ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జట్టులో రిషభ్ పంత్‌కు చోటు దక్కడంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ స్పందించాడు. సంజూ శాంసన్(Sanju Samson)ను కాదని.. సెలక్టర్లు ఈ ఉత్తరాఖండ్ ఆటగాడి వైపు మొగ్గుచూపడానికి గల కారణాన్ని విశ్లేషించాడు. ఇద్దరూ సూపర్ బ్యాటర్లే అయినా.. పంత్(Rishabh Pant)లోని ఓ ప్రత్యేకతే అతడిని రేసులో ముందు నిలిపిందని పేర్కొన్నాడు.
పాకిస్తాన్ వేదికగా
వన్డే ఫార్మాట్లో నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలుకానుంది. భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికైన దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇక ఈ మెగా టోర్నీకి ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా క్వాలిఫై అయింది.
మరోవైపు.. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ వన్డే వరల్డ్‌కప్-2023 పాయింట్ల పట్టికలో స్థానాల ఆధారంగా అర్హత సాధించాయి. ఇందుకు సంబంధించి ఈ ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించగా.. పాకిస్తాన్ మాత్రం ఇంకా టీమ్ వివరాలు వెల్లడించలేదు.
సంజూకు దక్కని చోటు
ఇదిలా ఉంటే.. జనవరి 18న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన జట్టులో కేరళ ఆటగాడు సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. వికెట్ కీపర్ల కోటాలో వన్డే వరల్డ్‌కప్- 2023లో రాణించిన కేఎల్ రాహుల్‌తో పాటు.. రిషభ్ పంత్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. నిజానికి వన్డేల్లో పంత్ కంటే సంజూ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి.
అప్పుడు కూడా ఇదే తరహాలో
ఇప్పటి వరకు టీమిండియా తరఫున 31 వన్డేల్లో పంత్ 33.5 సగటుతో 871 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. మరోవైపు.. సంజూ 16 వన్డేల్లో 56.66 సగటుతో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 510 పరుగులు సాధించాడు.
నిజానికి సంజూకు వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో కూడా చోటు దక్కాల్సింది. కానీ నాడు అతడిని కాదని.. టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.
అయితే, ఈ ఐసీసీ టోర్నీలో సూర్య పూర్తిగా తేలిపోయాడు. దీంతో సంజూకు అవకాశం ఇచ్చి ఉంటే.. ఫలితాలు ఇంకాస్త మెరుగ్గా ఉండేవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సూర్య కోసం అతడిని బలిచేసి.. మరోసారి అన్యాయం చేశారంటూ బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. తాజాగా మరోసారి కూడా పంత్ కోసం సంజూను కావాలనే పక్కనపెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.
పంత్‌ను చేర్చడం ద్వారానే అది సాధ్యం
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్.. ఈ ఇద్దరినీ పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రిషభ్ పంత్.. లేదా సంజూ శాంసన్.. ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇద్దరూ అచ్చమైన బ్యాటర్లే. అయితే, రిషభ్ పంత్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపడానికి కారణం.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడమే.
బ్యాటింగ్ ఆర్డర్‌లో మేనేజ్‌మెంట్ కోరుకుంటున్న వైవిధ్యం పంత్‌ను చేర్చడం ద్వారా సాధ్యమవుతుంది. ఏదేమైనా సంజూ శాంసన్ కూడా చివరి వరకు పోటీలో నిలిచాడని చెప్పవచ్చు.
విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఉంటే..
అయితే, ఈసారి విజయ్ హజారే ట్రోఫీ ఆడకపోవడం కూడా అతడి ఎంపికపై ప్రభావం చూపింది. ఈ దేశీ టోర్నీలో ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది’’ అని దినేశ్ కార్తిక్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీకి సంజూ శాంసన్ దూరంగా ఉన్నాడు. కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ)తో అతడికి విభేదాలు తలెత్తిన కారణంగానే ఈ టోర్నీలో పాల్గొనలేకపోయాడు.
మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా శిబిరానికి సంజూ రాలేదని కేసీఏ పెద్దలు వేటు వేయగా.. సంజూ తండ్రి శాంసన్ విశ్వనాథ్ మాత్రం తన కుమారుడిపై కావాలనే కక్ష సాధిస్తున్నారని ఆరోపించాడు. సంజూ మాదిరి ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాని ఎంతో మంది ఆటగాళ్లకు కేరళ జట్టులో చోటు ఇచ్చారని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment