T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్‌ కూడా కాదనలేడు! | That Will Be Grave Injustice Aakash Chopra on Dube Place in Ind T20 WC Playing XI | Sakshi
Sakshi News home page

Dube: బెంచ్‌కే పరిమితం చేస్తే.. అంతకంటే అన్యాయం ఉండదు!

Published Mon, Apr 29 2024 1:01 PM | Last Updated on Mon, Apr 29 2024 1:01 PM

శివం దూబే (PC: IPL.com)

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబే మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.

కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(98), డారిల్‌ మిచెల్‌(52)తో కలిసి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు 212 పరుగుల భారీ స్కోరు అందించాడు. తద్వారా రైజర్స్‌పై 78 పరుగుల తేడాతో గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.

కాగా ఐపీఎల్‌-2024లో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సీఎస్‌కే తరఫున మిడిలార్డర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్న దూబే.. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 350 పరుగులు చేశాడు.

ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టు ఇప్పటి దాకా సాధించిన ఐదు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌-2024 ఆడనున్న టీమిండియాలో అతడికి తప్పక చోటివ్వాలని డిమాండ్లు పెరిగాయి.

ఈ నేపథ్యంలో సీఎస్‌కే తాజా విజయం నేపథ్యంలో దూబే ఇన్నింగ్స్‌పై స్పందించిన భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిల్లాడు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని కేవలం ప్రపంచకప్‌ జట్టుతో పంపించడమే కాదు.

తుదిజట్టులోనూ అతడిని తప్పక ఆడించాలి. కేవలం ఎంపిక గురించి కాదు.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లోనూ చోటివ్వాలని సెలక్టర్లు ఫిక్సైపోవాలి. కెప్టెన్‌గానీ.. మేనేజ్‌మెంట్‌ గానీ అతడిని విస్మరించడానికి వీల్లేదు.

ప్రస్తుత టీమిండియా ప్లేయర్లలో అతడి కంటే బెటర్‌గా హిట్టింగ్‌ ఆడే బ్యాటర్‌ మరొకరు లేరు. ఒకవేళ అతడిని గనుక బెంచ్‌కే పరిమితం చేస్తే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌-2024 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జట్ల ప్రకటనకు మే 1 ఆఖరి తేదీగా పేర్కొంది ఐసీసీ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement