Ind Vs SL: India Record 15th Consecutive Test Series Win At Home, Longest Run By Any Team - Sakshi
Sakshi News home page

IND VS SL 2nd Test: టెస్ట్‌ క్రికెట్‌లో టీమిండియా తిరుగులేని రికార్డు

Published Mon, Mar 14 2022 8:43 PM

India Record 15th Consecutive Series Win At Home, Most By Any Team - Sakshi

టెస్ట్‌ క్రికెట్‌లో టీమిండియా తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. స్వదేశంలో వరుసగా 15 సిరీస్‌లు గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర పుటల్లో నిలిచింది. సోమవారం (మార్చి 14) శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో (పింక్‌ బాల్‌ టెస్ట్‌) గెలుపొందడం ద్వారా టీమిండియా స్వదేశంలో వరుసగా 15వ టెస్ట్‌ సిరీస్‌ విజయం సాధించి, ఇదివరకే తమ పేరటి ఉన్న రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. టీమిండియా చివరిసారిగా 2012 నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ఇంగ్లండ్‌తో (స్వదేశంలో) జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఓడిపోయింది. నాడు మహేంద్ర సింగ్ ధోని జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పటి నుంచి భారత జట్టు స్వదేశంలో తిరుగులేని అజేయ జట్టుగా కొనసాగుతుంది.


టీమిండియా తర్వాత స్వదేశంలో అత్యధిక వరుస టెస్ట్‌ సిరీస్‌లు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా ఉంది. కంగారూ జట్టు స్వదేశంలో వరుసగా 10 టెస్ట్‌ సిరీస్‌ల్లో విజయం సాధించింది. ఆసీస్‌ రెండుసార్లు (నవంబర్ 1994-నవంబర్ 2000 మధ్యలో ఓసారి, జులై 2004-నవంబర్ 2008 మధ్యలో మరోసారి) ఈ ఘనత సాధించడం విశేషం. కాగా, బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో లంకను చిత్తు చేసి 2 మ్యాచ్‌ల సిరీస్‌ని 2-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లోనూ లంకపై భారీ విజయం (ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో) సాధించిన టీమిండియా.. టెస్ట్‌ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా 3-0 తేడాతో వైట్‌వాష్‌ చేసింది. 
చదవండి: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్‌ కైవసం

Advertisement
Advertisement