చాంపియన్స్‌ ట్రోఫీకి టీమిండియా స్టార్‌ దూరం!? | Rishabh out Of CT Danger After Freak Hit by Hardik Pandya Shot: Reports | Sakshi
Sakshi News home page

చాంపియన్స్‌ ట్రోఫీకి టీమిండియా స్టార్‌ దూరం!?

Published Mon, Feb 17 2025 11:57 AM | Last Updated on Mon, Feb 17 2025 12:22 PM

Rishabh out Of CT Danger After Freak Hit by Hardik Pandya Shot: Reports

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌(Rishabh Pant) గాయపడ్డాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya) షాట్‌ కారణంగా అతడి మెకాలి(Knee Injury)కి గాయమైంది. దీంతో పంత్‌ నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దూరం కానున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.

అయితే, పంత్‌ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు సమాచారం. కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో పంత్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. వికెట్‌ కీపర్ల కోటాలో కేఎల్‌ రాహుల్‌తో పాటు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.

ఎడమ మోకాలికి  బలంగా తాకిన బంతి
ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్‌ సేన ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. ఆదివారం తొలి సెషన్‌ జరుగగా.. హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ఈ క్రమంలో అతడు బలంగా బాదిన బంతి పంత్‌ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయిన ఈ యువ ఆటగాడు నొప్పితో విలవిల్లాడాడు.

ఇంతలో అక్కడికి చేరుకున్న ఫిజియో కమలేశ్‌ జైన్‌ పంత్‌ను పరీక్షించాడు. హార్దిక్‌ పాండ్యా సైతం పంత్‌ దగ్గరకు వచ్చి అతడి పరిస్థితి ఎలా ఉందో అడిగితెలుసుకున్నాడు. అయితే, కాసేపటి తర్వాత ఈ వికెట్‌ కీపర్‌ సాధారణ స్థితికి చేరుకున్నాడు. తొలి దఫాలో బ్యాటింగ్‌ చేసిన ఆటగాళ్లు నిష్క్రమించిన తర్వాత తాను కూడా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనిని బట్టి పంత్‌ గాయం అంత తీవ్రమైనదని కాదని తేలిపోయింది.

కాగా 27 ఏళ్ల రిషభ్‌ పంత్‌ తొలిసారిగా చాంపియన్స్‌ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ జట్టులోనూ అతడికి స్థానం ఉన్నా.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. సీనియర్‌ కేఎల్‌ రాహుల్‌కు ప్రాధాన్యం ఇచ్చిన నాయకత్వ బృందం.. మూడు వన్డేల్లోనూ అతడినే ఆడించింది.

పంత్‌ బెంచ్‌కే పరిమితం!
ఫలితంగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025 తుదిజట్టులోనూ పంత్‌కు అవకాశం రాదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. అంతేకాదు.. కేఎల్‌ రాహుల్‌కు వన్డేల్లో ఉన్న రికార్డు దృష్ట్యా అతడినే ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. 

దీంతో పంత్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. కాగా కేఎల్‌ రాహుల్‌ చివరగా ఐసీసీస వన్డే వరల్డ్‌కప్‌-2023లో 500 పరుగులు సాధించాడు. అందుకే ఈ మెగా టోర్నీలోనూ అతడికే వికెట్‌ కీపర్‌గా మొదటి ప్రాధాన్యం దక్కనుంది.

ఇదిలా ఉంటే.. చాంపియన్స్‌ ట్రోఫీలో గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌.. గ్రూప్‌-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ పోటీ పడనున్నాయి.  కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్‌ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్‌ ఆరంభం కానుంది.  ఇక టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్‌లో తమ తొలిమ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

చదవండి: CT 2025: కోహ్లి, హెడ్‌ కాదు!.. టాప్‌ రన్‌ స్కోరర్‌గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement