అయోధ్య: అయోధ్య రామమందిరం గర్భగుడిలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం తన అదృష్టమని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రామ్‌లల్లా ఇక టెంట్‌లో ఉండేపరిస్థితులు లేవని.. దివ్యమైన మందిర గర్భగుడిలోనే ఉంటారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాలు, నిష్ట తర్వాత అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. ఇది సామాన్యమైన సమయం కాదని.. కాల చక్రంలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుత సమయయని తెలిపారు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో దేశమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వందల ఏళ్లు ఎదురుచూస్తున్న రామమందిరం కల సాకారమైంది. బాలరాముడు ఎట్టకేలకు అయోధ్యలో కొలువుదీరాడు. భవ్య మందిరంలో దివ్య రామయ్య విగ్రహం ఆవిష్కృతం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ ప్రసంగం ప్రారంభించారు. రామ భక్తులందరికీ తన ప్రణామాలు తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మన రాముడొచ్చాడన్న మోదీ.. ఈ క్షణం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు. ఎంతో అలౌకిక ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఎక్కడ రాముడు కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని తెలిపారు. సేవా, చింతర, భక్తిని హనుమంతుడి నుంచి ప్రేరణ పొందాలని అన్నారు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్న సరికొత్త అధ్యాయమని చెప్పారు.
మోదీ ఇంకా మాట్లాడుతూ.. ‘సరయూ నది, అయోధ్యపురికి నా ప్రణామాలు. నా శరీరం ఇంకా అనుభూతిని ఆస్వాదిస్తోంది. రాముడు క్షమిస్తాడని నాకు నమ్మకం ఉంది. నా మనస్సంతా బాలరాముడి రూపంపైనే ఉంది. త్రేతాయుగంలో రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. రాముడి కోసం 14 ఏళ్లుగా ప్రజలు ఎదురు ఎదురు చూశారు. ఈ కలియుగంలో కొన్ని వందల ఏళ్లు రాముడి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
చదవండి: Ayodhya Ram Mandir: 500 ఏళ్ల కల నెరవేరింది: యోగి ఆదిత్యనాథ్
దేశం మొత్తం ఇవాళ దీపావళి జరుపుకుంటోంది. రామమందిర న్యాయబద్దమైన ప్రక్రియ ద్వారా నిర్మించాం. 500 ఏళ్లుగా రామమందిర నిర్మాణం ఎందుకు జరగలేదో ఒకసారి అందరూ ఆలోచించండి. రాముడు భారతదేశ ఆత్మ. ఈ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టా. అన్ని రాష్ట్రాల్లోని ఉన్న రాముడి ప్రధాన ఆలయాలు దర్శించుకున్నాను. అన్ని భాషల్లోనూ రామాయనాన్ని విన్నాను. భాష ఏదైనా రాముడు అందరికీ ఆరాధ్య దైవం. రాముడు లోకానికి ఆదర్శం. రాముడు భారత్‌కు ప్రతిష్ట. రాముడు వివాదం కాదు.. రాముడు సమాధానం. రాముడే భారతదేశానికి విధానం. రాముడు నిత్యం, రాముడు నిరంతరం, రాముడు అనంతం.
బానిస సంకెళ్లను తెంచుకున్న కొత్త రాజ్యం ఆవిర్భవించింది. ఈనెల గాలి ప్రతీది దివ్యత్వంతో నిండిపోయింది. ఈ ఘట్టం కోసం శ్రీరాముడు ఎన్నో శతాబ్ధాల పాటు ఎదురు చూశాడు. ఇంత ఆలస్యం జరిగింనందుకు మమ్మల్ని క్షమించమని శ్రీరాముడిని వేడుకుంటున్నా రాముడు తప్పక వస్తాడన్న శబరి ఎదురుచూపులు ఫలించాయి. దేవుడి నుంచి దేశం.. రాముడి నుంచి రాజ్యం ఇది మన నినాదం. త్రేతా యుగంలో రాముడు వచ్చాకే వేలయేళ్లపాటు ఈ దేశం ప్రపంచాన్ని శాసించింది రాబోయే వెయ్యేళ్ల కోసం నేడు పునాదిరాయి వేస్తున్నాం’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment