టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టును ఏప్రిల్ 30న ప్రకటించారు. ఈ జట్టులో 15 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్స్ ఉన్నారు. రోహిత్ శర్మ ఈ జట్టుకు సారధిగా వ్యవహరించనుండగా.. హార్దిక్ అతనికి డిప్యూటీగా ఎంపికయ్యాడు.
రెగ్యులర్ జట్టులో విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లు ఉండగా.. శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.
అందరూ ఊహించిన విధంగానే ఐపీఎల్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్, శివమ్ దూబేలకు చోటు దక్కింది. యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చహల్, అర్షదీప్ సింగ్, సిరాజ్ మిగతా సభ్యులుగా ఎంపికయ్యారు.
ఈ జట్టును ప్రకటించిన అనంతరం పలువురు ఆటగాళ్లకు అన్యాయం (19 మంది సభ్యుల జట్టులో చోటు దక్కక పోవడంపై) జరిగిందని సోషల్‌మీడియా గగ్గోలు పెట్టింది. మాజీలు, విశ్లేషకులు రింకూ సింగ్, కేఎల్ రాహుల్, రుతురాజ్, రియాన్ పరాగ్, నటరాజన్, రవి భిష్ణోయ్ లాంటి ఆటగాళ్లను పక్కకు పెట్టడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
రింకూ సింగ్ విషయంలో కొందరు మాజీలు ఏకంగా సెలక్టర్లనే తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ గైడ్ విజ్డన్ ప్రపంచకప్‌కు ఎంపిక కాని అర్హులైన ఆటగాళ్లతో ఓ జట్టును ఎంపిక చేసింది.
ఈ జట్టుకు కేఎల్ రాహుల్ సారధిగా ఎంపికయ్యాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆయా ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా మిగతా జట్టు సభ్యుల ఎంపిక జరిగింది.
ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ, వన్‌డౌన్‌లో రుతురాజ్ గైక్వాడ్, నాలుగో స్థానంలో రియాన్ పరాగ్, ఐదో ప్లేస్‌లో తిలక్ వర్మ, ఆరో స్థానంలో శశాంక్ సింగ్, ఆల్‌రౌండర్ కోటాలో విశాఖ చిన్నోడు నితీశ్ కుమార్ రెడ్డి, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.. పేసర్లుగా హర్షిత్ రాణా, నటరాజన్ ఎంపికయ్యాడు. ఈ జట్టుకు విజ్డన్ భారత-బి జట్టుగా నామకరణం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment