కవిత అరెస్టు అక్రమం కాదు  | Sakshi
Sakshi News home page

కవిత అరెస్టు అక్రమం కాదు 

Published Thu, Apr 25 2024 4:34 PM

Court reserves order on BRS MLC Kavitha bail plea - Sakshi

మేనల్లుడు మేకా శరణ్‌ ఇండోస్పిరిట్స్‌లో ఉద్యోగి 

ప్రత్యేక కోర్టుకు స్పష్టం చేసిన ఈడీ 

బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు 

మే 6న తీర్పు వెలువరిస్తామన్న న్యాయమూర్తి 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అక్రమం కాదని ఈడీ పునరుద్ఘాటించింది. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 19 ప్రకారమే ఆమెను అరెస్టు చేశామంది. ఆమెకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు, ఆధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారించారు. ఈడీ తరఫు న్యాయవాది జొహెబ్‌ హొస్సేన్‌ తన వాదనలు కొనసాగించారు. ‘మద్యం విధానం మొత్తం తమకు అనుకూలంగా, లబ్ధి చేకూరేలా మార్చుకోవడంలో కవిత కీలక పాత్ర పోషించారు.

ఈ వ్యవహారంలో క్విడ్‌ప్రో కో జరిగింది. కమీషన్‌ 12 శాతానికి పెంచడం వల్ల హోల్‌సేల్‌ వ్యాపారులు రూ.581 కోట్లు సంపాదించగా, ఇండో స్పిరిట్స్‌కు సుమారు రూ.180 కోట్లు వచ్చింది. ఇండో స్పిరిట్స్‌లో ప్రాక్సీ ద్వారా కవిత వాటాదారుగా ఉన్నారు. మద్యం విధానంలో మార్పుల వల్ల ప్రజలు, ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. పాత పాలసీని పక్కన పెట్టడంతోపాటు మహాదేవ్‌ డిస్ట్రిబ్యూటర్‌ను బలవంతంగా తప్పించారు. కొత్త పాలసీని ముందుకు తీసుకెళ్లడంలో కేజ్రీవాల్‌ అనుచరుడు విజయ్‌నాయర్, నాటి మంత్రి మనీశ్‌ సిసోడియా, కవిత బినామీ అరుణ్‌ పిళ్లై కీలకపాత్ర పోషించారు.

పాలసీలో మార్పులు చేసినందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం అందింది. ఢిల్లీ మద్యం వ్యాపారంలో ఎల్‌1 లైసెన్సు కోసం కవిత తీవ్రంగా యతి్నంచగా, చివరకు నిందితుడు సమీర్‌ మహేంద్రు, మాగుంట రాఘవ, కవితలకు చెరో 33 శాతం వాటా దక్కింది. బుచ్చిబాబు, మాగుంట రాఘవల వాట్సాప్‌ చాట్‌లలో ఈ సమాచారం లభ్యమైంది’.. అని జొహెబ్‌ హొస్సేన్‌ చెప్పారు.  

‘కేజ్రీవాల్, సిసోడియా, కవిత మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు చెప్పారు. ఆప్‌తో కవిత సంబంధాలపై మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక వాంగ్మూలం ఇచ్చారు. కేవలం మద్యం వ్యాపారం గురించి మాట్లాడటానికే సచివాలయంలో కేజ్రీవాల్‌తో మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు. దీనిపై కవితను కలవాలని, ఆమే మొత్తం చెప్తారని కేజ్రీవాల్‌ తనకు చెప్పినట్లు శ్రీనివాసులురెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. కవితతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయినపుడు పాలసీ తమకు అనుకూలంగా మారుతుందని, అయితే ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని కవిత చెప్పారు.

ఈ క్రమంలో సొమ్ములు ఇవ్వడం ఆలస్యమైనపుడు మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు ద్వారా బెదిరింపులకు దిగారు. దీంతో మాగుంట రాఘవ ద్వారా రూ.10 కోట్లు బుచ్చిబాబుకు, రూ.15 కోట్లు అభిషేక్‌ బోయినపల్లికి అందజేశారు’అని జొహెచ్‌ హొస్సేన్‌ చెప్పారు. కవిత ఒత్తిడితోనే ఆరు నెలల తర్వాత వాంగ్మూలం మార్చుకుంటానని పిళ్లై అన్నారన్నారు. కవిత చెప్పిన మార్పులు, చేర్పులతోనే నూతన మద్యం పాలసీ బయటకు వచ్చిందని జొహెబ్‌ 
తెలిపారు. 

ఉద్యోగానికి రాకుండానే రూ.లక్ష జీతం 
కవిత మేనల్లుడు మేకా శరణ్‌ను ఇండో స్పిరిట్స్‌లో ఉద్యోగిగా చూపారని జొహెబ్‌ హొస్సేన్‌ తెలిపారు. రూ.లక్ష జీతగాడు అయిన శరణ్‌ ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాలేదన్నారు. ఢిల్లీ విచారణకు రావాలని పలుసార్లు కోరినప్పటికీ శరణ్‌ రాలేదని తెలిపారు. విచారణ సమయంలో కవిత ఇచ్చిన ఫోన్ల డాటా డిలీట్‌ అయిందన్నారు. ఇంటో పనిచేసే వారికి ఫోన్లు ఇచ్చామని చెబుతున్నారని, అయితే తాము నోటీసులు ఇచ్చిన తర్వాత రోజుల్లో డాటా డిలీట్‌ అయినట్లు ఫోరెన్సిక్‌లో తేలిందన్నారు. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వు చేస్తున్నామని, మే 6న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి చెప్పారు.  
 

Advertisement
Advertisement