గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు | Sakshi
Sakshi News home page

గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు

Published Mon, Apr 29 2024 3:51 AM

10 thousand annually during the YSRCP government

గత ప్రభుత్వంలో వేట నిషేధ భృతి రూ.4 వేలే 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.10 వేలు 

డీజిల్‌ సబ్సిడీ రూ.6.03 నుంచి రూ.9కి పెంపు 

మత్స్యకార కుటుంబాలకు చేయూత, ఆసరా, అమ్మఒడి, ఇంటి స్థలాలు 

50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి సామాజిక పింఛన్లు 

ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ .. బీమా సౌకర్యం 

ప్రతి కౌంట్‌కు గిట్టుబాటు ధర..15 రోజులకోసారి సమీక్ష 

కంపెనీలు పెంచిన ఆక్వా ఫీడ్‌ ధరలు మూడుసార్లు ఉపసంహరణ 

స్థానిక వినియోగం పెంపునకు ఫిష్‌ ఆంధ్రా పేరిట డొమెస్టిక్‌ మార్కెటింగ్‌ వ్యవస్థ 

మత్స్యకారులు, ఆక్వా రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు

వారందరివీ రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు.. ఒక్క రోజు పనిలోకి వెళ్లకపోతే పస్తులుండాల్సిన పరిస్థితి.. వారికి తెలిసిన విద్య చేపల వేట మాత్రమే.. వివిధ కారణాల వల్ల స్థానికంగా చేపలు లభించని రోజుల్లో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి.. సముద్రంలోకి వేటకు వెళితే ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకు కరువు.. వేట నిషేధం సమయంలో అయితే కటిక దరిద్రం తప్పదు.. ఇదంతా ఐదేళ్ల క్రితం.. ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.. అన్ని విధాలా మత్స్యకారులకు అండగా నిలిచి భరోసా కల్పిస్తోంది.  

రికార్డు స్థాయిలో దిగుబడులు..ఎగుమతులు 
మత్స్య ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రొయ్యల ఉత్పత్తి 1.74 లక్షల టన్నులు ఉంటే.. ఈ 5 ఏళ్లలో 7.47 లక్షల టన్నులకు పెరిగింది. మంచినీటి రొయ్యల దిగుబడులు 10.04 లక్షల టన్నులు, ఉప్పునీటి రొయ్యల దిగుబడులు 7.06 లక్షల టన్నులకు చేరాయి. జాతీయ స్థాయిలో 77.55 శాతం ఏపీలోనే ఉత్పత్తి అవుతోంది. గ్రోత్‌ రేట్‌ జాతీయ స్థాయిలో 19.37శాతం ఉంటే, ఏపీలో 23.28 శాతంగా నమోదైంది. 2018–19లో రూ. 16,825 కోట్ల విలువైన 3.13 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అయితే, 2022–23లో రూ.19,847 కోట్ల విలువైన 3.29 లక్షల టన్నులు ఎగుమతయ్యాయి. 

చినలక్ష్మి సంతోషం 
ఈమె పేరు కారే చినలక్ష్మి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటకు చెందిన ఈమె కుటుంబానికి చేపల వేటే జీవనాధారం. వేట నిషేధ సమయంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేవలం రూ.2 వేలు మాత్రమే భృతిగా ఇచ్చేవారు. 2019లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దాన్ని రూ.4 వేలకు పెంచారు. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకంగా ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచింది. బోటులో ఆయిల్‌ నింపే  ప్రతిసారీ సబ్సిడీ వస్తోంది. 

ఆమె కుమార్తెకు నాలుగేళ్లపాటు అమ్మఒడి అందింది. ఈ ఏడాది డిగ్రీలో చేరడంతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనకు దరఖాస్తు చేసింది. చేయూత కింద రూ.18,750, ఆసరా కింద రూ.10 వేలు చినలక్ష్మికి జమ అవుతోంది. భర్తకు మత్స్యకార పింఛన్‌ మంజూరైంది. పొన్నాడ జగనన్న లేఅవుట్‌లో సెంటున్నర స్థలమూ ఇచ్చారు. అక్కడ సెంటు రూ. 2 లక్షలకు పైగా పలుకుతోంది. ఇంటి నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. ఇలా గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ లబ్ధి పొందలేదని.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలోనే తమకు మేలు జరిగిందని చినలక్ష్మి సంతోషంతో చెబుతోంది. 

కాకినాడ హార్బర్‌ ఓ ఉదాహరణ  
కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌లో 2018–19లో మెకనైజ్డ్, మోటరైజ్డ్, నాన్‌ మోటరైజ్డ్‌ బోట్లు 503 ఉండగా, వాటి సంఖ్య ప్రస్తుతం 578కు చేరింది. మెకనైజ్డ్‌ బోట్లు 398 నుంచి ఏకంగా 451కి పెరిగాయి. 2018–19 నాటికి వేటకు వెళ్లే వారి సంఖ్య 4,149 ఉంటే ప్రస్తుతం 4,763కు పెరిగింది. మెకనైజ్డ్‌ బోట్లపై వేటకు వెళ్లే వారి సంఖ్య 3,582 నుంచి 4,059 మందికి చేరింది. గతంలో బోట్లపై ఆధారపడి జీవనోపాధి పొందే వారి సంఖ్య 11,971 మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 14,541 మందికి పెరిగింది. మత్స్య దిగుబడులు 2018–19లో రూ.677 కోట్ల విలువైన 22,592 టన్నులు వస్తే 2023–24లో రూ.890.12 కోట్ల విలువైన 25,153 టన్నులు వచ్చాయి.  

ఆక్వా రంగానికి జవసత్వాలు 
ఆక్వా రంగం నిలదొక్కుకోవడానికి సీఎం వైఎస్‌ జగన్‌ చొరవ, కృషి ఎంతగానో ఉపయోగపడింది. ధరలు పతనమైన సమయంలో ఏ ఒక్క ఆక్వా రైతు నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం. ప్రాసెసింగ్‌ సంస్థలు 3 సార్లు పెంచిన ఆక్వా ఫీడ్‌ ధరలను ఉపసంహరించేలా చేయగలిగాం. ప్రభుత్వం నిర్దేశించిన గిట్టుబాటు ధరకే రొయ్యల కొనుగోలు చేయించగలిగాం. జోన్‌ పరిధిలో 10 ఎకరాల్లోపు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ విద్యుత్‌ సబ్సిడీ వర్తింప చేసాం. –వడ్డి రఘురాం, వైస్‌ చైర్మన్, ఏపీ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గంగపుత్రుల జాతకాలు మారిపోయాయి. గత ప్రభుత్వ కాలంలో వారు పడిన కష్టాలు తొలగిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో వారింట అన్నీ మీన రాశులే. వ్యయాలన్నీ ఆదాయాలుగా మారాయి. అవమానాల స్థానంలో రాజపూజ్యాలు ఎదురయ్యాయి. ఆక్వా రైతుల జీవన ప్రమాణాలు సైతం మెరుగుపడ్డాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆటుపోట్లు ఎదుర్కొన్న మత్స్యకారులు, సంక్షోభంలో చిక్కుకున్న ఆక్వా రైతులకు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది.    (పంపాన వరప్రసాద రావు, సాక్షి ప్రతినిధి, అమరావతి)

ఐదేళ్లలో మత్స్యకారులకు రూ.4913 కోట్ల లబ్ధి 
చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన 175 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ.17.50 కోట్ల పరిహారాన్ని ఈ ప్రభుత్వం అందజేసింది. చంద్రబాబు పాలనలో 300 మందికి అందిన సాయం కేవలం రూ.11.43 కోట్లు మాత్రమే. డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జీఎస్‌పీసీ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్‌ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు సాయాన్ని ప్రభుత్వం అందించింది. వివిధ పథకాల ద్వారా ఈ 5 ఏళ్లలో రూ.4913 కోట్ల లబ్ధి నేరుగా మత్స్యకారులకు అందించింది.   

అప్సడా చట్టాలతో ఆక్వా రైతుకు రక్షణ 
ఆక్వా కల్చర్‌ వ్యాపార కార్యకలాపాల పర్యవేక్షణ, నియంత్రణ, ప్రోత్సాహానికి వీలుగా ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ–2020, ఏపీ ఫిష్‌ ఫీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) యాక్ట్‌–2020(అప్సడా)లను అమలులోకి తీసుకొచ్చింది. ఇవి నేడు ఆక్వా రైతులకు రక్షణ కవచాలుగా నిలిచాయి. తీర ప్రాంత జిల్లాల్లో 35 ఆక్వా ల్యాబ్స్‌ ఏర్పాటుతో ఇన్‌పుట్‌ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. తీర గ్రామాల్లోని ఆర్బీకేల్లో 732 ఫిషరీస్‌ అసిస్టెంట్లను నియమించారు. 

ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్‌ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్‌పుట్స్‌ పంపిణీ చేస్తున్నారు. ప్రతి 15 రోజులకోసారి సమీక్షించి అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యల ధరల హెచ్చు తగ్గులను ‘అప్సడా’ ద్వారా మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ఐదేళ్లలో 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్‌ ధరలను వెనక్కి తీసుకునేలా చేసింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆక్వా రైతులకు బీమా సౌకర్యం కలి్పంచింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా డొమెస్టిక్‌ ఫిష్‌ మార్కెటింగ్‌కు స్కోచ్‌ అవార్డుతో పాటు 2021–22, 2023–24లలో బెస్ట్‌ మెరైన్‌ స్టేట్‌ అవార్డులు దక్కాయి. 

ఆక్వా రైతుకు రెట్టింపు ఆనందం  
ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా సాగు విస్తీర్ణం, దిగుబడులు, ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. బాబు హయాంలో ఆక్వా జోన్, నాన్‌ ఆక్వా జోన్‌ పరిధి నోటిఫై చేయడంలో జరిగిన నష్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి రీ సర్వే చేయించింది. దీంతో 3,56,278 ఎకరాల విస్తీర్ణం పెరిగింది. విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య 54072కు చేరింది. జోన్‌ పరిధిలోకి వచ్చిన 10 ఎకరాలలోపు సాగుదారులందరికీ యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే అందించడంతో మెజార్టీ ఆక్వా రైతులకు లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన విద్యుత్‌ బకాయిలు రూ.340 కోట్లు సహా ఈ ఐదేళ్లలో రూ.3497 కోట్ల సబ్సిడీ అందుకున్నారు.  

దేశానికే ఆదర్శంగా ఫిష్‌ ఆంధ్ర 
స్థానిక వినియోగం పెంచడం లక్ష్యంగా ఫిష్‌ ఆంధ్రా బ్రాండింగ్‌తో డొమెస్టిక్‌ మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌లో 40–60 శాతం సబ్సిడీతో జిల్లా స్థాయిలో ఆక్వా హబ్‌లు(రూ.కోటి), వాటికి అనుబంధంగా మినీ రిటైల్‌ అవుట్‌లెట్స్‌ (రూ.3లక్షలు), డెయి లీ (రూ.10లక్షలు), సూపర్‌(రూ. 20లక్షలు), లాంజ్‌ (రూ.50 లక్షలు) యూని ట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్ప టికే జిల్లా స్థాయిలో 2 ఆక్వా హబ్‌లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2,630 మినీ, 113 డెయిలీ, 66 సూపర్, 31 లాంజ్, 76 త్రీ వీలర్, 179 ఫోర్‌ వీలర్‌ యూనిట్లు మంజూరయ్యా యి. ప్రత్యక్షంగా 6941 మందికి, పరోక్షంగా 13,146 మందికి ఉపాధి లభిస్తోంది.  

నర్సాపురం వద్ద దేశంలోనే మూడో మత్స్య యూనివర్సిటీ 
నర్సాపురం సమీపంలో రూ.332 కోట్లతో 40 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. రూ.100 కోట్లతో పరిపాలనా భవనం, అకడమిక్‌ బ్లాక్, బాలుర, బాలికల హాస్టల్స్, రైతు శిక్షణ కేంద్రం, వైస్‌ చాన్సలర్‌ బంగ్లా, మలీ్టపర్పస్‌ బిల్డింగ్‌ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. యూనివర్సిటీ కోసం 140 పోస్టులు మంజూరు చేశారు. కార్యకలాపాలు 2023–24 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి. దీనికి అనుబంధంగా బీఎఫ్‌ఎస్సీ కోర్సుతో 60 సీట్లతో కొత్తగా నర్సాపురం ఫిషరీస్‌ కళాశాలను ఏర్పాటు చేశారు.  తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. 

ముత్తుకూరు మత్స్య కళాశాలలో సీట్ల సంఖ్యను 40 నుంచి 60కి పెంచారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మ పేటవద్ద రూ.36.55 కోట్ల అంచనాతో 30 ఎకరాల్లో ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ ఫెసిలిటీ సెంటర్‌ (ఏక్యూ ఎఫ్‌సీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. చెన్నై నుంచి కార్యకలాపాలు నిర్వహించే కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ (సీఏఏ) ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. సిబాతో పాటు మరికొన్ని కేంద్ర కార్యాలయాలను కూడా ఏపీకి తీసుకొచ్చేందుకు అడుగులు వేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement