
టీడీపీ దౌర్జన్యకారుల మీద చర్యలకు డిమాండ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆమె డిజిపి దృష్టికి తీసుకొచ్చారు. చంద్రగిరి, గురజాల తాడిపత్రి గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు చేసిన హింసకాండ అంశాలపై డీజీపీతో ఆమె మాట్లాడారు.
ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. టిడిపికి ఓటు వేయలేదు అన్న కారణాలతో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల దాడులను స్థానిక పోలీసుల దృష్టికి తీసుకొచ్చినా స్థానిక పోలీసులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు డీజీపీకి తెలిపారు.
దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నియమించిన భద్రతా వ్యవహారాల పరిశీలకుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సమాచారం ఉన్నట్లు హోం మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment