ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాలు సెక్యూరిటీ డిపాజిట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. దీనివల్ల మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ అప్పగించకుంటే సెక్యూరిటీ డిపాజిట్‌ను జప్తు చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఏపీలో వంద శాతం సెక్యూరిటీ డిపాజిట్ అమల్లో ఉంది. అంటే మిల్లర్లు రూ.కోటి కడితే అంతే విలువైన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం ప్రభుత్వం అప్పగిస్తుందన్నమాట. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో 1:3 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటున్నారు. అంటే మిల్లర్లు రూ.కోటి చెల్లిస్తే రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని వారికి ఇస్తారు. -
రైతు భరోసా నిధుల విడుదల
సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయడం గమనార్హం. ఇప్పటివరకు ఐదెకరాలలోపు రైతులకే నిధులు విడుదల కాగా, సోమవారం ఐదెకరాలకు పైగా ఉన్న రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రైతుల ఫోన్లకు మెసే జ్లు కూడా వచ్చాయి. గత వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం రైతుబంధు సొమ్ము తీసు కున్న రైతులు 68.99 లక్షలు ఉన్నారు. ఈ యాసంగి సీజన్లోనూ అంతేమంది రైతులకు సొమ్ము విడుదల చేస్తా మని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఆ ప్రకారం 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లు విడుదల చేయాలి. కాగా ఇప్పటివరకు ఐదెకరాల వరకున్న రైతులకు రూ.5,202 కోట్ల రైతుబంధు సాయం అందిందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. తాజాగా ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.2,423 కోట్లు జమయ్యాయి. 6.65 లక్షల మందికి ‘భరోసా’రాష్ట్రంలో ఎకరా లోపున్న రైతులు 22.55 లక్షల మంది ఉన్నారు. మొత్తం రైతుల్లో వీరే అత్యధికం. అయితే వారి చేతిలో ఉన్న భూమి కేవలం 12.85 లక్షల ఎకరాలు మాత్రమే. ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది కాగా, వారి చేతిలో ఉన్న భూమి 25.57 లక్షల ఎకరాలు. రెండెకరాల నుంచి మూడెకరాల లోపున్న రైతులు 10.89 లక్షల మంది ఉండగా, వారి చేతిలో అత్యధికంగా 26.50 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇక మూడెకరాల నుంచి నాలుగెకరాల లోపున్న రైతులు 6.64 లక్షల మంది ఉండగా, వారి చేతిలో 22.62 లక్షల ఎకరాలుంది. నాలుగెకరాల నుంచి ఐదెకరాల లోపున్న రైతులు 5.26 లక్షల మంది రైతులు ఉన్నారు. వారి చేతిలో 21.04 లక్షల ఎకరాల భూమి ఉంది. మొత్తం ఐదెకరాలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. తాజాగా ఐదెకరాలకు పైగా ఉన్న 6.65 లక్షల మంది రైతులకు నిధులు అందజేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వివరించాయి. -
యాసంగి ధాన్యం కొనుగోళ్లు షురూ
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించింది. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తక్కువ ధరకు ధాన్యం దళారులకు విక్రయిస్తున్న తీరుపై గురువా రం ‘సాక్షి’ దినపత్రికలో ‘ధాన్యం.. దళారుల దోపిడీ’ శీర్షికన వార్త కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థను అప్రమత్తం చేసింది. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో 15 రోజుల క్రితమే కోతలు ప్రారంభం కావడంతో మిల్లర్లు, దళారులు కల్లాల నుంచే తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అధికారికంగా విక్రయాల కోసం ఏప్రిల్ 1వరకు వేచి ఉండాల్సి రావ డంతో రైతులు అగ్గువకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ అంశాలను వివరిస్తూ ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ప్రభుత్వం స్పందించి వెంటనే నిజామా బాద్, నల్ల గొండ జిల్లాల్లో అవసరమైన చోట 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన, అదనపు కలెక్టర్, డీసీ ఎస్ఓ, డీఎంసీఎస్‌ఓ తదితరులతో కలిసి అర్జాలబావిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా యడ్పల్లి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించారు. 7,149 కొనుగోలు కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సీజన్‌కు సంబంధించి 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 19 కేంద్రాలను ప్రారంభించామని వివరించింది. అవసరమైనచోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిచి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఇప్ప టికే సమాచారం అందించినట్లు సంస్థ పేర్కొంది.∙నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 19 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పౌరసరఫరాల సంస్థ -
ధాన్యం దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లుల్లో ఏడాది కాలంగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఆ ధాన్యాన్ని తక్కువ ధరకు పొందడం ద్వారా సర్కారు ఖజానాకు రూ. వందల కోట్ల నష్టం కలిగించేలా వ్యాపారులు, మిల్లర్లు చక్రం తిప్పుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ కనుసన్నల్లో సిండికేట్ అయి తమ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని 12 లాట్లుగా విభజించి బిడ్లు ఆహ్వానించగా క్వింటాల్ ధాన్యం సగటున రూ. 1,950కన్నా తక్కువ మొత్తానికి దక్కించుకునేలా 27 బిడ్లు మాత్రమే దాఖలు కావడం వ్యాపారుల కుమ్మక్కును స్పష్టం చేస్తోంది. కాగా, ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం బిడ్డర్లకు ధాన్యాన్ని అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న పౌరసరఫరాల సంస్థకు దాదాపు రూ. 1,500 కోట్లకుపైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ప్రక్రియకు పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులతోపాటు ఇతర ఉన్నతాధికారులు సహకారాన్ని అందించారనే ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. యాసంగిలో 66.84 ఎల్ఎంటీల సేకరణ రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ చేయించి ఎఫ్‌సీఐకి అప్పగించడం... ఎఫ్‌సీఐ నుంచి ధాన్యం సొమ్మును రీయింబర్స్ చేసుకోవడం అనే ప్రక్రియ గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ అప్పులు చేయడం... ఎఫ్‌సీఐ నుంచి డబ్బు తీసుకొని ఆ అప్పులు తిరిగి చెల్లించడం ఈ ప్రక్రియలో భాగమే. ఈ క్రమంలోనే 2022–23 రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి సుమారు 7 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 66.84 ఎల్ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధర కింద రూ. 13,760 కోట్లకుపైగా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేసింది. సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించింది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా..లెక్క చూపకుండా.. యాసంగి సీజన్లో క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 67 కిలోల ముడి బియ్యం (రా రైస్) ఎఫ్‌సీఐకి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి నిర్ణీత లెక్క ప్రకారం 67 కిలోల బియ్యం రావని, అందువల్ల బాయిల్డ్ రైస్‌గా అయితేనే మిల్లింగ్ చేస్తామని మిల్లర్లు తేల్చిచెప్పారు. యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటు మేరకు సుమారు 12 ఎల్ఎంటీల వరకు బాయిల్డ్ రైస్‌గా ఎఫ్‌సీఐకి ఇచ్చారు. మిగతా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు లెక్కలు చూపారు. అయితే నిల్వ ఉన్న ధాన్యంలో మేలు రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద ఇవ్వకుండా ఎక్కడికక్కడ బియ్యాన్ని మిల్లర్లు విక్రయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. సర్కార్ లెక్కల ప్రకారం ప్రస్తుతం మిల్లుల్లో కనీసం 50 ఎల్ఎంటీల ధాన్యమైనా నిల్వ ఉండాలి. కానీ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో టాస్‌్కఫోర్స్, విజిలెన్స్ జరిపిన తనిఖీల్లో ఈ మొత్తంలో ధాన్యం కాగితాల మీదే తప్ప భౌతికంగా లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తప్పిన వేలం మిల్లర్లు నిల్వ ఉంచిన ధాన్యాన్ని వేలం వేయాలని గత ఆగస్టులోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ మేరకు 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచగా 54 బిడ్లు దాఖలయ్యాయి. అప్పట్లో క్వింటాల్‌కు కనిష్టంగా రూ. 1,618, గరిష్టంగా రూ. 1,732, సగటున రూ. 1,670 ధర పలికింది. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ క్వింటాల్‌కు రూ. 2,060 కాగా రవాణా ఖర్చులు, నిల్వ వల్ల రుణాలపై పెరిగిన వడ్డీ కలిపి క్వింటాల్ ధాన్యానికి రూ. 2,300 వరకు అవుతుందని అప్పటి పౌరసరఫరాల కమిషనర్ అంచనా వేశారు. వేలంలో వచ్చే ధరతో పోల్చుకుంటే నష్టం వస్తుందనే కారణంతో ఆ టెండర్లను రద్దు చేశారు. నిబంధనలు మార్చి మరోసారి అక్టోబర్‌లో టెండర్లను ఆహ్వానించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ టెండర్లను నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించి మరోసారి ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జనవరి 25న ఐదుగురు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచి ఇటీవల ఫైనాన్షియల్ బిడ్లను తెరిచారు. బిడ్ల కనిష్ట ధర రూ. 1,920గా ఉన్నట్లు తెలిసింది. చక్రం తిప్పిన మాజీ సహకార సంస్థ చైర్మన్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినప్పటికీ వేలంలో రాష్ట్రంలో పలుకుబడిగల మిల్లర్లు, కొందరు వ్యాపారులే పాల్గొన్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ వేలం ప్రక్రియలో చక్రం తిప్పినట్టుగా పౌరసరఫరాల శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పలుకుబడి గల ఆయన కొత్త ప్రభుత్వంలోనూ తనదైన రీతిలో సిండికేట్ నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. క్వింటాల్ ధాన్యం రూ. 2 వేలలోపే ఉండేలా బిడ్డర్లతో రింగ్ అయినట్లు సమాచారం. వాస్తవానికి మిల్లుల్లో ఎంత యాసంగి ధాన్యం ఉందో కూడా సరిగ్గా తెలియదు. ఈ పరిస్థితుల్లోనే గత ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యం వేలం వేసేందుకు ప్రయత్నించింది. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 35 ఎల్ఎంటీలు విక్రయించేందుకు సిద్ధమైంది. విజిలెన్స్, టాస్‌్కఫోర్స్ తనిఖీల నేపథ్యంలో వీలైనంత తక్కువ ధరకు ధాన్యాన్ని దక్కించుకొని ప్రభుత్వానికి ఆ మేరకు డబ్బు చెల్లించడం ద్వారా గండం గట్కెక్కాలనే ధోరణిలో మిల్లర్లు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్ ధాన్యం రూ. 2,300 వరకు పలికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకుంటే..వేలం ప్రక్రియలో ముందుకెళ్లడం వల్ల సర్కారు ఖజానాకు రూ. 1,500 కోట్లకుపైగానే నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా టెండర్లపై ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. -
ధాన్యమేదీ.. వేలం ఎట్లా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా మార్చడం కోసం మిల్లులకు పంపిన లక్షల టన్నుల ధాన్యం మాయమైంది. రైస్‌మిల్లుల నిర్వాహకులు చాలా వరకు ధాన్యాన్ని ఎప్పుడో మర ఆడించి, బియ్యాన్ని అమ్మేసుకున్నా.. సర్కారుకు మాత్రం తమవద్దే ఉన్నట్టు లెక్కలు చూపుతూ వస్తున్నారు. దీనితో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని భావించిన సర్కారు.. గ్లోబల్ టెండర్లను ఆహ్వానించి విక్రయించాలని నిర్ణయించింది. ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా మరో నలుగురు సభ్యులతో కమిటీని కూడా నియమించింది. మిల్లుల్లో యాసంగి ధాన్యం ఎంత నిల్వ ఉందో తేల్చేందుకు అధికారులు తనిఖీలు చేపట్టగా.. మిల్లర్ల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మిల్లుల్లో గత యాసంగి ధాన్యాన్ని చడీచప్పుడు కాకుండా అమ్ముకున్నారని తేలడంతో.. నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్ని మిల్లుల్లో ఎంత యాసంగి ధాన్యం నిల్వ ఉందో లెక్క తేల్చే పనిలో పడ్డారు. రాష్ట్ర సర్కారుపై భారం 2022–23లో రాష్ట్ర సర్కారు సేకరించిన 66.84 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని మిల్లులకు పంపింది. మిల్లులు దాన్ని మర ఆడించి 45.07 ఎల్ఎంటీ బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా ఎఫ్‌సీఐకి పంపాలి. అయితే యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువగా వస్తాయని, సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యం తగ్గుతుందని మిల్లర్లు కొర్రీపెట్టారు. కేంద్రం సుమారు 16 ఎంఎల్టీ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్)గా మిల్లింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వడంతో.. ఆ మేరకు మర ఆడించి, 10.27 ఎల్ఎంటీ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇదిపోగా సుమారు 50లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లోనే ఉండాలి. దాన్ని మిల్లింగ్ చేసి 35 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. మిల్లులు బియ్యాన్ని అప్పగించని కారణంగా ఎఫ్‌సీఐ నుంచి నిధులు రాక.. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.18వేల కోట్ల భారం పడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆగిపోయి.. దీన్ని రికవరీ చేసుకునేందుకు మిల్లుల్లోని ధాన్యాన్ని విక్రయించాలని నిర్ణయించిన గత ప్రభుత్వం.. ఆగస్టులో 25 ఎల్ఎంటీ ధాన్యం విక్రయానికి గ్లోబల్ టెండర్లు పిలిచింది. ఆ టెండర్లలో 10 సంస్థలు అర్హత పొందినా.. క్వింటాల్ ధాన్యాన్ని సగటున రూ.1,865 ధరకే కొంటామంటూ బిడ్లు దాఖలు చేశాయి. ధర తక్కువకావడంతో ప్రభుత్వం ఆ టెండర్లను రద్దుచేసి.. పలు నిబంధనలను సడలిస్తూ అక్టోబర్ 7న మళ్లీ టెండర్లను ఆహ్వానించింది. ఎక్కువమంది బిడ్ వేసేందుకు వీలుగా.. ధాన్యం లాట్ల పరిమాణాన్ని, టర్నోవర్ అర్హతను తగ్గించింది. కొంత మంది కలసి జాయింట్ వెంచర్‌గా బిడ్డింగ్ దాఖలు చేసే అవకాశమూ ఇచ్చింది. దీనితో పెద్ద ఎత్తున టెండర్లు దాఖలయ్యాయి. మిల్లర్లు కూడా సిండికేట్ అయి ఎవరి మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని వారే కొనుగోలు చేసుకునేలా గ్రూప్ టెండర్లు వేశారు. కానీ అప్పటికి ఎన్నికల షెడ్యూల్ రావడంతో.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం టెండర్ల ప్రక్రియను నిలిపేసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత టెండర్ల ప్రక్రియను రద్దు చేసి.. కొత్తగా గ్లోబల్ టెండర్ల కోసం కమిటీని ఏర్పాటు చేసింది. మిల్లుల్లో ఉన్నట్టు లెక్క చూపించిన ధాన్యానికే ధరకట్టాలనుకున్న మిల్లర్ల ప్లాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు మిల్లుల్లో ధాన్యం నిల్వలపై ప్రభుత్వం తనిఖీలు చేపట్టడంతో.. అసలు సంగతి బయటపడింది. తనిఖీలు.. క్రిమినల్ కేసులు.. అధికారిక లెక్కప్రకారం 2022–23 యాసంగి ధాన్యమే 50లక్షల మెట్రిక్ టన్నుల మేర మిల్లుల్లో నిల్వ ఉండాలి. దానికి ముందు ఖరీఫ్ (వానాకాలం)కు సంబంధించిన ధాన్యం 8 లక్షల టన్నులు.. ఇటీవల సేకరించిన 2023–24 వానాకాలం ధాన్యం 45 లక్షల టన్నులు కూడా ఉండాలి. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలోని 3,300 రైస్‌మిల్లుల్లో కలిపి కోటి టన్నులకుపైగా ధాన్యం నిల్వలు ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన అధికారులకు ఎక్కడా తగినస్థాయిలో ధాన్యం కనిపించడం లేదు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్ డీఎస్ చౌహాన్‌ల ఆదేశాల మేరకు.. అదనపు కలెక్టర్ల నేతృత్వంలోని డీఎస్ఓలు, డీఎంల బృందాలు మిల్లుల్లో 2022–23 ఖరీఫ్, రబీ ధాన్యం లెక్కలను పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నాయి. ► ఇటీవల పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మిల్లర్లు ఏకంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికే ‘సీఎంఆర్’బియ్యాన్ని విక్రయించినట్టు తేలింది. దీనిపై కేసులు నమోదు చేస్తున్నారు. ► కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరులోని ఓ రైస్‌మిల్లుకు 38 టన్నుల ధాన్యం కేటాయించగా.. 23,504 క్వింటాళ్లు మాయమైనట్టు గుర్తించారు. రూ.7.18 కోట్లు జరిమానా చెల్లించాలని నోటీసులిచ్చి, మిల్లు నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ► మెదక్ జిల్లాలోని హవేలీ ఘన్‌పూర్‌లోని ఓ మిల్లులో రూ.4.75 కోట్ల విలువైన 1,422 టన్నుల ధాన్యం మాయమైనట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. ఇక్కడి డూర్గుపల్లిలోని ఓ మిల్లులో రూ.2 కోట్ల విలువైన బియ్యం మాయమైంది. ► సూర్యాపేట జిల్లాలో ధాన్యాన్ని పక్కదారి పట్టించిన 12 మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ► జోగులాంబ గద్వాల జిల్లాలోని 3 రైస్‌మిల్లులపై క్రిమినల్ కేసులు పెట్టారు. వనపర్తిలోని 5 మిల్లుల్లో స్టాక్‌లో భారీ తేడాలు ఉన్నట్టు గుర్తించారు. ► సిద్దిపేట జిల్లాలో 20 మిల్లులు వడ్లను అమ్మేసుకున్నట్టు తేల్చారు. ► నిజామాబాద్ జిల్లాలో 8 మిల్లుల్లోని స్టాక్‌లో రూ.33 కోట్ల మేర తేడాలు ఉన్నట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. అత్యధికంగా గంగారైస్ మిల్ నుంచి రూ.8.09 కోట్లు, రాయల్ ట్రేడింగ్ కంపెనీ రూ.6.48 కోట్లు, ఎంఎస్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ రూ.5.05 కోట్ల బకాయిలు ఉన్నట్టు గుర్తించారు. రెండు మిల్లుల్లోనే రూ.100 కోట్ల ధాన్యం తేడా! కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో భారీగా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పక్కదారి పట్టింది. ప్రభుత్వం సీఎంఆర్ కోసం కోదాడ మండలం కాపుగల్లులోని శ్రీ ఉషస్విని రైస్ ఇండస్ట్రీస్‌కు రూ.32 కోట్ల విలువైన ధాన్యం పంపగా.. మిల్లర్ ఒక్క బియ్యం గింజ కూడా తిరిగి పంపలేదు. అధికారులు ఈ మిల్లులో ఒక్క బస్తా ధాన్యం కూడా లేకపోవడాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఇక కోదాడ పట్టణంలోని ఓ రైస్‌మిల్లుకు వానాకాలం, యాసంగికి సంబంధించి మొత్తం 38,660 టన్నుల ధాన్యం పంపగా.. 26,036 టన్నుల బియ్యం రావాలి. కానీ మిల్లు యజమాని ఇప్పటివరకు 5,564 టన్నుల బియ్యమే తిరిగిచ్చారు. ఇంకా రూ.70 కోట్ల విలువైన 20,472 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. -
సాగర్ కింద సాగు వద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్లో నాగార్జునసాగర్‌తోపాటు కల్వకుర్తి, భీమా, పాలేరు, వైరా, మల్లూరు, లంకాసాగర్, గొల్లవాగు ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించాలని రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ (స్కివం) కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుత నీటి లభ్యత ఆధారంగా పెద్ద చిన్న ప్రాజెక్టులన్నింటి కింద కలిపి 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని సరఫరా చేయగలమని తేల్చింది. ఈ ఏడాది వర్షాభావంతో ఎగువ నుంచి ఆశించిన వరద రాక కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్, ఇతర ప్రాజెక్టుల్లో నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల కింద ఖరీఫ్ (వానాకాలం) పంటల సాగే కష్టంగా కొనసాగింది. కొంత మేర ఉన్న నీళ్లూ దీనికే సరిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని స్కివం కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం, తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని యాసంగి సీజన్లో ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించాలనే అంశంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ నేతృత్వంలో బుధవారం జలసౌధలో స్కివం కమిటీ సమావేశమై ప్రతిపాదనలను సిద్ధం చేసింది. 2023–24 యాసంగిలో 28.95 లక్షల ఎకరాలకు 215 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గత ఏడాది యాసంగి లక్ష్యం 33.46 లక్షల ఎకరాలకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. సాగర్ ఎడమ కాల్వ పరిధిలో కరువు నాగార్జున సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 157.61 టీఎంసీలు ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజీకిపైన వినియోగించుకోగలిగిన నీరు చాలా తక్కువ. దీనితో సాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు నీరివ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. ఎడమ కాల్వ కింద మొత్తంగా 6.40లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులోనూ 57 టీఎంసీలే నీళ్లు ఉండటంతో.. ఏఎమ్మార్పి, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీరివ్వలేని పరిస్థితి. కేవలం నెట్టెంపాడు కింద 5వేల ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30వేల ఎకరాలకే సాగునీరు ఇవ్వగలమని అధికారులు పేర్కొన్నారు. గోదావరి బేసిన్లో కాస్త మెరుగ్గా.. గోదావరి బేసిన్ పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 11.55లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఎస్సారెస్పీ నిల్వ సామర్థ్యం 90టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 78.66 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 6.50 టీఎంసీలను తాగునీటికి, మిగతా నీటిని యాసంగి పంటల కోసం కేటాయించారు. ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద మొత్తంగా 9,65,013 ఎకరాలు ఉన్నా.. 8,28,297 ఎకరాలకే సాగునీరివ్వాలని లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందులో 3.87 లక్షల ఎకరాలు ఆరుతడి పంటలకు, 4.41 లక్షల ఎకరాలు తరి పంటలకు నీళ్లు ఇవ్వనున్నారు. ఆన్ ఆఫ్ పద్ధతిలో సాగునీరు: స్కివం కమిటీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల తేదీలను ఖరారు చేసేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో.. అంటే 8 రోజులు నీటి విడుదల చేస్తూ, 7 రోజులు ఆపుతూ ఇస్తారు. ఇప్పటికే ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
ధాన్యం టెండర్లకు ఈసీ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం రెండో దఫా పిలిచిన టెండర్లకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. గతేడాది యాసంగికి సంబంధించిన సుమారు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో మూలుగుతోంది. ఈ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. దీంతోపాటు గత వానాకాలం ధాన్యం కూడా మిల్లుల్లో సీఎంఆర్ కింద మిల్లింగ్ జరు గుతోంది. మరోవారంలో కొత్త పంట మళ్లీ మార్కె ట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మిల్లుల్లోని ధాన్యా న్ని వదిలించుకునేందుకు ప్రభుత్వం తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించాలని నిర్ణయించింది. ఆగస్టులో పిలిచిన టెండర్లకు తక్కువ మొత్తంతో బిడ్లు రావడంతో వాటిని రద్దు చేసిన సర్కార్ ఈనెల 7న నిబంధనలు సడలిస్తూ రెండోసారి బిడ్లను ఆహ్వానించింది. ఈనెల 17తో గడువు ముగిసినప్పటికీ 21వ తేదీ వరకు గడువు పెంచారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్పుడు, టెండర్ల ప్రక్రియ ఎలా జరుపుతారని కాంగ్రెస్ సీనియర్ నేత జి.నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు టెండర్లను పిలవొద్దని ఆదేశించింది. -
యాసంగి సాగుకు సిద్ధం.. అందుబాటులో ఎరువులు, విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. గత సీజన్కంటే ఎక్కువగా పంటలు సాగు చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమైంది. దాదాపు 80 లక్షల ఎకరాల వరకు పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. అన్ని రకాల ఎరువులు కలిపి 18.64 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో యూరియా 9.2 లక్షల మెట్రిక్ టన్నులు. గత యాసంగి సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 33.53 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 56.44 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. అంటే 168 శాతం విస్తీర్ణంలో వరి సాగైంది. ఈసారి కూడా పెద్దఎత్తున వరి సాగవుతుందని అధికారులు అంటున్నారు. గత యాసంగి సీజన్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.63 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 6.48 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి కూడా మొక్కజొన్న సాగు పెరుగుతుందని చెబుతున్నారు. అప్పుడు వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.02 లక్షల ఎకరాలు కాగా, కేవలం 2.42 లక్షల ఎకరాల్లోనే (80.17%) సాగైంది. ఈసారి వేరుశనగ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని రైతులకు చెబుతున్నారు. ఎన్నికల సమయంలోనే రైతుబంధు? ఈ నెల ఒకటో తేదీ నుంచి యాసంగి సీజన్ ప్రారంభమైంది. రైతులు ఇప్పుడిప్పుడే పంటల సాగు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో రైతులకు రైతుబంధు సాయం కూడా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. సీజన్ మొదలైన నేపథ్యంలో రైతులకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని అందించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. ఆ ప్రకారం వచ్చే నెలలో రైతుబంధు నిధులు పంపిణీ చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఎన్నికలు ఉన్నందున రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు రైతులకు ఉన్నాయి. అయితే ఇది ఎప్పటి నుంచో అమలవుతున్న కార్యక్రమం కాబట్టి ఎన్నికలకు, దీనికి సంబంధం ఉండదని వ్యవసాయశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే రైతుబంధు నిధులు విడుదలయ్యే సూచనలు ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, గత వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ. 7,625 కోట్లు రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు కూడా అంతేమొత్తంలో ఆ సొమ్ము అందుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 11 విడతల్లో రూ. 72,815 కోట్ల నిధులు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. -
ధాన్యం అమ్మాలన్నా.. నగదు అందాలన్నా..రోడ్డెక్కాల్సిందేనా..?
మంచిర్యాలఅగ్రికల్చర్: యాసంగి ధాన్యం అమ్ముకోవడమే కాదు.. ఆ నగదు జమ కావాలన్నా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ధాన్యం విక్రయించి నెల రోజులు గడిచినా నగదు అందక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అప్పు చెల్లించడానికి, సాగు పెట్టుబడికి నగదు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామ రైతులు శుక్రవారం రాస్తారోకో చేశారు. జిల్లాలో 262 కొనుగోలు కేంద్రాల్లో 1.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ నెల 16వరకు జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ముగిసాయి. తరుగు, మిల్లర్ల తిరకాసు, గన్ని సంచులు, లారీల కొరత, అకాల వర్షాలతో అరిగోస పడ్డారు. క్వింటాల్‌కు ఐదు నుంచి పది కిలోల వరకు కోతలు పెట్టారు. ధర్నాలు, ఆందోళనలతో రోడ్డెక్కి ధాన్యం విక్రయించినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే నగదు జమ చేస్తామని అధికారులు, పాలకులు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. నగదు కోసం మరోసారి ఆందోళనలు చేపట్టాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. నగదు రూ.147.33 కోట్లు పెండింగ్ ఈ సీజన్లో 25,088 మంది రైతుల నుంచి 1,80,483.040 టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకు గాను రూ.353,74,67,584 రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఇప్పటివరకు 16,578 మందికి గాను రూ.206,41,63,488 ఖాతాల్లో జమైంది. ఇంకా 8,510 మందికి రూ.రూ.147,33,04,096 అందా ల్సి ఉంది. బుక్ కీపర్లు రైతుల నుంచి కొనుగోలు చే సిన ధాన్యం వివరాలను ట్యాబ్‌లో అప్లోడ్ చేసిన 48 గంటల్లోగా రైతు ఖాతాలో నగదు జమ కావాల్సి ఉంటుంది. కానీ నెల గడుస్తున్నా డబ్బులు అందక రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటికే వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సాగు పనులు చేపట్టారు. నగదు అందని రైతులు ఇంకెప్పుడు చెల్లింపులు చేస్తారోనని ఆందోళనలో ఉన్నారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచే డబ్బులు రాలేదని, జమ అయిన వరకు రైతులకు బది లీ చేశామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. నెలరోజులు దాటింది.. ధాన్యం విక్రయించి నెల రోజులు దాటింది. అయినా డబ్బులు ఖాతాలో జమ కాలేదు. 239 బస్తాలు తూకం వేసినా డబ్బుల చెల్లింపు లేకపోవడం దారుణం. రెండు రోజులలో పడుతయని చెప్పి నెల రోజులుగా తిప్పతున్నారు. సెంటర్ నిర్వాహకులను అడిగితే మిల్లు ట్యాగింగ్ కాలేదని చెబుతున్నారు. వానాకాలం సాగు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు చేతిలో పైసలు లేక తిప్పలు పడుడు అయితంది. – రైతు శివలాల్, గ్రామం: లింగపూర్, మం:దండేపల్లి ధాన్యం డబ్బుల కోసం రైతుల రాస్తారోకో దండేపల్లి: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం విక్రయించిన 40రోజులు దాటినా నగదు చె ల్లించకపోవడంతో ఆగ్రహించిన రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. మండలంలోని లింగా పూర్ గ్రామనికి చెందిన పలువురు రైతులు స్థాని కంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధా న్యం విక్రయించారు. ఖాతాలో నగదు జమ కాకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మా ట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మితే 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెబుతున్నారని, 40 రోజు లు గడుస్తున్నా ఖాతాలో జమ కావడం లేదని ఆరోపించారు. సహకార సంఘం కార్యాలయాని కి వెళ్లి అడిగితే మిల్లు ట్యాగింగ్ కాలేదని చెబుతున్నారని అన్నారు. వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సై ప్రసాద్ రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
బోరు బావులకు వర్షాలే ఆధారం
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ప్రకృతి వైపరీత్యాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగు సమయాన్ని ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. వానాకాలం ముందుగా చేపడితే యాసంగిలో సైతం మార్చి నాటికి పంట చేతికి వచ్చేలా సీజన్లను కుదించాలని నిర్ణయించింది. రైతులు వానాకాలంలో సాగునీటి వనరుల కింద సాధారణంగా జూన్ నుంచి నవంబర్ చివరి వరకు, వర్షాధారంతో జూన్ నుంచి డిసెంబర్ వరకు పంటల సాగు చేపడుతున్నారు. ఇలా చేయడం వల్ల తదుపరి పంటలకు వేసవిలో వడగళ్లు, అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లి రైతులు నష్టపోతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భూముల స్థితిగతులపై సర్వే చేయించింది. జిల్లాలో పండుతున్న పంటలపై ప్రభుత్వం సమగ్ర వివరాలను పంపించాలని కోరడంతో వారం రోజులుగా క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణాధికారులు సర్వే చేస్తున్నారు. ఏటా అతివృష్టి, అనావృష్టితో పంటలకు నష్టం జరుగుతుండటంతో సాగుకాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా.. జిల్లాలో ఏయే పంటలు పండిస్తున్నారు, సాగునీటి సౌకర్యం ఎన్ని ఎకరాలకు ఉంది, వర్షాధారంగా ఎన్ని ఎకరాలలో పంటలు సాగు చేస్తారనే సమాచారాన్ని ప్రభుత్వం కోరింది. వ్యవసాయశాఖతో పాటు నీటిపారుదల, విద్యుత్ శాఖల భాగస్వామ్యంతో సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ కావడంతో వారం రోజుల పాటు సర్వే చేపట్టి ఆన్లైన్లో నమోదు చేశారు. కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదించనున్నారు. ● కరువు జిల్లాగా, వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచిన మహబూబ్‌నగర్‌లోని ఉన్న ఏకైక కోయిల్‌సాగర్ ప్రాజెక్టు తప్పితే ఈ జిల్లాలో నీటి వనరులపై ఆధారపడి చేస్తున్న సాగు తక్కువగానే ఉంది. మరోపక్క నిర్మాణంలో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతుండటంతో సాగునీరు ఇప్పట్లో అందనే లేదు. దేవరకద్ర నియోజకవర్గంలో కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద వానాకాలంలో 35 వేల ఎకరాలు, యాసంగిలో 12 వేల ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారు. నీటి పారుదల, వర్షాధారంపైనే ఈ ప్రాంత రైతులు పంటలు పండిస్తున్నారు. నీటి వనరుల కంటే వర్షాధారంపైన 1,49,741 ఎకరాలల్లో పంటల సాగవవుతోంది. వ్యవసాయ సమగ్ర సర్వేలో అధికారులు ఈ లెక్కలను పక్కాగా తేల్చారు. ముందస్తు సాగు కోసం.. పంట చేతికి అందే సమయంలో ఏటా ప్రకృతి విపత్తుల కారణంగా నష్టం జరుగుతున్న నేపథ్యంలో పంట కాలాన్ని ముందుకు తీసుకెళ్లి.. రైతులు పంటలు సాగు చేసేలా వానాకాలం, యాసంగి ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాగు సమాచారాన్ని వ్యవసాయ విస్తరణాధికారులు ఏటా సేకరిస్తున్నారు. ఈ లెక్కలతో ఏయే పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారనే కచ్చితమైన సమాచారం వస్తోంది. అయితే ఇప్పటివరకు సాగునీటి కింద, వర్షాధారం ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారనే వివరాలు నమోదు కావడం లేదు. పైగా శాఖల వారీగా సాగునీటి సమాచారం పొంతన లేకుండా ఉంది. సాగునీటి సౌకర్యం ఎన్ని ఎకరాలకు ఉంది.. విద్యుత్ వినియోగం ఎంత అవుతుందనే సమాచారంలో వ్యత్యాసం ఉంటుంది. క్లస్టర్ల వారీగా ఆయా శాఖల అధికారుల సమన్వయంతో సమగ్ర సమాచారం సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సమగ్ర సమాచారం సేకరించాం ప్రభుత్వ ఆదేశాల మేర కు గ్రామాల వారీగా వర్షాధారంతో పాటు సాగునీటి సౌకర్యంతో పండించే విస్తీర్ణం ఎంత అనే వివరాలు సేకరించాం. సీజన్ ప్రారంభం కాగానే పంటల వారీగా సమగ్ర సర్వే ఉంటుంది. ప్రస్తుతం రైతులతో అనుబంధంగా ఉండే అన్ని శాఖల సమన్వయంతో సర్వే వివరాలు నమోదు చేశాం. కలెక్టర్ అనుమతితో ప్రభుత్వానికి నివేదించాం. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
సిద్దిపేట జిల్లాలో ముగిసిన యాసంగి ధాన్యం కొనుగోళ్లు...
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఒడిదుడుకుల మధ్య ముగిసింది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో జిల్లా యంత్రాంగం 416 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3.55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. బుధవారంతో జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ముగిశాయి. సీజన్ ప్రారంభంలో 5లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందని జిల్లా యంత్రాంగం అంచనా వేశారు. ఈ సారి యాసంగిలో కోతల సమయంలో వడగళ్లు, అకాల వర్షాలతో దిగుబడి తగ్గింది. కొందరు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసువచ్చిన తర్వాత సైతం వర్షాలు కురవడంతో రైతులు యాసంగి ధాన్యాన్ని అమ్మడం కోసం అష్టకష్టాలు పడ్డారు. తడిసిన వడ్లకు కాంట పెట్టకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం తీసుకున్నారు. తగ్గిన ధాన్యం జిల్లాలో యాసంగిలో 3.31లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోత దశలో వడగళ్లు, అకాల వర్షాలతో దిగుబడి పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా 416 కొనుగోలు కేంద్రాల ద్వారా 85,411 మంది రైతుల దగ్గరి నుంచి రూ.732.15కోట్ల విలువ చేసే 3,55,413 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ● గతేడాది కంటే యాసంగి సీజన్లో సాగు పెరిగినప్పటికీ దిగుబడి తగ్గింది. గతేడాది 2.62లక్షల ఎకరాలు సాగయితే 3.92లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సారి 37,055 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. రూ.111 కోట్లు పెండింగ్ ధాన్యం కొనుగోలు చేసిన పది నుంచి 15రోజులకు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో డబ్బులు చేతిలో లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ● రూ.732.15 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేయగా రూ.720.66కోట్ల విలువ చేసే ధాన్యం ట్యాబ్ ఎంట్రీ అయ్యాయి. ట్రక్ షీట్లు రూ.678.92కోట్ల విలువ చేసే ధాన్యంకు జనరేట్ అయ్యాయి. రూ.678.92 కోట్ల విలువ చేసే ధాన్యంకు మిల్లర్లు ఒకె చెప్పారు. ఇప్పటి వరకూ రైతులకు రూ.620.85కోట్లను చెల్లించారు. ఇంకా రూ.111.30కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. విజయవంతం యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. మంత్రి హరీశ్ రావు, కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేశాం. పెండింగ్‌లో ఉన్న ధాన్యం డబ్బుల చెల్లింపులు రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి అవుతుంది. – హరీశ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
గుండె తరుక్కుపోతోంది
జగిత్యాలలోని ఓ కొనుగోలు కేంద్రంలో మల్లయ్య అనే రైతుకు సంబంధించిన ధాన్యం కాంటా పెట్టారు. మరునాడు అందులో తాలు, గడ్డి ఉన్నాయని, తాము చెప్పినంత తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం దించుకుంటామని మిల్లు యజమాని నిర్వాహకులకు ఫోన్ చేశాడు. ఇదే విషయం నిర్వాహకులు మల్లయ్యకు ఫోన్ చేసి చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించాడు. కాంటాలు పెడతలేరు మాది ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామం. పది రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చా. నాలుగు రోజులు అవుతోంది బస్తాలు నింపి. ఇప్పటివరకు కాంటాలు పెడతలేరు. కొనుగోళ్లు అయితలెవ్వు. మబ్బులు పడుతుండడంతో తడుస్తయేమోనని భయంగా ఉంది. – బొమ్మగాని ఉప్పలయ్య, వరంగల్ జిల్లా సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోలేక కష్టాలు పడుతున్నారు. మరోవైపు తరుగు పేరిట మిల్లర్లు వారిని వేధిస్తున్నారు. ఏటా కోట్లాది రూపాయల రైతుల కష్టాన్ని తరుగు పేరిట దోచుకుంటున్నా.. ఈ యాసంగిలో ఇది శ్రుతి మించింది. మిల్లర్లు ఏకంగా రైతుకే ఫోన్లు చేసి ధాన్యం వెనక్కి తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఈ బెదిరింపులతో ఆందోళనకు గురవుతున్న రైతులు వారు చెప్పినట్లు తరుగుకు తలూపుతున్నారు. గతనెల 22న కొనుగోళ్లు ప్రారంభమైనపుడే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు మొత్తం మిలాఖత్ అయి క్వింటాల్‌కు ఏకంగా తొమ్మిది నుంచి పది కిలోల వరకు తరుగుతో దోపిడీకి తెరతీశారు. వాస్తవానికి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు నాలుగు కిలోల చొప్పున తరుగు తీశాక.. ఆ ధాన్యాన్ని మిల్లులో ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇక్కడే మిల్లు యజమానులు చక్రం తిప్పుతున్నారు. లారీలో వచ్చిన ధాన్యాన్ని మిల్లుల్లో దించడం లేదు. ధాన్యంలో తాలు, గడ్డి, మట్టి ఉన్నాయని, తమకు అవసరం లేదంటూ వేధిస్తున్నారు. ధాన్యం తీసుకెళ్లాలంటూ రైతులకు ఫోన్లు చేసి చెబుతున్నారు. దీంతో రైతులు మిల్లులకు పరుగులు పెడుతున్నారు. అలా వచ్చిన వారిని మరింత వేధిస్తూ మరింత తరుగు తీసైనా సరే తమ ధాన్యం కొనాలంటూ బతిమాలేలా మిల్లర్లు చేస్తున్నారు. మరోవైపు గన్నీ బ్యాగులు, లారీలు, టార్పాలిన్ల కొరత, ట్రాన్స్‌పోర్టు ఇబ్బందులు కూడా రైతులు తమ ధాన్యం అమ్ముకోవడానికి వీల్లేకుండా చేస్తున్నాయి. ఆసిఫాబాద్‌లో గింజ కూడా కొనలేదు.. ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 80.46 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 32 జిల్లాల్లో 7,183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంది. ఇప్పటివరకు ఇందులో 6,889 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరపగా.. అందులో 186 కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు. మొత్తం 32 జిల్లాల్లో దాదాపు 5.23 లక్షల మంది రైతుల నుంచి ఇప్పటి వరకూ దాదాపు 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. దీని విలువ దాదాపు రూ.6,934 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా. నల్లగొండలో అత్యధికంగా రూ.1,100 కోట్ల ధాన్యం, నిజామాబాద్‌లో రూ.1,030 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధికారులు.. ఆసిఫాబాద్‌లో శనివారం (20వ తేదీ) సాయంత్రం వరకు రూపాయి విలువైన ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ఓవైపు నైరుతి రుతుపవనాలు సమీపిస్తుండటం, మృగశిర కార్తెకు మరెన్నో రోజులు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కొనుగోలు ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తికాకపోతే.. ఇప్పటికే వడగండ్లు, అకాల వర్షాలకు దారుణంగా దెబ్బతిన్న తాము.. ఈ జాప్యంతో మరింత దారుణంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా పడిగాపులు మాది మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్లేపల్లి. 13 ఎకరాల్లో వరి సాగు చేస్తే సుమారు 260 కింటాళ్ల దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని ఈ నెల 7న స్థానిక కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. గత 15 రోజులుగా ఇక్కడికి ఒక్క లారీ కూడా రాలేదు. శనివారం కురిసిన వర్షానికి తడిసింది. మళ్ళీ కూలీలను పెట్టి ఆరబెట్టాల్సి వచ్చింది. – సూరినేని కమలాకర్, మంచిర్యాల రాత్రింబవళ్లు కుప్పల వద్దే వెంటవెంటనే కొనుగోళ్లు చేయకపోవడంతో రాత్రి, పగలు తేడా లేకుండా కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నాం. ధాన్యాన్ని కుప్పలుగా పోసి ఇప్పటికి 20 రోజులు అవుతోంది. తూకం వేసేందుకు హమాలీలు దొరకడం లేదు. లారీలు కూడా సకాలంలో రావడం లేదు. ఈసారి అసలే ధాన్యం దిగుబడి తగ్గింది. మరోవైపు రోజురోజుకు ధాన్యం బరువు దిగిపోతోంది. పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెబితే కానీ లారీ డ్రైవర్లు ఇటువైపు రావడం లేదు. – ప్రభాకర్, రైతు, తుక్కాపూర్, మెదక్ వెంటనే ధాన్యం కొనాలి 170 బస్తాలు కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి. వర్షాలు, దొంగల భయానికి రోజూ కావలి కాస్తున్నాం. ఇంకా కాంటా పెట్టడం లేదు. వెంటనే కాంటా పెట్టి ధాన్యం కొనాలి. – చిన్నయ్య, నికల్పూరు, డొంకేశ్వర్, నిజామాబాద్ -
తెలంగాణలో రికార్డు పంట.. గతంలో ఎన్నడూ లేనంతగా సాగు..!
రాష్ట్రంలో పంటల సాగు రికార్డులు బద్దలు కొడుతోంది. తెలంగాణ చరిత్రలోనే ప్రస్తుత వ్యవసాయ సీజన్లో పంటల సాగు కొత్త రికార్డులు నమోదు చేసింది. కొన్నేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం, విస్తారంగా కురిసిన వానలతో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలన్నీ నిండిపోవడం, భూగర్భ జలమట్టాలు పెరగడంతో.. ప్రస్తుత యాసంగి మొత్తం పంటల సాగులో, వరి సాగులో ఆల్‌టైమ్ రికార్డులను నమోదు చేసింది. ఇంతకుముందు యాసంగి సీజన్‌కు సంబంధించి అత్యధికంగా 2020–21లో 68.17 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. ఈసారి యాసంగిలో 68.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని బుధవారం విడుదల చేసిన నివేదికలో వ్యవసాయశాఖ వెల్లడించింది. 2014–15 యాసంగిలో 28.18 లక్షల ఎకరాల్లోనే పంటలు పండించగా.. మరో 40.35 లక్షల ఎకరాల సాగు పెరగడం గమనార్హం. వరి కూడా ఆల్‌టైమ్ రికార్డే... మొత్తం పంటల సాగుతో మాత్రమేకాకుండా.. వరి సాగు విషయంలోనూ ఈ యాసంగి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ప్రస్తుత యా సంగిలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఏకంగా 53.08 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నాట్లు వేయడానికి మరో పదిరోజుల పాటు సమయం ఉండటంతో.. వరి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా వానాకాలం సీజన్‌తో పోటీపడే స్థాయిలో యాసంగిలో వరి సాగు నమోదవుతోందని అంటున్నారు. 2014–15 యాసంగిలో 12.23 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ప్రస్తుతం ఏకంగా 53.08 లక్షల ఎకరాలకు పెరగడం గమనార్హం. అంటే గత తొమ్మిదేళ్లలో యాసంగిలో వరిసాగు 40.85 లక్షల ఎకరాలు పెరిగింది. 2015–16 యాసంగిలో కేవలం 7.35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగింది. ఆ తర్వాతి నుంచి పెరుగుతూ వచ్చింది. వాస్తవానికి ప్రస్తుత వ్యవసాయ సీజన్ (2022–23)లోని వానాకాలంలో కూడా వరిసాగు ఆల్‌టైం రికార్డు నమోదైంది. ఇటీవలి వానాకాలంలో 64.54 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయడం గమనార్హం. ఇంతకుముందు అత్యధికంగా 2021 వానాకాలంలో 61.94 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 2013 వానాకాలంలో ఇక్కడ 29.16 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ఇప్పుడది రెండింతలు దాటిపోవడం గమనార్హం. మొత్తంగా ఈసారి వానాకాలం, యాసంగి సీజన్లలో వరిసాగు ఆల్‌టైం రికార్డులను నమోదు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయాలతోనే భారీగా సాగు వానాకాలంలో చెరువులు నిండి పంటలు పండుతాయి. అలాంటిది యాసంగిలో కూడా రికార్డు స్థాయిలో పంటలు, వరి నాట్లు పడటం విశేషం. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మరోవైపు రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ బోర్లకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది. ఉచిత కరెంటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే భారీగా సాగు సాధ్యమైంది. రైతులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. రికార్డు స్థాయిలో పంటలు పండించిన రైతులకు అభినందనలు తెలుపుతున్నాను. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు కొన్నేళ్లుగా మొత్తం యాసంగి సాగు తీరు (లక్షల ఎకరాల్లో) ఏడాది సాగు విస్తీర్ణం 2014–15 28.18 2015–16 19.92 2016–17 39.20 2017–18 38.09 2018–19 31.49 2019–20 53.82 2020–21 68.17 2021–22 54.42 2022–23 68.53 కొన్నేళ్లుగా యాసంగి వరిసాగు తీరు (లక్షల ఎకరాల్లో) ఏడాది సాగు విస్తీర్ణం 2014–15 12.23 2015–16 7.35 2016–17 23.20 2017–18 22.61 2018–19 18.34 2019–20 39.31 2020–21 52.80 2021–22 35.84 2022–23 53.08 -
యాసంగిలో పత్తి ప్రయోగం
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో పత్తి సాగు చేయించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది. వాస్తవంగా వానాకాలంలోనే పత్తి సాగు చేస్తారు. అదే కాలం అనుకూలం కూడా. కానీ పత్తికి మంచి డిమాండ్ ఉండటంతో యాసంగిలోనూ సాగు చేసే అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిశోధనలు చేసింది. అవి ఫలించాయి. దీంతో దేశంలోనే మొదటిసారిగా యాసంగిలో పత్తిసాగు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. వరికి బదులుగా యాసంగిలో పత్తి సాగు చేయాలని రైతులకు వ్యవసాయశాఖ పిలుపు ఇచ్చింది. మరోవైపు సాగు కోసం భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) అనుమతి కోరింది. ఆ అనుమతి లాంఛనమేనని వ్యవసాయ విశ్వవిద్యాలయ వర్గాలంటున్నాయి. అలాగే.. పత్తి సాగుకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేయాలని కంపెనీలను వ్యవసాయశాఖ అధికారులు కోరినట్లు సమాచారం. ఇది విజయవంతమై మంచి దిగుబడులొస్తే.. మున్ముందు యాసంగిలో వరికి పత్తి ప్రత్యామ్నాయం అయ్యే అవకాశముంది. భారీ లాభాలు ఉన్నందునే..: దేశంలో పత్తి పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. అయితే ఈ ఏడాది వానాకాలం సీజన్లో పత్తి ప్రతిపాదిత లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, తీవ్రమైన వర్షాల కారణంగా 50 లక్షల ఎకరాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఇప్పుడు యాసంగిలో కొద్ది మొత్తంలో పత్తిని సాగు చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి పత్తిని వేయించాలని భావిస్తున్నారు. వానాకాలంలో పత్తికి మంచి ధర పలుకుతుంది. మద్దతు ధరకు మించి గతేడాది క్వింటాకు రూ.10 వేల వరకు వచ్చాయి. కాబట్టి యాసంగిలోనూ పత్తిని ప్రోత్సహిస్తే రైతులకు మరింత లాభం ఉంటుందని వ్యవసాయశాఖ భావిస్తోంది. గులాబీ రంగు పురుగు ఆశించే చాన్స్? కాగా, వానాకాలంలో, యాసంగిలో పత్తిని వేయడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంది. వానాకాలంలో పత్తికి గులాబీ రంగు పురుగు పడుతుంది. దీనివల్ల లక్షలాది ఎకరాల్లో దిగుబడి తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వానాకాలం తర్వాత వెంటనే యాసంగిలో వేయడం వల్ల అది కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వానాకాలంలో వేసిన పంటకు నవంబర్లోనే పత్తి పూర్తిగా తీసేయాలని సూచిస్తున్నారు. లేకుంటే గులాబీ రంగు పురుగు ఆశిస్తుందని, అది వెయ్యి కిలోమీటర్ల వరకు పాకుతుందని చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే... యాసంగిలో వేసే పత్తిని గతంలో జనవరి వరకు పరీక్షించారు. ఎండలు కూడా ఇబ్బంది కలిగిస్తాయని నిర్ధారణకు వచ్చారు. అయితే.. పరిశోధనల అనంతరం కొన్ని రకాల జాగ్రత్తలతో యాసంగిలో పత్తి వేయొచ్చని తుది నిర్ణయానికి వచ్చినట్లు విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. గతేడాది యాసంగిలో పత్తి సాగుపై చేసిన పరిశోధనలపై నివేదిక తయారు చేశామని, ఆ మేరకు ఐకార్‌కు ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. దీనిపై కేంద్రం నిర్ణయంతోపాటు జాతీయ విధానం రావాల్సి ఉందని, అనుమతి వస్తే పండిన పంటకు మద్దతు ధర వస్తుందని చెబుతున్నారు. కాగా పత్తి.. ఏ సమయంలో వేయాలన్న దానిపై అధికారులు త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు. -
57,151 ఎకరాల్లో యాసంగి సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి పంటల సాగు మందకొడిగా సాగుతోంది. గత సీజన్లో ఈ సమయానికి 1.37 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా ప్రస్తుత యాసంగిలో కేవలం 57,151 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ సీజన్లో అన్ని పంటలు కలిపి 46.49 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా ప్రస్తుతం అందులో 0.01 శాతమే పంటలు సాగయ్యాయి. అత్యధికంగా వేరుశనగ 41,772 ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత శనగ 5,585 ఎకరాలు, మినుము పంట 5,891 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ జిల్లాల్లో యాసంగి సాగు ఒక్క ఎకరాలో కూడా సాగు కాలేదు. వనపర్తి జిల్లాలో అత్యధికంగా 18,365 ఎకరాలు, నాగర్‌కర్నూలు జిల్లాలో 11,757 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వికారాబాద్ జిల్లాలో 6,204, మహబూబ్‌నగర్ జిల్లాలో 5,144 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కాగా, ఈసారి వరి అత్యధికంగా సాగవుతుందని అంచనా వేశారు. సాధారణ సాగు విస్తీర్ణ లక్ష్యం 31 లక్షల ఎకరాలు కాగా, నీళ్లు పుష్కలంగా ఉండటంతో భారీగా నమోదు అవుతుందని చెబుతున్నారు. -
యాసంగి వరికి ఆంక్షల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: ఈసారి యాసంగిలో వరి సాగుకు ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. గత యాసంగిలో వరి వేయొ ద్దని రైతులకు సూచించగా.. ఈసారి అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నందున వరి వేసుకోవడానికి ఆంక్షలు ఉండవని పేర్కొన్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో యాసంగి సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే వానాకాలం సీజన్‌కు సంబంధించి ఇంకా కోతలు పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ నడుస్తుండగానే యాసంగి వరిసాగుపై వ్యవసాయ శాఖ స్పష్టత ఇచ్చింది. ఈ యాసంగిలో వరి సాగు విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు. కేంద్ర ఎగుమతి విధానంతో మారిన సీన్ గత యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టింది. అయినా గణనీయంగానే వరి సాగవడం, ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తడం కూడా జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం గత నెలలో బియ్యం ఎగుమతికి సంబంధించి కొత్త విధానాన్ని ప్రకటించింది. కేంద్రం ముడి బియ్యం ఎగుమతులపై 20శాతం సుంకాన్ని, నూకల ఎగుమతిపై నిషేధాన్ని విధించింది. ఈ నిబంధన నుంచి బాస్కతి, బాయిల్డ్ రైస్‌లను మినహాయించింది. దీనివల్ల ముడి బియ్యం ఎగుమతులు తగ్గి, ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) ఎగుమతులు పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. తద్వారా ఉప్పుడు బియ్యానికి డిమాండ్ పెరుగుతుందని.. యాసంగి ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసి, ఉప్పుడు బియ్యంగా మార్చి ఎగుమతులు చేసే వెసులుబాటు పెరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రికార్డు స్థాయిలో సాగయ్యే అవకాశం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నీటి వనరులు అందుబాటులోకి రావడం, పలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవడం, మంచి వర్షాలతో కొన్నేళ్లు రాష్ట్రంలో వరి అంచనాలకు మించి సాగవుతుంది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో వరి సాగైంది. నిజానికి ఈ వానాకాలం సీజన్లో పత్తిసాగు పెంచాలని సర్కారు రైతులకు సూచించింది. 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని భావించింది. భారీ వర్షాలతో చాలాచోట్ల విత్తిన పత్తి దెబ్బతిన్నది సాగు 50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. మరోవైపు వరిని 45 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలకున్నా.. రైతులు 64.54 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. ఇప్పుడు యాసంగిలో వరిపై ఆంక్షలు ఎత్తివేయడం వల్ల గణనీయంగా సాగు పెరిగే అవకాశముంది. 2020–21 యాసంగిలో 52.28 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ప్రభుత్వ సూచనల మేరకు 2021–22 యాసంగిలో కాస్త తగ్గి 35.84 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ఈసారి ఆంక్షలు లేకపోవడం, వానలు కురిసి జల వనరులన్నీ నిండటం, భూగర్భ జలాలు పెరగడంతో.. 2020–21కు మించి వరి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొన్నేళ్లుగా యాసంగిలో వరిసాగు తీరు (లక్షల ఎకరాల్లో) ఏడాది సాగు విస్తీర్ణం 2017–18 19.20 2018–19 17.30 2019–20 38.62 2020–21 52.28 2021–22 35.84 -
వానాకాలం సీఎంఆర్‌పై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్)పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీఎంఆర్ గడువు ముగిసి మూడు రోజులైనా పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. యాసంగి సీఎంఆర్‌కు సెప్టెంబర్ 30 వరకు ఉన్న గడువును నెలరోజులపాటు పొడిగించిన కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ.. వానకాలం సీఎంఆర్ గురించి ఊసెత్తలేదు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు, మిల్లర్లు అయోమయంలో పడిపోయారు. 60 శాతమే పూర్తయిన వానాకాలం సీఎంఆర్ వానాకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ ఇప్పటివరకు 60 శాతమే పూర్తయింది. వానాకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 70.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు సీఎంఆర్ కింద 47 ఎల్ఎంటీ మేర ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు సుమారు 30 ఎల్ఎంటీ బియ్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చినట్లు సమాచారం. అంటే 60 శాతం సీఎంఆర్ మాత్రమే పూర్తయింది. మిగతా సీఎంఆర్‌తో పాటు యాసంగి సీఎంఆర్ పూర్తి చేసేందుకు మరో నెల గడువు పెంచాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే కేంద్రం మాత్రం కేవలం యాసంగి సీఎంఆర్‌కు సంబంధించిన గడువును మాత్రం అక్టోబర్ 31 వరకు పెంచుతూ గతనెల 27న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఈ లేఖలో ముగిసిన వానకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ గురించి ప్రస్తావించలేదు. గత కొంతకాలంగా సీఎంఆర్ ఆలస్యం ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా సీఎంఆర్ అప్పగించడంలో ఆలస్యమవుతోంది. ఈ విషయంపై ఏడాదిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మిల్లింగ్‌లో అవకతకవలు, పీడీఎస్ బియ్యం పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహించిన ఎఫ్‌సీఐ.. జూన్ 7వ తేదీ నుంచి 40 రోజుల పాటు సీఎంఆర్ తీసుకోలేదు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. జూలై నెలాఖరు నుంచి మిల్లింగ్‌కు అవకాశం ఇచ్చినప్పటికీ వర్షాల కారణంగా మిల్లుల్లో ధాన్యం తడిసిపోవడం, మిల్లులు నిలిచిపోయినప్పుడు కూలీలు, హమాలీలు సొంతూర్లకు వెళ్లిపోవడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో మిల్లింగ్ జరగలేదు. దీంతో సెప్టెంబర్ నెలాఖరు వరకు 60 శాతమే సీఎంఆర్ పూర్తయింది. ఈ విషయమై మంత్రి కమలాకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ గత నెల చివరివారంలో సమావేశమై సీఎంఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు కొనసాగితే ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఇతర రాష్ట్రాలకు పంపాలని కూడా నిర్ణయించి, ఎఫ్‌సీఐ అనుమతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మిల్లింగ్ వేగం పెరిగింది. కానీ సెపె్టంబర్ 30 తరువాత గడువు పొడిగించకపోవడంతో వానకాలం సీఎంఆర్‌పై నీలినీడలు కమ్ముకున్నట్లయింది. చదవండి: మునుగోడు దంగల్: కమలదళ కదనోత్సాహం.. ఫుల్‌జోష్‌తో బీజేపీ రెడీ -
యాసంగిలో తొలిసారి పత్తి సాగు
చెన్నూర్: వర్షాధారంగా సాగయ్యే పత్తి పంటను మంచిర్యాల జిల్లా రైతులు రాష్ట్రంలోనే తొలిసారిగా యాసంగిలో సాగు చేసి విజయం సాధించారు. ఈ ఏడాది పత్తికి డిమాండ్ ఉండడంతో మంచి లాభాలు ఆర్జించారు. చెన్నూర్ మండలం శివలింగాపూర్, అక్కెపల్లి గ్రామాల్లో ఎనిమిది మంది రైతులు 17 ఎకరాలు, లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల, దండేపల్లి, జైపూర్ మండలం కోటపల్లిలో కొందరు రైతులు ఐదెకరాల చొప్పున మొత్తంగా 37 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఇందులో ఇటిక్యాల గ్రామంలో కొడె తిరుమల్‌రావుకు ఐదెకరాల్లో.. ఎకరాకు 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ.10 వేలకు పైగా ధర పలకడంతో ఎకరానికి రూ.లక్షకు పైగా రాబడి వచ్చింది. శివలింగాపూర్, అక్కెపల్లి గ్రామాల్లో కొంతమందికి ఎకరానికి ఏడెనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. శివలింగాపూర్, అక్కెపల్లి గ్రామాల్లో పత్తి పంటను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం సంచాలకురాలు ఉమాదేవి తన బృందంతో పరిశీలించారు. రానున్న రోజుల్లో యాసంగిలో పత్తి సాగు చేస్తే బాగుంటుందని ఈ బృందం అభిప్రాయపడింది. ఈ పరిశోధన బృందం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే యాసంగిలో పత్తి సాగు చేయాలని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రయత్నం ఫలించింది.. యాసంగిలో వరికి బదులుగా 3.08 ఎకరాల్లో పత్తి సాగు చేశా. తొలి ప్రయత్నం ఫలించి పత్తి ఏపుగా పెరగడమే కాకుండా కాయ నాణ్యత బాగుంది. ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. యాసంగి పత్తి పంట లాభమే. – బత్తుల సమ్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎకరానికి రూ.లక్ష ఆంధ్రప్రదేశ్‌లో యాసంగిలో పత్తి సాగు చేస్తారు. తెలంగాణలో ప్రయత్నం చేద్దామని ఐదు ఎకరాల్లో పత్తి పంట వేశా. ఎకరానికి రూ.30 వేలు ఖర్చయింది. వర్షాధార పత్తి కంటే దిగుబడి బాగుంది. ఖర్చు కూడా తక్కువే. ఎకరానికి రూ.లక్ష ఆదాయం వచ్చింది. వచ్చే ఏడాది పది ఎకరాల్లో పత్తి వేస్తా. –తిరుమల్‌రావు, రైతు, ఇటిక్యాల డిసెంబర్లో సాగు చేస్తే మేలు.. చెన్నూర్ మండలంలో 17 ఎకరాల్లో పత్తి సాగైంది. పంట బాగుంది. ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి రైతులు జనవరిలో విత్తనాలు వేశారు. యాసింగిలో పత్తి సాగు చేయాలని ఆసక్తి ఉన్న రైతులు డిసెంబర్లో విత్తనాలు వేస్తే దిగుబడి మరింత పెరుగుతుంది. –మహేందర్, ఏవో, చెన్నూర్ -
తేలని మిల్లర్ల నూకల పరిహారం
సాక్షి, హైదరాబాద్: ‘యాసంగిలో పండే ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకల శాతం పెరుగుతుంది. తద్వారా మిల్లర్లకు నష్టం జరుగకుండా పరిహారం చెల్లిస్తాం. సీఎస్ కమిటీ టెస్ట్ మిల్లింగ్, నష్టపరిహారంపై తుది నిర్ణయం తీసుకుంటుంది.’ – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన ఇది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో కొన్నేళ్లుగా ఉప్పుడు బియ్యంగా మిల్లింగ్ చేస్తున్న యాసంగి ధాన్యాన్ని ఈసారి ముడిబియ్యంగా ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన పరిస్థితి. గతనెల 12న సీఎం కేసీఆర్ యాసంగి పంటను సర్కారే కొనుగోలు చేస్తుందని ప్రకటించి, ముడిబియ్యం మిల్లింగ్‌తో జరిగే నష్టాన్ని సైతం భరిస్తామని ప్రకటించారు. నూకల నష్టం అంచనాకు సీఎస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. సీఎం ప్రకటన తరువాత మంత్రి గంగుల.. మిల్లర్లతో సమావేశమై కొనుగోలు కేం ద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దించుకోవాలని చెప్పారు. కానీ, ఇప్పటివరకు సీఎస్ కమిటీ మిల్లర్లకు పరిహారంపై నిర్ణయం తీసుకోలేదు. సీఎస్ కమిటీ వారం క్రితం సమావేశమైనా.. నూకలకు నష్టపరిహారం ఎంతివ్వాలనేది స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లర్లు సేకరించారు. ఈ సీజన్లో 60 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం మిల్లింగ్‌కు వస్తుందని అంచనా. ప్రస్తుతం మిల్లుల్లో వానాకాలం ధాన్యం మిల్లింగ్ జరుగుతుండగా, కొద్దిరోజుల్లో యాసంగి ధాన్యాన్ని మరపట్టించాల్సి ఉంది. ఇప్పటికీ మిల్లింగ్ చార్జీలు, పరిహారం గురించి కమిటీ నిర్ణయం తీసుకోకపోవడం పట్ల మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం మిల్లులకు చేరాక సర్కార్ చేతులెత్తేస్తే తమ పరిస్థితి ఏంటని కరీంనగర్‌కు చెందిన ఓ మిల్లర్ వ్యాఖ్యానించాడు. సీఎస్ కమిటీ పరిహారం ప్రకటించాలని, లేనిపక్షంలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు పేర్కొన్నారు. సర్కార్ ఆఫర్ రూ.150.. మిల్లర్ల డిమాండ్ రూ.300: రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు అధికం. ఈ క్రమంలో యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి నూకలుగా మారతాయి. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం.. ‘కస్టమ్ మిల్లింగ్ ’విధానంలో క్వింటాలు ధాన్యాన్ని మరపట్టిస్తే 67 కిలోల బియ్యం రావాలి. సెంట్రల్ పూల్ కింద క్వింటాలు ధాన్యానికి 67 కిలోల బియ్యాన్ని సేకరించి, తదనుగుణంగా కనీస మద్దతు ధర రూ.1,960 రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇచ్చిన తరువాత రీయింబర్స్మెంట్ రూపంలో కేంద్రం నుంచి తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో యాసంగి ధాన్యం ముడిబియ్యంగా మారిస్తే వచ్చే నూకల నష్టాన్ని రాష్ట్రమే భరించాలి. ఈ నూకల నష్టం అంచనాకు సీఎస్ కమిటీ జిల్లాల వారీగా టెస్ట్ మిల్లింగ్ చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌లో నూకల శాతం అత్యధికంగా ఉండగా, ఇతర జిల్లాల్లో కొంత తక్కువగా ఉంటుంది. క్వింటాలు ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే వచ్చే నూకల శాతాన్ని లెక్కించి సగటున రూ.300 ఇవ్వాలని మిల్లర్లు కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం రూ.150 ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. ఒకవైపు ఎఫ్‌సీఐ అధికారులు ప్రత్యక్ష తనిఖీల పేరుతో భయబ్రాంతులను చేస్తుండగా, మరోవైపు యాసంగి ధాన్యం షరతులు లేకుండా కొనుగోలు చేయాలని మంత్రి అల్టిమేటం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో పరిహారం ఎంతో తేల్చకుంటే నష్టపోతామని మిల్లర్లు చెబుతున్నారు. కాగా సీఎస్ గురువారం పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశమై కొనుగోలు విధానంపై సమీక్షించారే తప్ప మిల్లర్లకు పరిహారంపై ప్రకటన చేయలేదు. ఇలాగైతే యాసంగి కొనుగోళ్లకు మిల్లర్లు కొర్రీలు పెట్టే అవకాశం ఉందని జిల్లాల్లో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రైతుల చెల్లింపుల కోసం రూ. 5 వేల కోట్లు సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణకు నిధుల సమస్య లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్పష్టంచేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్మును రైతుల ఖాతాలో వేసేందుకు రూ.5 వేల కోట్లను ప్రభు త్వం కేటాయించిందన్నారు. యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై బీఆర్కేఆర్ భవన్లో ఆయన గురువారం పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సాగేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 61,300 మంది రైతుల నుంచి 4.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 3,679 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎస్ చెప్పారు., అందుబాటులో 7.80 కోట్ల గన్నీబ్యాగులు రాష్ట్రంలో 7.80కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటు లో ఉన్నాయని సోమేశ్ తెలిపారు. మరో 8 కోట్ల గన్నీబ్యాగుల కొనుగోలు కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి కావచ్చిందన్నారు. మరో రెండున్నర కోట్ల గన్నీ బ్యాగులు జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా నుంచి రానున్నాయని చెప్పారు. కోనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా 17 జిల్లాల సరిహద్దుల్లో 51 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోకి... రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలిచ్చినట్లు సీఎస్ తెలిపారు. తద్వారా రైతులకు చెల్లింపులు త్వరితగతిన అవుతాయన్నారు. ఇప్పటివరకు 4.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు చేరిందని తెలిపారు. వరంగల్, గద్వాల్, వనపర్తి, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వరి కోతలు ఆలస్యమవుతాయని, కోతలు ప్రారంభం కాగానే ఆయా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతాయని చెప్పారు. -
తెలంగాణ వ్యవసాయ శాఖకు ప్రణాళిక ఉన్నట్లేనా?
