సాక్షి, గుంటూరు: గత 15 రోజులుగా టీడీపీ నేతలు చేస్తున్న దారుణాలపై డీజీపీకి వైఎస్సార్‌సీపీ నేతలు లేఖ రాశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడంతో పాటు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని.. వీటిపై ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడంలేదు. మా ప్రాణాలకు హాని ఉందని చెప్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదంటూ డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది.
‘‘అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ, జనసేన నాయకులు అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఇవ్వాళ్టికి రాష్ట్రంలోని 14 చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోకి చొరబడ్డారు. మా పార్టీ ఆస్తుల్లోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు పాల్పడి చట్టాన్ని ఉల్లంఘించారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టి, ఘర్షణలు రేపేందుకు ప్రయత్నించారు. టీడీపీ, జనసేన నాయకులు అక్రమంగా ప్రవేశించినా, బెదిరింపులకు దిగినా పోలీసులు ఎక్కడా వారిని నియంత్రించలేదు. సరికదా వారి అక్రమాలకు దన్నుగా నిలబడ్డారు.’’ అని లేఖలో వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు.
‘‘రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులకు తావివ్వడం ద్వారా శాంతిభద్రతలను ప్రమాదంలో పడేశారని, వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయాలకు రక్షణ లేకుండాపోయిందని తెలియజేసుకుంటున్నాం. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నిర్లిప్తంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైనా శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment