Sakshi News home page

యాసంగి ధాన్యం కొనుగోళ్లు షురూ

Published Fri, Mar 29 2024 2:28 AM

Yasangi grain purchases started - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించింది. కొనుగోలు కేంద్రాలు లేక  రైతులు తక్కువ ధరకు  ధాన్యం దళారులకు విక్రయిస్తున్న తీరుపై గురువా రం ‘సాక్షి’ దినపత్రికలో ‘ధాన్యం.. దళారుల దోపిడీ’ శీర్షికన వార్త కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థను అప్రమత్తం చేసింది.

నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో 15 రోజుల క్రితమే కోతలు ప్రారంభం కావడంతో మిల్లర్లు, దళారులు కల్లాల నుంచే తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, అధికారికంగా విక్రయాల కోసం ఏప్రిల్‌ 1వరకు వేచి ఉండాల్సి రావ డంతో రైతులు అగ్గువకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు.

ఈ అంశాలను వివరిస్తూ ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ప్రభుత్వం స్పందించి వెంటనే నిజామా బాద్, నల్ల గొండ జిల్లాల్లో అవసరమైన చోట 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ హరిచందన, అదనపు కలెక్టర్, డీసీ ఎస్‌ఓ, డీఎంసీఎస్‌ఓ తదితరులతో కలిసి అర్జాలబావిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నిజామాబాద్‌ జిల్లా యడ్పల్లి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ ప్రారంభించారు.

7,149 కొనుగోలు కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సీజన్‌కు సంబంధించి 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో 19 కేంద్రాలను ప్రారంభించామని వివరించింది.

అవసరమైనచోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిచి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఇప్ప టికే సమాచారం అందించినట్లు సంస్థ పేర్కొంది.∙నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో 19 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పౌరసరఫరాల సంస్థ

Advertisement

What’s your opinion

Advertisement