ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో పాల్గొనబోయే భారత జట్టులో సంజూ శాంసన్‌కు చోటివ్వాల్సిందని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వరుస శతకాలతో చెలరేగినా అతడికి మొండిచేయి ఎదురుకావడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ సంజూ తిరస్కారానికి గురైనట్లుగా భావించరాదని.. క్రికెట్ ప్రేమికులంతా అతడికి మద్దతుగా ఉన్నారని పేర్కొన్నాడు.
జట్టు కూర్పు దృష్ట్యానే సంజూను కాదని.. సెలక్టర్లు రిషభ్ పంత్(RIishabh Pant) వైపు మొగ్గుచూపారని గాసవ్కర్ అభిప్రాయపం వ్యక్తం చేశాడు. కాగా హైబ్రిడ్ విధానంలో పాకిస్తాన్- యూఏఈ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి శనివారం(జనవరి 18) జట్టును ప్రకటించింది.
వారిద్దరికే చోటు
రోహిత్ శర్మ సారథ్యంలోని పదిహేను మంది సభ్యుల జట్టులో వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్(KL Rahul)తో పాటు.. రిషభ్ పంత్ చోటు దక్కించుకున్నాడు. నిజానికి వన్డేల్లో పంత్‌తో పోలిస్తే సంజూ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. అంతేకాదు.. ఇటీవల అంతర్జాతీయ టీ20లలో అతడు మూడు శతకాలు బాది సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు సునిల్ గావస్కర్, మహ్మద్ కైఫ్ వంటి వారు సంజూను చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక చేయాలన్న డిమాండ్‌ను బలంగా వినిపించారు. అయితే, బీసీసీఐ మాత్రం పంత్ వైపే మొగ్గుచూపింది. దీంతో సంజూకు గతంలో మాదిరే మరోసారి భంగపాటు తప్పలేదు.
అందుకే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు!
ఈ విషయంపై గావస్కర్ తాజాగా స్పందిస్తూ సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను విశ్లేషించాడు. ‘‘అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న ఆటగాడిని పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోవడం కష్టమే. అసలు అతడిని ఎంపిక చేయకపోవడానికి సరైన కారణం లేదనే చెప్పవచ్చు.
సంజూను కాదని.. రిషభ్ పంత్‌ను ఎంపిక చేశారు. గేమ్ ఛేంజర్‌గా అతడికి పేరుండం ఒక కారణం కావచ్చు. ఇక అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం మరొక ప్లస్ పాయింట్. అంతేగాక.. సంజూ కంటే బెటర్ వికెట్ కీపర్ కావడం కూడా అతడికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు.
ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా పంత్ సొంతం. అయితే, సంజూకు అలాంటి ఫేమ్ లేదు. అందుకే అతడిని ఎంపిక చేయలేదు. అయినప్పటికీ.. సంజూ ఎందులోనూ తక్కువ కాదు. అతడు తిరస్కార భావంతో ముడుచుకుపోవాల్సిన పనిలేదు. ఎంతో మంది క్రికెట్ ప్రేమికులు అతడి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అతడికి మద్దతు ప్రకటిస్తున్నారు’’ అని సునిల్ గావస్కర్ చెప్పుకొచ్చాడు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ప్రకటించిన జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా(ఫిట్‌నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.
చదవండి: ‘అతడి కథ ముగిసిపోయింది.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’
Comments
Please login to add a commentAdd a comment