అతడు అద్భుతం.. కాస్త ఏమరపాటుగా ఉన్నా అంతే! నాకు అనుభవం: ఏబీడీ | Sakshi
Sakshi News home page

భువీ అద్భుతం.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే! నాకు అనుభవం: ఏబీడీ ప్రశంసలు

Published Fri, Oct 6 2023 9:13 PM

If You Not In Control Of Technique Bhuvi Expose That: AB de Villiers Lauds - Sakshi

AB de Villiers on Bhuvneshwar Kumar: టీమిండియా వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌పై సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌ ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన బౌలింగ్‌ నైపుణ్యాలు భువీ సొంతమని.. అతడు బంతిని స్వింగ్‌ చేసే తీరు బ్యాటర్లకు చెమటలు పట్టిస్తుందని పేర్కొన్నాడు. తనకూ ఇలాంటి అనుభవం ఎదురైందంటూ స్వింగ్‌ సుల్తాన్‌ను ఆకాశానికెత్తాడు. 

కాగా 2018లో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో 1-2తో ఆతిథ్య జట్టుకు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. అయితే, భారత జట్టుకు ఓటమి ఎదురైనా.. భువీ మాత్రం ఈ సిరీస్‌లో కొన్ని మధురజ్ఞాపకాలు పోగు చేసుకున్నాడు.

ఏబీడీ వికెట్‌ పడగొట్టాడు
ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా టీమిండియా గెలిచిన మూడో మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్‌ను 5 పరుగులకు పెవిలియన్‌కు పంపి సత్తా చాటాడు. తాజాగా ఈ విషయాలను గుర్తుచేసుకున్న ఏబీడీ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘భువీ అద్భుతమైన బౌలర్‌. అతడి నైపుణ్యాలు అమోఘం. బ్యాటర్‌ను మునివేళ్ల మీద నిలబెడతాడు. ఒకవేళ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న మన బలహీనతను క్యాష్‌ చేసుకుని పండుగ చేసుకుంటాడు. సెంచూరియన్‌లో నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది.

భువీ అద్భుతం
అవుట్‌స్వింగర్లతో నన్ను టీజ్‌ చేశాడు. ఎట్టకేలకు ఓ ఇన్‌స్వింగర్‌తో నా వికెట్‌ తీశాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపే స్టంప్స్‌ ఎగిరిపోయాయి. భువీ పట్ల నాకెల్లప్పుడూ గౌరవభావం ఉంటుంది’’ అని డివిలియర్స్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను కొనియాడాడు.

టీమిండియాకు దూరం
కాగా భువీకి టీమిండియాలో అవకాశాలు సన్నగిల్లిన విషయం తెలిసిందే. గతేడాది నవంబరులో న్యూజిలాండ్‌ పర్యటనలో టీ20 సిరీస్‌లో అతడు ఆఖరిసారిగా ఆడాడు. వరుసగా విఫలం కావడంతో బీసీసీఐ అతడిని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించింది. దీంతో ప్రస్తుతం 33 ఏళ్ల భువీ లీగ్‌ క్రికెట్‌కే పరిమితమయ్యాడు.

చదవండి: WC- Ind vs Aus: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన ద్రవిడ్‌! ఇషాన్‌కు లక్కీ ఛాన్స్‌!

Advertisement
Advertisement