ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌

Published Tue, May 7 2024 11:45 AM

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌

రాజమహేంద్రవరం రూరల్‌: పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు విలువను చాటారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. పిడింగొయ్యి ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూలులో నిర్వహిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రక్రియను జాయింట్‌ కలెక్టర్‌, రాజమండ్రి రూరల్‌ రిటర్నింగ్‌ అధికారి ఎన్‌.తేజ్‌భరత్‌తో కలిసి సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఇతర అనుబంధ సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించామని వివరించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల విధులకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించామన్నారు. వీరితో పాటు, ఇతర అత్యవసర సేవలు నిర్వహించే 32 విభాగాల్లోని సిబ్బందికి కూడా ఈ అవకాశం ఉందన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌భరత్‌ మాట్లాడుతూ, రూరల్‌ నియోజకవర్గానికి చెందిన పీఓ, ఏపీఓలకు ఉదయం రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించామని తెలిపారు. పోలింగ్‌ రోజున సాయంత్రం 6 గంటల వరకూ క్యూలో ఉన్న ప్రతి ఓటరుకూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉండి, ఓటు హక్కు లేని జిల్లాలోని ఇతర నియోజకవర్గాల ఉద్యోగులకు కూడా ఫామ్‌ 12 ద్వారా ఓటు హక్కు కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి ఆర్‌.కృష్ణనాయక్‌ సమక్షంలో పోస్టల్‌ బ్యాలెట్లను భద్రపరచామని జేసీ చెప్పారు.

Advertisement
Advertisement