ప్రణాళికా బద్ధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే రాష్ట్రాన్ని ఆగ్రగామిగా నిలబెడు తున్నామని, 2014 జూన్ నుండి ముఖ్యమంత్రి సహా తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన వ్యవసాయ విధానాన్నే టీఆర్ఎస్ ప్రభుత్వమూ అమలు చేస్తోంది. జూన్, జూలైల్లో ‘ఆక్షన్ ప్లాన్ తయారు చేయడం, వ్యవసాయ రుణ ప్రణాళిక తయారు చేయడం’ కొనసాగుతున్నది. ఈ ప్రణాళికలను అవసరాలను బట్టి కాకుండా గత సంవత్సరంపై కొద్దో గోప్పో పెంచి తయారు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, రుణాలు తదితర అంశాలపై సరైన అవగాహన లేదు. అధికారులకు ఉన్న అవగాహన మేరకు ఆక్షన్ ప్లాన్‌లో నమోదు చేస్తారు. ఏ ఫసల్ అనగా... వానాకాలం, యాసంగిలలో పంటలు ఎంత పండాలన్న అంశం కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఉజ్జాయింపుగా అంకెలు వేస్తున్నారు. లక్ష్యాలను నిర్ణయించినప్పుడు దేని ఆధారంగా లక్ష్యాలు నిర్ణయించారో కూడా తెలియదు. ప్రణాళిక లేకుండా వ్యవసాయాన్ని కొనసాగించడంతో రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యల నివారణ ప్రభుత్వ లక్ష్యంలో ఒక భాగంగా లేదు. రాష్ట్ర వ్యవసాయరంగానికి శాస్త్రీయ ప్రణాళికను చేర్చి, అందుకు అనుగుణంగా కార్యక్రమాల నిర్వహణ కొన సాగాలి. కానీ అలా జరగడం లేదు. ఉదాహరణకు 2021–22 వానాకాలం రాష్ట్ర ప్రభుత్వ ఆక్షన్ ప్లాన్‌లో మొత్తం సాగు విస్తీర్ణం 140,12,444 ఎకరాలు లక్ష్యంగా ప్రకటించారు. కానీ వాస్తవంగా సాగైంది 129,68,933 ఎకరాలు మాత్రమే. అనగా 10,43,513 ఎకరాలు తక్కువ సాగైంది. లక్ష్యంలో ఇంత పెద్ద మొత్తం తగ్గింపు చేయవచ్చా? అలాగే 2021–22 యాసంగిలో లక్ష్యం 68,16,720 ఎకరాలు పెట్టుకున్నారు. కానీ వాస్తవంగా సాగైంది 54,41,985 ఎకరాలు మాత్రమే. అనగా 13,74,735 ఎకరాలు తక్కువ సాగైంది. యాసంగిలో వరి పెట్టకూడదని ముఖ్యమంత్రితో సహా పెద్ద ఎత్తున విస్తృతమైన ప్రచారం చేశారు. అయినా ప్రణాళికలో 52,80,350 ఎకరాలు వరి పంట సాగు లక్ష్యంగా ప్రకటించారు. (క్లిక్: మరీ ఇంత రుసుమా.. ఉద్యోగాలకు అప్లై చేయాలా వద్దా?) పై గణాంకాలను చూస్తే... రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ ప్రణాళిక ఉందా? లేక నామకహః అధికారులు రాసిన ఆక్షన్ ప్లాన్‌ను మంత్రులు అంగీకరిస్తున్నారా అన్న అను మానం వస్తుంది. వ్యవసాయ సంబంధిత మంత్రులకు (వ్యవసాయశాఖ, సివిల్ సప్లై శాఖ, మార్కెటింగ్ శాఖ, ప్రకృతి వైపరీత్యాల శాఖ, వ్యవసాయ రుణ శాఖ) సమన్వయం లేక ఎవరికి తోచిన విధంగా వారు విధానాన్ని రూపొందించు కుంటున్నారు. ఏ పంటలు పండించాలో తెలియక రైతులు గందరగోళానికి గురై మార్కెట్లో ఏ విత్తనాలు అందు బాటులో ఉంటే ఆ విత్తనాలు వేస్తున్నారు. ఈ ఏడాది కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయనంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాలు తెరవనని పంతం పట్టింది. దీంతో వడ్ల కొనుగోళ్లు ఆగిపోయి రైతులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచిందనుకోండీ! గత 7 సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల రూ. 38 వేల కోట్లు నష్టపోగా రూ. 3,500 కోట్లు మాత్రమే సహాయం చేశారు. అసలు ప్రణాళికలో ఏనాడూ ప్రకృతి వైపరీత్యాల గురించి చర్చించక పోవడం శోచనీయం. రాష్ట్ర ప్రణాళికను రూపొందించే క్రమంలో ఈ దిగువ చర్యలు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. భూసార పరీక్షలు నిర్వహించాలి. భూసారాన్ని బట్టి విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో పెట్టాలి. వ్యవసాయ రుణాలను అందుబాటులో ఉంచాలి. వ్యవసాయ శాఖను గ్రామాలలో రైతులకు అనుకూలంగా ఉంచాలి. ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని సేకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారాలు చెల్లించాలి. మార్కెట్లో రైతులకు అందుబాటులో కమిటీలు పని చేయాలి. కనీస మద్దతు ధరలు అమలు జరపాలి. ఈ చర్యలను అమలు చేస్తూనే ప్రస్తుతం రాష్ట్రంలో అవసరం కన్నా తక్కువ పండుతున్న పంటలను పండించడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలి. (క్లిక్: వ్యాపారులకో నీతి... రైతులకో నీతి) - సారంపల్లి మల్లారెడ్డి వ్యవసాయ రంగ నిపుణులు -
రైతన్నా.. మీసం తిప్పెయ్..
ఖమ్మం మయూరి సెంటర్: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు. అక్కడికి వచ్చిన ఓ రైతు మీసాలను తిప్పిన మంత్రి.. ‘రైతులు మీసం తిప్పుకుని సగర్వంగా జీవించేలా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. (చదవండి: యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు: సీఎస్ సోమేశ్ కుమార్) -
ధాన్యంపై దాగుడుమూతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి వరి కోతలు వచ్చే నెల మొదటివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వాతావరణం అనుకూలించడంతో ఈసారి పంట దిగుబడి సంతృప్తికరంగా ఉంటుందనే నమ్మకంతో రైతులు ఉన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం కొనుగోలు విషయమై నెలకొన్న వివాదంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్ నెల ప్రారంభం కాబోతున్నా.. ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) సేకరించబోమని తెగేసి చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరుకు సిద్ధమైందే తప్ప.. రైతులు పండించిన ధాన్యాన్ని ఏం చేయాలో స్పష్టత ఇవ్వట్లేదు. కేంద్ర వైఖరి నేపథ్యంలో వానాకాలం పంట కొనుగోళ్ల సమయంలోనే సీఎం కేసీఆర్ యాసంగిలో వరి సాగు చేయవద్దని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల్లో ‘రైతులదే బాధ్యత’అన్న ధోరణిలో జిల్లాల రెవెన్యూ, పౌరసరఫరాల యంత్రాంగాలు ఉన్నాయి. ఉప్పుడు బియ్యంపైనే వివాదం.. యాసంగి ధాన్యం ఎక్కువగా అధిక వేడి కారణంగా నూకలుగా మారుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి 20 ఏళ్ల కిందటే ఎఫ్‌సీఐ ఉప్పుడు బియ్యం విధానాన్ని తెరపైకి తెచ్చింది. అప్పట్లో కేరళ, తమిళనాడు, అస్సాం, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో ఉప్పుడు బియ్యంకు ఉన్న డిమాండ్ దృష్ట్యా కేంద్రమే తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సేకరించింది. అయితే కొన్నేళ్లుగా ఉప్పుడు బియ్యం తినేవాళ్లు తగ్గడంతో ఎఫ్‌సీఐ గోదా ముల్లో నిల్వలు పెరిగిపోతున్నాయనేది కేంద్రం వాదన. ఈ క్రమంలో 2020–21 యాసంగి పంట సేకరణ సమయంలో కేంద్రం తన నిర్ణయాన్ని స్పష్టంగా రాష్ట్రానికి చెప్పింది. దేశంలోని ఏ రాష్ట్రం నుంచి కూడా ఉప్పుడు బియ్యం సేకరించట్లేదని, ఆయా రాష్ట్రాలకు ఇచ్చిన లక్ష్యాల మేరకు ముడిబియ్యమే సేకరిస్తామని చెప్పింది. ముడిబియ్యం తప్ప ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల రాష్ట్ర మంత్రుల బృందానికి తేల్చి చెప్పారు. అయితే ‘ఉప్పుడు, ముడిబియ్యంతో సంబంధం లేకుండా రైతులు పండించిన ధాన్యా న్ని కొనాలి..’అని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. తగ్గిన సాగు..పెరిగిన దిగుబడి గత సంవత్సరం యాసంగిలో 53 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా అత్యధికంగా 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. అయితే ఇటీవలి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి 36 లక్షల ఎకరాలకే వరిసాగు పరిమితమైంది. అయినా 70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం విక్రయానికి వస్తుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లకు మార్చి నాటికే ఏర్పాట్లు మొదలవుతాయి. ఏప్రిల్ రెండో వారం నుంచే కొనుగోళ్లు కూడా మొదలవుతాయి. కానీ ఈసారి అలాంటివేవీ లేవు. వరికోతలు పూర్తయిన తరువాత రైతులు ధాన్యాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలి? ఎవరికి విక్రయిస్తారో స్పష్టత లేకుండా పోయింది. కొన్ని మండలాల్లో రైతులతో మిల్లర్లు తక్కువ ధరకు ఒప్పందం చేసుకోవడం, విత్తనాల కోసం సీడ్ కంపెనీలు అవగాహన కుదుర్చుకోవడం మిన హా ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఏర్పాట్లూ లేవు. రైతులు నష్టపోవాల్సిందేనా? ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల కనీస మద్దతు ధరతో రైతు ధాన్యాన్ని విక్రయించుకుంటాడు. ఏ– గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.1,960, సాధారణ ధాన్యం రూ.1,940కి విక్రయిస్తారు. కేంద్రాలు లేనిపక్షంలో ధాన్యాన్ని నేరుగా మిల్లర్లు, దళారులు రైతుల నుం చి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారు. క్వింటా లుకు రూ.400 నుంచి రూ.500 వరకు తక్కువగా కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుందని, ఇదే జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోతారని అంటున్నారు. ప్రభుత్వాలు డ్రామాలు ఆపాలి యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి. కేంద్రాన్ని ఒప్పించి రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత రాష్ట్రానిది. డ్రామా లు ఆపి, వరి ధాన్యంపై నిర్ణయం తీసుకోవాలి. – వి.ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి, ఏఐకేఎంఎస్ మార్కెట్ సదుపాయం..మద్దతు ధర ముఖ్యం రైతులు పండించిన ధాన్యం ఎవరు కొంటున్నారనేది, ఎక్కడ అమ్ముతున్నారనేది ముఖ్యం కాదు. మార్కెట్ సదుపాయం కల్పించి, మద్దతు ధర అందేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. జిల్లాలో వరి తప్ప ఇతర పంటలను పండించే స్థితిలో ప్రస్తుత భూములు లేవు. అందువల్ల వరి సాగు తప్పలేదు. ఏదో విధంగా ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలి. లేనిపక్షంలో పోరాటం తప్పదు. – మండారి డేవిడ్ కుమార్, రైతు కూలీసంఘం రాష్ట్ర నాయకుడు, సూర్యాపేట జిల్లా ఐకేపీ కేంద్రాలు తెరవాలి ఈ వేసవిలో 9 ఎకరాల్లో వరి సాగు చేశా. ప్రభుత్వం దొడ్డు వడ్లు సాగు చేయవద్దు అనడంతో సన్న రకం సాగు చేశా. వెంటనే ఐకేపీ కేంద్రాలు నెలకొల్పి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మిల్లుకు అమ్మితే ధర తగ్గుతుంది. ఆర్థికంగా నష్ట పోతాం. – గుండాల హనుమయ్య, రైతు, నసీంపేట (సూర్యాపేట జిల్లా) -
రైతుబంధు.. టాప్‌లో ఏ జిల్లా అంటే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 62.99 లక్షల మంది రైతులకు యాసంగి రైతుబంధు సొమ్ము అందింది. మొత్తం 1.48 కోట్ల ఎకరాలకు చెందిన రైతుల ఖాతాల్లో రూ.7,411.52 కోట్లు జమయ్యాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రూ. 601,74,12,080 నిధులు అందాయి. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 33,452 మంది రైతులకు రూ.33.65 కోట్లు జమయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయరంగంలో కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధరలను ఆయా రాష్ట్రాలను, ప్రాంతాలను బట్టి నిర్ణయించాలని సూచించారు. పండించిన పంటలన్నీ కేంద్రం మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
రైతుబంధు.. అక్కడికెళ్తే సాయం బందు.. నిరాశగా వెనుదిరుగుతున్న రైతన్న
సాక్షి, హైదరాబాద్: యాసంగి సీజన్‌కు గాను పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బులు రాష్ట్రంలో చాలామందికి అందడం లేదు. రైతులు తీసుకున్న రుణాల కింద, రుణాలకు సంబంధించిన వడ్డీల కింద ఆ మొత్తాన్ని బ్యాంకులు జమ చేసుకుంటున్నాయి. కొన్ని బ్యాంకులు రైతుబంధు నిధులు రైతులు తీసుకోకుండా వారి ఖాతాలను ముందే ‘హోల్డ్’లో పెట్టేస్తున్నాయి. అంటే వారెలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేకుండా చేస్తున్నాయన్న మాట. రుణం లేదా వడ్డీ చెల్లిస్తే కానీ ‘హోల్డ్’తీసివేయబోమని నిక్కచ్చిగా చెబుతుండటంతో.. ప్రభుత్వ సాయం కోసం ఎంతో ఆతురతతో బ్యాంకులకు వెళ్లిన రైతులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. బ్యాంకర్ల వైఖరిపై కొందరు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట రుణాలు, వడ్డీలకు సంబంధించి కానీ, రుణాల రెన్యువల్‌కు సంబంధించి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. సర్కారు సాయం తమకు అందకుండా ఎలా చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాటికి 57,60,280 మంది రైతులకు రైతుబంధు కింద రూ.5,294 కోట్లు పంపిణీ చేశారు. ఇందులో 10 శాతం వరకు అంటే రూ.500 కోట్లకు పైగా మొత్తాన్ని బ్యాంకులు ఈ విధంగా ‘హోల్డ్’చేయడం లేదా రుణాల కింద జమ చేసుకోవడం జరిగి ఉంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత సీజన్లో ఇలాగే వ్యవహరించిన బ్యాంకులపై అప్పట్లో ప్రభుత్వం సీరియస్ అయినా, తీరు మార్చుకోకుండా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు బ్యాంకర్లను పిలిపించి మాట్లాడటంలేదన్న ఆరోపణలూ విన్పిస్తున్నాయి. రూ.5,294 కోట్లు పంపిణీ పంటల సాగు సీజన్లో పెట్టుబడి సొమ్ము లేక ఇబ్బందులు పడే రైతుల్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రెండుసార్లు యాసంగి, వానాకాలం సీజన్లకు ముందు ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం కింద నిర్ణీత మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ క్రమంలోనే యాసంగి సీజన్‌కు సంబంధించిన నిధుల పంపిణీని ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. ఈ సీజన్లో 66.61 లక్షల మంది రైతులకు చెందిన దాదాపు 1.52 కోట్లకు పైగా ఎకరాలకు గాను రూ.7,645 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు 60,16,697 మంది రైతులకు రూ.6008.27 కోట్లు పంపిణీ చేశారు. అయితే తమ వద్ద రుణం తీసుకొని చెల్లించని రైతులకు బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్బీఐ చట్టం ప్రకారం రికవరీ చేయాల్సిందే: బ్యాంకు వర్గాలు రుణాలు తీసుకున్న ఖాతాదారుల నుంచి డబ్బులు తిరిగి రికవరీ చేయడం తాము సొంతగా తీసుకున్న నిర్ణయమేమీ కాదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారమే ఇది జరుగుతుందని బ్యాంకర్లు వివరిస్తున్నారు. తాము ప్రత్యేకంగా ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉండదని, కంప్యూటర్ జనరేటెడ్ సిస్టమ్‌లో బ్యాంకులో ఎవరైనా ఖాతాదారుని రుణం పెండింగ్‌లో ఉంటే.. అకౌంట్లో ఏవైనా డబ్బులు జమ అయితే అవి అప్పు కింద జమ అవుతాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం రైతుబంధు నిధులను రైతు రుణాల కింద జమ చేసుకుంటున్న బ్యాంకుల్లో ఎక్కువగా చిన్న బ్యాంకులే ఉన్నాయని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో నడిచే పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఇలాంటి సమస్యలు లేవని బ్యాంకర్లు చెపుతుండగా, వడ్ల కొనుగోలు కింద ప్రభుత్వం జమ చేసిన నిధులను కూడా అంతకుముందు తీసుకున్న అప్పుల కింద కొన్ని బ్యాంకులు బిగపడుతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. బ్యాంకులకు గతంలోనే చెప్పాం: వ్యవసాయ శాఖ వర్గాలు రైతుబంధు నిధులను బ్యాంకర్లు రుణాల కింద జమ చేసుకోవడం సరైంది కాదని వ్యవసాయ శాఖ వర్గాలంటున్నాయి. ఆర్బీఐ నిబంధనలు ఏవైనా ఉండొచ్చు కానీ రైతులకు ప్రభుత్వం సాయం చేయడంలోని ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని వారు చెబుతున్నారు. రైతుబంధు నిధులు బ్యాంకులు జమ చేసుకునే పక్షంలో, ప్రభుత్వం సాయం చేసినా ప్రయోజనం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చి, వాటిని గత రుణాల కింద జమ చేసుకోవాలని, కొత్త రుణాలను క్రమం తప్పకుండా చెల్లించేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు బ్యాంకులకు చెప్పామని, లేఖలు సైతం రాశామని తెలిపారు. తమ ఒత్తిడి కారణంగానే 2019–20లో బ్యాంకర్లు జమ చేసుకున్న రైతుబంధు సాయాన్ని తిరిగి ఇచ్చేశారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 'మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ పంచాంగల్ తండాకు చెందిన లావుడ్యా నాయక్‌కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంట రుణం కింద గతంలో గండేడ్ ఎస్బీహెచ్లో రూ.1.5 లక్షలు తీసుకున్నాడు. బ్యాంకు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రెన్యువల్ చేయలేదు. ప్రస్తుతం అందరి రైతుల మాదిరిగానే ఆయనకు కూడా ప్రభుత్వం నుంచి రైతుబంధు డబ్బులు రూ.20 వేలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. అయితే ఈ మొత్తాన్ని బ్యాంకు అధికారులు అప్పు కింద అట్టే పెట్టుకున్నారు. వారం క్రితం వరకు ఆయన బ్యాంకు ఖాతాను ‘హోల్డ్’లో (లావాదేవీల నిలిపివేత) పెట్టలేదు. కానీ రైతుబంధు పడుతోందని తెలియగానే హోల్డ్‌లో పెట్టేశారని నాయక్ తెలిపాడు. డబ్బులు తీసుకురావడానికి బ్యాంకుకు వెళ్తే పంట రుణం బాకీ చెల్లిస్తేనే రైతుబంధు డబ్బులు ఇస్తామని అధికారులు చెబుతున్నారని' వాపోయాడు -
Paddy Farming: ఆదు‘కొంటారో’ లేదోనని..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం భావించినట్లు ఈ యాసంగి సీజన్లో వరి సాగు విస్తీర్ణం తక్కువ కానుందా? యాసంగి వడ్లు కొనబోమని స్పష్టం చేయడంతో రైతులు ఆ మేరకు సిద్ధమయ్యారా? ప్రస్తుత పరిస్థితి చూస్తోంటే పరిస్థితి అలానే ఉంది. ఈ నెల మొదటి వారం నుంచే సహజంగా వరి నాట్లు పెరుగుతాయి. కానీ చివరి వారంలోకి వచ్చినా వరి నాట్లు పుంజుకోలేదని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. యాసంగిలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 46.49 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.27 లక్షల (22%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 31.01 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 39,761 ఎకరాల్లో (1.25 శాతం)నే నాట్లు పడినట్లు వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వానికి నివేదించింది. గతేడాది యాసంగిలో ఇదే సమయానికి 1.31 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. వరి వద్దని ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో రైతులు వరి సాగుకు వెనకాడుతున్నారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా, ఈ సీజన్లో అన్నింటికంటే మినుము సాగు 245 శాతం పెరగగా, పప్పుధాన్యాల సాగు 112% పెరిగినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్‌లో అత్యధికంగా సాగు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో యాసంగి పంటల సాగు అత్యధికంగా నమోదుకాగా, మరికొన్ని జిల్లాల్లో చాలా తక్కువగా నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 97 శాతం పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఆ తర్వాత నాగర్‌కర్నూలు జిల్లాలో 78 శాతం, వికారాబాద్ జిల్లాలో 62 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అతి తక్కువగా పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో కేవలం ఒక శాతం చొప్పున మాత్రమే పంటలు సాగయ్యాయి. అలాగే మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రెండు శాతం, మెదక్, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో మూడు శాతం చొప్పున పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ పేర్కొంది.