IPL 2024: చరిత్ర సృష్టించిన మయాంక్‌ యాదవ్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024 RCB VS LSG: చరిత్ర సృష్టించిన మయాంక్‌ యాదవ్‌

Published Wed, Apr 3 2024 5:28 PM

IPL 2024 RCB VS LSG: Mayank Yadav Becomes First Player In IPL History To Win POTM Award In 1st Two Matches - Sakshi

నిప్పులు చెరిగే వేగంతో క్రికెట్‌ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేస్‌ గన్‌ మయాంక్‌ యాదవ్‌ ఐపీఎల్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన మయాంక్‌ రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.

అరంగేట్రం మ్యాచ్‌లో పంజాబ్‌పై 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన మయాంక్‌.. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో మరింత చెలరేగి 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి మరోసారి 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ హిస్టరీలో ఇప్పటివరకు 16 మంది ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్‌ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకోగా.. మాయంక్‌ ఒక్కడే రెండో మ్యాచ్‌లోనూ ఈ అవార్డు దక్కించుకున్నాడు.

మయాంక్‌ ఒక్కడే 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఏ ఆటగాడికి సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుని రికార్డుల్లోకెక్కాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో క్రమం తప్పకుండా 150 కిమీ వేగంతో బంతులు సంధించిన మయాంక్‌.. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఈ సీజన్‌ ఫాస్టెస్ట్‌ డెలివరీని (156.7 కిమీ) బౌల్‌ చేశాడు. పంజాబ్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో 155 కిమీ వేగంతో బంతిని సంధించిన మయాంక్‌.. ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ 155 కిమీపైగా వేగంతో బంతిని సంధించి ఐపీఎల్‌ చరిత్రలో తొలి రెండు మ్యాచ్‌ల్లో 155 కిమీపైగా వేగంతో బంతులను సంధించిన తొలి పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు.

ఆర్సీబీతో మ్యాచ్‌ అనంతరం ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకుంటున్న సందర్భంగా మయాంక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకోవడం ఆనందంగా ఉంది. తన ప్రదర్శనలతో రెండు మ్యాచ్‌లు గెలవడం ఇంకా ఆనందాన్ని ఇచ్చిందని అన్నాడు. దేశం కోసం ఆడటమే తన లక్ష్యమని ఈ సందర్భంగా తన మనసులోని మాటను బయటపెట్టాడు. 

కాగా, ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. డికాక్‌ (81), పూరన్‌ (40 నాటౌట్‌) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ మయాంక్‌ యాదవ్‌ (4-0-14-3) ధాటికి 153 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో మహిపాల్‌ లోమ్రార్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీపై గెలుపుతో లక్నో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఆర్సీబీ చివరి నుంచి రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది.

ఐపీఎల్‌ అరం‍గేట్రంలో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు..

  1. బ్రెండన్ మెకల్లమ్
  2. మైఖేల్ హస్సీ
  3. పర్వీజ్ మహరూఫ్
  4. షోయబ్ అక్తర్
  5. శ్రీవత్స్ గోస్వామి
  6. రస్టీ థెరాన్
  7. ప్రశాంత్ పరమేశ్వరన్
  8. రిచర్డ్ లెవి
  9. స్టీవ్ స్మిత్
  10. మనన్ వోహ్రా
  11. ఆండ్రూ టై
  12. జోఫ్రా ఆర్చర్
  13. అల్జారీ జోసెఫ్
  14. హ్యారీ గుర్నీ
  15. ఓడియన్ స్మిత్
  16. మయాంక్‌ యాదవ్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement