నేషనల్‌ హైవే అథార్టీకి బదలాయింపు | Sakshi
Sakshi News home page

నేషనల్‌ హైవే అథార్టీకి బదలాయింపు

Published Thu, Feb 8 2024 5:52 AM

-

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌–బీదర్‌ రోడ్డును రహదారిగా గుర్తించి అప్‌గ్రేడ్‌ చేయాలన్న విషయం మరోసారి తెరపైకి వచ్చింది. సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన 15 రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ నెల ఒకటో తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి వినతి పత్రం సమర్పించారు. 15 రోడ్లలో మొదటి ప్రాధాన్యతగా ఆరు రోడ్లను అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు. ఆరు రోడ్లలో జహీరాబాద్‌–బీదర్‌ రహదారి కూడా మొదటి ప్రాధాన్యతలో ఉంది. దీంతో తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. కొన్ని సంవత్సరాలుగా ఊసేలేని ఈ అంశం మరోసారి చర్చకు రావడంతో రోడ్డు విస్తీర్ణంపై స్థానిక ప్రజలు ఆశలు చిగురిస్తున్నాయి. కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌, బాల్కి, ఉద్గీర్‌, మహారాష్ట్రంలోని ఉద్గీర్‌ పట్టణ ప్రజలు హైదరాబాద్‌కు జహీరాబాద్‌–బీదర్‌ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డులో ఎక్కువ భాగం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. గతంలో ఈ రోడ్డు ఆర్‌అండ్‌బీ శాఖ పరిఽధిలో ఉండగా.. దెబ్బతిన్న ప్రతిసారి వెంటనే మరమ్మతులు చేయించేవారు. నేషనల్‌ హైవే అథార్టీ అధికారులు పట్టించుకోని కారణంగా జహీరాబాద్‌–బీదర్‌ రహదారి అధ్వానంగా తయారైంది. గుంతలు పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.

నేషనల్‌ హైవే అథార్టీకి బదలాయింపు

జహీరాబాద్‌–బీదర్‌ రోడ్డు ఇరుకుగా ఉండి వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రోడ్డు మధ్యలో వంతెనలు, రైల్వే గేటు కూడా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఉన్న రోడ్డులో నిత్యం రద్దీని దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారిగా గుర్తించారు. ఫోర్‌లేన్‌గా విస్తరించేందుకు తొమ్మిదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రోడ్డుకు జాతీయరహదారిగా గుర్తించి ఫోర్‌లేన్‌గా విస్తరించేందుకు కేంద్రం ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వెంటనే ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని ఈ రోడ్డును నేషనల్‌ హైవే అథార్టీకి బదలాయించారు. సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డుకు జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్‌ చేయకపోవడంతో విస్తీర్ణం పనుల్లో జాప్యం జరుగుతుంది. వికారాబాద్‌–తాండూర్‌, జహీరాబాద్‌–బీదర్‌ వరకు గల 154 కి.మీ రోడ్డుకు కేంద్రం అప్‌గ్రేడ్‌ చేసి అభివృద్ధి చేయాలని, తాజాగా మంత్రి కోమటిరెడ్డి వినతిపత్రం ఇవ్వడంతో ప్రజలు ఆశలు చిగురించాయి.

మరమ్మతులు చేయించాం

జహీరాబాద్‌–బీదర్‌ రహదారి తమ పరిధిలో లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలోనే ఈ రోడ్డును ఎన్‌హెచ్‌ఏ వారికి బదలాయించాం. రోడ్డు మరమ్మతుల గురించి వారే చూసుకోవాలి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గత సంవత్సరం దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయించాం.

–నర్సింలు, డీఈఈ, ఆర్‌అండ్‌బీ,జహీరాబాద్‌

 
Advertisement
 
Advertisement