బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణతోపాటు ఆయన మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు హోళెనరసిపుర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా వైరల్ అవుతున్న అసభ్యకరమైన వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.
ఈ నేపథ్యంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి ఎమ్మెల్యే హెడ్‌డీ రేవణ్ణ స్పందించారు. అసభ్యకరమైన వీడియోల వ్యవహారం.. పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర. ఇక ఆ వీడియోలు నాలుగైదేళ్ల కిందటివని అన్నారు.
‘ఇలాంటిది ఒక కుట్ర జరుగుతుందని నాకు ముందే తెలుసు. నేను వాటికి భయపడి పారిపోయేవాడిని కాదు. మాకు వ్యతిరేకంగా విడుదల చేసిన వీడియోలు నాలుగైదేళ్ల కిందటివి. ప్రజ్వల్ విదేశానికి వెళ్లాడు. అతనికి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ గురించి తెలియదు’ అని హెచ్‌డీ రేవణ్ణ తెలిపారు. ఈ కేసులో చట్టపరంగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. కాంగ్రెస్ హయాంలో గత 40 ఏళ్లుగా సీఐడీ, సిట్ వంటి అనేక విచారణలు తాము ధైర్యంగా ఎదుర్కొన్నామని తెలిపారు.
ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్ భారత్ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment