టీ20 ప్రపంచకప్-2024లో యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు శుభారంభం చేసింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో కెనడాపై సంచలన విజయం సాధించింది.
డలాస్ వేదికగా ఆదివారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈ మ్యాచ్‌లో కెనడాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. అంతర్జాతీయ టీ20లలో తమ అత్యధిక పరుగుల ఛేదనను నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇక ఈ విజయంలో యూఎస్‌ఏ వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్‌దే కీలక పాత్ర. కెనడా విధించిన 195 పరుగుల లక్ష్య ఛేదనలో అమెరికా జట్టు ఆరంభంలోనే తడబడింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు స్టీవెన్ టేలర్(0), కెప్టెన్ మొనాక్ పటేల్(16) వికెట్లు కోల్పోయింది.
ఆరోన్ జోన్స్ సంచలన ఇన్నింగ్స్
ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్(46 బంతుల్లో 65)తో కలిసి ఆరోన్ జోన్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 40 బంతుల్లోనే 94 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇక స్ట్రైకురేటు 235తో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆరోన్ జోన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!
యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా ఆరోన్ జోన్స్ చరిత్రకెక్కాడు. కాగా యూఎస్‌ఏ విజయంలో కీలక పాత్ర పోషించి.. తొమ్మిదో ఎడిషన్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి ఆటగాడిగానూ నిలిచాడు.
టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు
👉క్రిస్ గేల్- 11- ఇంగ్లండ్ మీద- 2016లో..
👉క్రిస్ గేల్- 10- సౌతాఫ్రికా మీద- 2007లో..
👉ఆరోన్ జోన్స్- 10- కెనడా మీద- 2024లో..
👉రిలీ రొసోవ్- 8- బంగ్లాదేశ్ మీద- 2022లో.
చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment