ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా ఆటగాడు శివమ్ దూబే వరుసగా విఫలమవుతున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. దూబే వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూబేను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
దూబే స్థానంలో రింకూ సింగ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆల్‌రౌండర్ కోటాలో జట్టులోకి తీసుకుంటే కనీసం బ్యాటింగ్‌కైనా న్యాయం చేయలేకపోతున్నాడని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2024 ఫామ్‌ను (14 మ్యాచ్‌ల్లో 162.30 స్ట్రయిక్‌రేట్‌తో 396 పరుగులు, 3 అర్దసెంచరీలు) చూసి హార్దిక్‌తో పోల్చి తప్పు చేశామని బాధపడుతున్నారు.
ఐపీఎల్‌లో హీరో ఇండియా తరఫున జీరో అంటూ ధ్వజమెత్తుతున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో గోల్డెన్ డకౌట్ కావడంతో దూబేపై అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొందరు అభిమానులు దూబేపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. కీలకమైన మ్యాచ్‌లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగి తొలి బంతికే ఔట్ కావడాన్ని అభిమానులు సహించలేకున్నారు.
వరుసగా విఫలమవుతున్నా దూబేకు అవకాశాలు ఇస్తున్నందుకు కెప్టెన్ రోహిత్ శర్మను తప్పుబడుతున్నారు. ఇచ్చిన అవకాశాలు చాలు ఫైనల్లో దూబేని తప్పించి ఇతరులకు అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నారు.
కాగా, ఇంగ్లండ్‌తో నిన్న (జూన్ 27) జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో దూబే విఫలమైనా టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తూ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించగా.. కోహ్లి (9), దూబే (0), పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.
అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్‌స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment