టీ20 వరల్డ్‌కప్-2024ను కెనడా ఓటమితో ప్రారంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా టెక్సాస్ వేదికగా యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కెనడా ఓటమి పాలైంది. 195 పరుగుల లక్ష్యాన్ని కెనడా బౌలర్లు కాపాడుకోలేకపోయారు.
అమెరికా జట్టు 17.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అమెరికా మిడిలార్డర్ బ్యాటర్లు ఆండ్రీస్ గౌస్(65), ఆరోన్ జోన్స్(94 నాటౌట్) మెరుపు అర్ధ సెంచరీలతో తమ జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించారు.
చెత్త రికార్డు..
ఈ మ్యాచ్‌లో కెనడా ఫాస్ట్ బౌలర్ జెరెమీ గోర్డాన్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. జెరెమీ గోర్డాన్‌ను ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్ ఊచకోత కోశారు. తొలి స్పెల్‌లో రెండు ఓవర్లు వేసిన జోర్డాన్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ రెండో స్పెల్‌లో మాత్రం జోర్డాన్ పూర్తిగా తేలిపోయాడు.
యూఎస్‌ఎ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన జోర్డాన్.. ఏకంగా 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్‌లో జోర్డాన్ రెండు నో బాల్స్, రెండు వైడ్స్‌తో సహా 3 సిక్స్‌లు, రెండు బౌండరీలు ఇచ్చాడు. తద్వారా టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్‌గా గోర్డాన్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ బౌలర్ ఇజ్రాతుల్లా దౌలత్‌జాయ్ పేరిట ఉండేది.
2012 పొట్టి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై దౌలత్‌జాయ్ ఒకే ఓవర్‌లో 32 పరుగులిచ్చాడు. ఇక ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ వరుసగా 6 సిక్స్‌లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో గోర్డాన్ మరో 4 పరుగులిచ్చి ఉంటే బ్రాడ్‌ను అధిగిమించేవాడు.
Comments
Please login to add a commentAdd a comment