టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్(Sanju Samson) తండ్రి శాంసన్ విశ్వనాథ్ మరోసారి తీవ్ర ఆరోపణలతో తెరమీదకు వచ్చారు. తన కుమారుడి ఎదుగులను ఓర్వలేక.. కావాలనే తొక్కేస్తున్నారంటూ కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ)పై మండిపడ్డారు. అసోసియేషన్‌లోని ‘పెద్ద తలకాయల’పై తనకేమీ కోపం లేదని.. సమస్యంతా అబద్దాలను కూడా నిజంలా ప్రచారం చేసే ‘చిన్నవాళ్ల’ గురించేనని పేర్కొన్నారు.
కాగా ఇటీవల అంతర్జాతీయ టీ20లలో మూడు శతకాలతో చెలరేగాడు కేరళ స్టార్ సంజూ శాంసన్. ఈ క్రమంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) జట్టులో చోటు దక్కడం ఖాయమని సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం అభిప్రాయపడ్డారు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో సంజూ సత్తా చాటగలడని మద్దతు పలికారు.
సంజూ శాంసన్‌కు మొండిచేయి
అయితే, ఈ మెగా టోర్నీలో సంజూ శాంసన్‌కు టీమిండియా సెలక్టర్లు మొండిచేయి చూపారు. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్(KL Rahul)తో పాటు రిషభ్ పంత్(Rishabh Pant)ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ ఆడకపోవడం కూడా ఇందుకు ఓ కారణం అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కాగా దేశీ క్రికెట్ టోర్నీల్లో కేరళ జట్టుకు సంజూ కెప్టెన్‌గా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఈసారి మాత్రం కేసీఏ అతడి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించింది. తాము నిర్వహించిన మూడు రోజుల శిక్షణా శిబిరానికి హాజరుకానుందున సంజూకు విజయ్ హజారే ట్రోఫీ ఆడే జట్టులో చోటివ్వలేదని తెలిపింది.
అదే విధంగా.. సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడో.. లేదో కూడా తమకు సమాచారం ఇవ్వలేదని సంజూపై ఆరోపణలు చేసింది. తనకు నచ్చినపుడు వచ్చి ఆడతామంటే కుదరదని.. అందరి ఆటగాళ్లలాగే అతడు కూడా అని స్పష్టం చేసింది.
నా కుమారుడిపై పగబట్టారు
నిజానికి విజయ్ హజారే ట్రోఫీలో గనుక తనను తాను నిరూపించుకుంటే సంజూ కచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీ రేసులో ఉండేవాడే! ఈ పరిణామాల నేపథ్యంలో సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ స్పందించారు. ‘‘కేసీఏలో ఉన్న కొద్ది మంది వ్యక్తులు నా కుమారుడికి వ్యతిరేకంగా పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పగ సాధిస్తున్నారు.
ఇంతవరకు మేము అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈసారి వారి చేష్టలు శ్రుతిమించాయి. సంజూ ఒక్కడే క్యాంపునకు హాజరు కాలేదన్నట్లు మాట్లాడుతున్నారు. చాలా మంది శిక్షణా శిబిరంలో పాల్గొనకపోయినా వాళ్లను ఎంపిక చేశారు.
వారి ప్రమేయం లేదు
కేసీఏ అధ్యక్షుడు జయేశ్ జార్జ్, కార్యదర్శి వినోద్‌కు ఈ విషయంలో ప్రమేయం లేదని అనుకుంటున్నా. అయితే, కొంతమంది కిందిస్థాయి వ్యక్తులు సంజూ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ వారి మనసులలో విషాన్ని నింపుతున్నారు’’ అని విశ్వనాథ్ మాతృభూమికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు ఆరోపణలు చేశారు.
కాగా గతంలోనూ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ వల్ల తన కుమారుడి కెరీర్ నాశనం అయిందని.. పదేళ్ల పాటు అతడి సమయం వృథా అయిందని పేర్కొన్నారు.
ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన కొడుకుకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. కాగా సంజూ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు.
చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే
Comments
Please login to add a commentAdd a comment