కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు నిలుపుటద్దం
టీడీపీ హయాంలో ‘నీరు–చెట్టు’ పేరుతో రూ.కోట్ల దందా
టెండర్‌తో పనిలేకుండా రూ.200 కోట్ల స్వాహా
ఖాళీ స్థలాలు కనిపిస్తే దర్జాగా కబ్జా
హైదరాబాద్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి జైలు శిక్ష
అయినా పద్ధతి మార్చుకోక స్వస్థలంలోనూ దౌర్జన్యాలు
పంచాయితీకొచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.1.30 కోట్లు లాక్కున్న వైనం
తప్పుడు పత్రాలతో బ్యాంకులకూ బురిడీ
పేరేమో అందరికీ ‘ప్రియం’గా అనిపిస్తుంది.. వ్యవహార శైలి చూసినా, విన్నా అన్నీ అప్రియాలే... టీడీపీ హయాంలో మంత్రిగా అవకాశం లభించేసరికి దోపిడీకి లైసెన్సు పొందినట్లయింది.
ఈమె గారి పతి పేరులోనే దేవుడు...
∗ లీలల్లో రావణుడే... ఈ సతీపతుల విచ్చలవిడి దోపిడీకినంద్యాల సమీపంలోని ఓ నియోజకవర్గం అడ్డాగా మారింది. నీరు–చెట్టు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, తాగునీటి పేరిట వీరి అక్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వీరి దోపిడీని లెక్కగడితే రూ.వంద కోట్లు దాటి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ దంపతుల కంటికి నదురుగా ఎవరి స్థలమైనా కనిపించినా.. లేదా.. స్థల వివాదాల్లో న్యాయం చేయాలని ఎవరైనా వీరి వద్దకు వచ్చినా.. పిట్టపోరు.. పిట్టపోరు.. పిల్లి తీర్చిందన్న చందంగా ఆ స్థలాలను కాజేసే దాకా వీరు నిద్రపోరు.
∗మాయ మాటలతో రైతులను వంచించడంలో ఈ దంపతులను మించిన వారు లేరని వీరిఅఘాయిత్యాలే చెబుతాయి..
∗ఎవరైనా వీరి అన్యాయాలనుప్రశ్నించారో వారిపై విరుచుకుపడతారు. డబ్బుల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడరనివీరి చరిత్ర చెబుతోంది. జైలుకెళ్లి వచ్చినా పద్ధతి మార్చుకోకపోవడం వీరికే చెల్లింది.
సతి ఆదేశం.. పతి దౌర్జన్యం..
చింతకుంట గ్రామానికి చెందిన గూడా నరసింహుడు భార్య వెంకట లక్షమ్మకు ఆళ్లగడ్డ పట్టణ శివారులో 25 సెంట్ల స్థలముంది. ఆ స్థలాన్ని మహమ్మద్‌హుసేన్, నూర్ అహమ్మద్‌ల నుంచి 1995 మార్చి 27న కొనుగోలు చేసి రిజి్రస్టేషన్ చేయించుకున్నారు. రూ.2 కోట్ల విలువ చేసే ఈ స్థలం ఖాళీగా ఉండటాన్ని గమనించిన ఈ దంపతులు ఓ సర్వేయర్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ద్వారా 1952లో అల్లిసా పేరిట రిజి్రస్టేషన్ డాక్యుమెంట్‌ను బయటకు తీశారు. అవుకు మండలం సంగపట్నంలో నివసించే వారి మనవడు నూర్‌బాషాకు నచ్చజెప్పి మూడు భాగాలుగా చేసి 2022 డిసెంబర్1న అనుచరుల పేరున రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఇప్పుడు ‘గూడా’ దంపతులు లబోదిబోమంటున్నారు. ఈ అరాచక దంపతుల దౌర్జన్యంలో ఇది మరో కోణం.
సాక్షి, టాస్‌్కఫోర్స్: గత ప్రభుత్వంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన యువ మహిళా మంత్రి అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అక్రమాలను అవలీలగా చేసేశారు. ఇప్పుడామె అధికారంలో లేకున్నా... కబ్జాలకు కొదవలేదు. ఎదిరించేవారిపై దౌర్జన్యాలకూ వెనుకాడటం లేదు. ఆమెతోపాటు ఆమె రెండో భర్త చేసిన అరాచకాలు అన్నీఇన్నీకావు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ పనిచేసినా వారికి వాటాలు ముట్టజెప్పాల్సి వచ్చేది.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ నియామకాల్లోనూ ఈ సతీపతుల వసూళ్ల దందా సాగింది. అభివృద్ధి పనుల్లోనూ ఆ దంపతులు రూ.కోట్లలో పర్సంటేజీలు మూటగట్టుకున్నారు. చివరకు పారిశుద్ధ్య కార్మికుల నియామకంలోనూ వసూళ్లు కొనసాగించారు. వివిధ పనుల్లో టెండర్లతో పని లేకుండా రూ.200 కోట్ల వరకూ స్వాహా చేశారు. అధికారం కోల్పోయినా తమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
అభివృద్ధి పేరుతో అక్రమాలు...
ఆమె టీడీపీ హయాంలో నియోజకవర్గంలో వివిధ పనుల కోసం కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకుని వాటిని పక్కదారి పట్టించారు. అధికారులను బెదిరించి పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు. నియోజకవర్గ పరిధిలో జరిగిన ప్రతి పనినీ తన అనుయాయులకే టెండర్‌తో ప్రమేయం లేకుండా కట్టబెట్టించి వారి వద్ద పర్సంటేజీలు నొక్కేశారు.
దౌర్జన్యాలకు నిదర్శనాలివిగో..
∗ తాజాగా ఓ పంచాయితీ కోసం ఇంటికొచ్చిన ఓ ముస్లిం మైనార్టీ నాయకుడిని అందరూ చూస్తుండగానే మాజీ మంత్రి దంపతుల ఆదేశాల మేరకు అనుచరులు చితకబాది వారి వద్దనున్న రూ.1.30 కోట్లు దోచే యడం ఇప్పుడు సంచలనమైంది.
∗ జగత్ డెయిరీకి చెందిన అమాయక రైతుల పేర్లపై బ్యాంకు రుణాలు తీసుకుని మంత్రి తిరిగి చెల్లించకపోవడంతో ఆ రైతులు డిఫాల్టర్లుగా మారి పంట రుణాలూ పొందలేక అల్లాడిపోయారు.
∗ మంత్రిగా ఉన్నప్పుడు కమీషన్లకు ఆశపడి మున్సిపల్ శానిటరీ, స్వీపర్ పోస్టులతోపాటు టూరిజం శాఖలో విద్యుత్ సబ్‌స్టేషన్లలో ఉద్యోగాలను అమ్ముకున్నారు.
∗ నీరు చెట్టు పనుల్లో అడిగినంత కమీషన్ ఇవ్వలేదని భాచాపురం గ్రామ నాయకుడి చెక్‌బుక్ దొంగిలించి అతనిపై చెక్‌బౌన్స్ కేసు పెట్టి వేధించారు.
∗ మాజీ మంత్రి ప్రస్తుత భర్త ద్వారా ఖాళీ స్థలాలపై కన్నేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. భూ కబ్జాలకు పాల్పడి బాధితులను చంపుతామని బెదిరించారు. వ్యాపారవర్గాలను భయభ్రాంతులకు గురి చేశారు.
∗ అవసరమైనప్పుడు అప్పులిచ్చి ఆదుకున్న స్నేహితులు, శ్రేయోభిలాషులను మోసం చేశారు. రుణాలు ఎగ్గొట్టారు. వారిని ఇంట్లోకీ రానివ్వకుండా అవమానించారు.
∗ తండ్రి ఇంటిపేరును దుర్వినియోగం చేయడంతో విసిగిపోయిన బంధువులు ఆమెకు దూరమయ్యారు. ఆమెను, ఆమె భర్తను బహిష్కరించారు. ఎన్నికల్లో పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
∗ నాలుగేళ్లుగా హైదరాబాద్‌కే పరిమితమైన మాజీ మంత్రి దంపతులు ఇప్పుడు ఎన్నికలు రావడంతో పదవి కోసం మళ్లీ నియోజకవర్గంలో తిష్టవేశారు.
∗ నంద్యాలకు ఆనుకుని ఉన్న నియోజకవర్గంలోని మూడు మండలాల గుండా ప్రవహించే వక్కిలేరులో అప్పటి టీడీపీ మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు మూడేళ్ల పాటు ఏటా నీరు–చెట్టు పేరిట పనులు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 350 పనులుగా దీన్ని విభజించి తన బంధువులైన రామతీర్థ పుట్టాలమ్మ ఆలయ అప్పటి చైర్మన్ (ప్రస్తుత బీజేపీ నాయకుడు), అప్పటి సహకార సంఘం చైర్మన్, కోటకందుకూరు మాజీ సర్పంచికి అప్పగించారు.
వారు వాగులో అరకొర పనులు చేసి ఏకంగా రూ.3 కోట్లకు పైగా నిధులు కొల్లగొట్టారు. ఇందులో నాటి మంత్రికి సగం ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వర్క్ ఆర్డర్ లేకపోయినా అధికారులను బెదిరించి బిల్లులు చేయించుకున్నట్లు సమాచారం.
∗ రుద్రవరం మండలం నాగులవరం సమీపంలోని టీజీపీ పంట కాలువలో పూడిక తీసినట్టు అధికారులు బిల్లులూ మంజూరు చేశారు. ఇదే గ్రామానికి చెందిన నాటి మంత్రి అనుచరుడు ఇలాంటి పది పనులు సుమారు రూ.కోటితో చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నాలుగు పనులు నాసిరకంగా చేపట్టగా, ఆరు పనులను అసలు చేయకుండానే బిల్లులు ఆమోదింపజేసుకుని రూ.60 లక్షలు మింగేశారని సమాచారం.
ఇలా పైపై పనులు చేపట్టి దాదాపు రూ.130 కోట్ల మేర నాటి మంత్రి, జన్మభూమి కమిటీలు, వారి అనుచరులు బొక్కేశారు. రైతులకు ఉచితంగా ఇచ్చే శనగ విత్తనాల నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని ఇతర రాష్ట్రాల నుంచి మినుములను రప్పించి ఇక్కడి రైతులవే అని చెప్పి కొల్లగొట్టేశారు.
తాగునీటి సరఫరా పేరుతో దోపిడీ...
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమస్యను తమకు అనుకూలంగా మార్చుకుని అప్పటి మంత్రిగా అడ్డంగా దోచేశారు. పట్టణంలో ట్యాంకరుకు రూ.500 నుంచి రూ.750 వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. మంత్రి అనుచరులు ట్యాంకర్లను కొని మున్సిపాలిటీకి అద్దెకిచ్చారు. నీటిని వారు తరలించకుండానే కోట్లాది రూపాయలు దోపిడీ చేశారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వేషంలో వెళ్లి కిడ్నాప్..
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో 40 ఎకరాల భూమి ఆక్రమించుకునేందుకు మాజీ మంత్రి, ఆమె వర్గీయులు చేసిన కిడ్నాప్ సినిమాను తలపించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల వేషంలో వెళ్లి కిడ్నాప్ చేయడంతో అప్పట్లో సంచలనమైంది. అయితే తీరా కిడ్నాప్ చేసిన మనుషులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులు కావడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కిడ్నాప్ చేసిన వ్యవహారంలో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమె ఏ1 నిందితురాలు. నెలల తరబడి జైలు జీవితం గడిపారు. కిడ్నాప్ కేసులో ఓ మహిళా మాజీ మంత్రి జైలుకు వెళ్లడం అదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment