జూలై నాటికి ప్రారంభించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు
హైదరాబాద్ నుంచి 250 కి.మీ. పరిధిలోని పట్టణాలకు రాకపోకలు
సికింద్రాబాద్–గుంటూరు, సిర్పూర్ కాగజ్‌నగర్ వంటి రూట్లపై సర్వే
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ మార్గాల్లోనే!
హైదరాబాద్ నుంచి నల్లగొండ మీదుగా గుంటూరు, సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి మీదుగా కరీంనగర్, సికింద్రాబాద్–కర్నూలు, కాచిగూడ–కర్నూలు, సికింద్రాబాద్–నాందేడ్, సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా రాయచూర్ తదితర ప్రాంతాలకు ఈ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మొదట ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉన్న సికింద్రాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–విజయవాడ వంటి రూట్‌లలో వందే మెట్రోలను ప్రవేశపెట్టొచ్చు. అనంతరం దశలవారీగా ఇతర మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది.
ముఖ్యమైన స్టేషన్లలోనే హాల్టింగ్..
వందే మెట్రో రైళ్లు ప్రస్తుతం హైదరాబాద్‌లో నడుస్తున్న మెట్రో రైళ్ల తరహాలోనే ఉంటాయి. మొదట 12 కోచ్‌లతో ప్రారంభించి డిమాండ్‌కు అనుగుణంగా ఆ తరువాత 16 కోచ్‌ల వరకు పెంచనున్నారు. మెట్రో రైళ్ల తరహాలోనే పూర్తిగా ఏసీ సదుపాయం, ఆటోమేటిక్‌గా తలుపులు తెరుచుకొని మూసుకొనే ఏర్పాటు ఉంటుంది.
ప్రారంభ స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు ముఖ్యమైన స్టేషన్లలోనే ఈ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం ఉండనుంది. ప్రస్తుతం పుష్‌పుల్ రైళ్లకు ఉన్నట్లుగానే ముందు, వెనుక రెండు ఇంజన్లు ఉంటాయి. దీంతో ఈ రైళ్లను ప్రత్యేకంగా పిట్ లైన్లకు తరలించాల్సిన అవసరంలేదు. తక్కువ సమయంలోనే తిరుగు ప్రయాణ సేవలను అందించే అవకాశం ఉంటుంది.
రిజర్వేషన్లు ఉండవు...
ఈ రైళ్లన్నీ సాధారణ రైళ్ల తరహాలోనే సేవలు అందిస్తాయి. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్‌లు కొనుక్కొని బయలుదేరొచ్చు. కూర్చొని ప్రయాణం చేసేందుకు వీలుగా సీట్లు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే వీటిలో కొద్దిగా టికెట్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవాలనుకొనే వారికి ఈ రైళ్లలో ప్రయాణం లాభదాయకం. వివిధ మార్గాల్లో నడిచే ఇంటర్ సిటీ రైళ్ల స్థానంలోనే వందే మెట్రోలు రానున్నాయి. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్–విజయవాడ మధ్య నడుస్తున్న ఇంటర్‌సిటీ ట్రైన్ యథాతథంగా సేవలను కొనసాగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment