మెరుపులతో టి20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం
10 సిక్స్‌లతో విరుచుకుపడ్డ జోన్స్
తొలి పోరులో కెనడాపై 7 వికెట్లతో అమెరికా గెలుపు
డాలస్: అమెరికా ఆతిథ్య హోదాలో ఆడిందంతే! టి20 ప్రపంచకప్ ఆడే సత్తా ఆ జట్టుకెక్కడిది అని తేలిగ్గా తీసిపారేసే వారికి మెగా మెరుపులతో టోర్నీకే గొప్ప ఆరంభం ఇచ్చింది అమెరికా. రెండు కొత్త జట్లు (కెనడా, అమెరికా) ప్రపంచకప్‌లో ఆడటం తొలిసారే అయినా... ధనాధన్ షోతో సిసలైన క్రికెట్ వినోదాన్ని పంచాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన గ్రూప్ ‘ఎ’ మొదటి మ్యాచ్‌లో అమెరికా 7 వికెట్ల తేడాతో కెనడాపై ఘనవిజయం సాధించింది.
టాస్ నెగ్గిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్ నవ్‌నీత్ ధలివాల్ (44 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్ కిర్టన్ (31 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. శ్రేయస్ మొవ్వ (16 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆరోన్ జాన్సన్ (16 బంతుల్లో 23; 5 ఫోర్లు) ధాటిగా ఆడారు.
అలీఖాన్, హర్మిత్ సింగ్, కోరె అండర్సన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని అమెరికా 17.4 ఓవర్లలోనే మూడే వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసి ఛేదించింది. జట్టు ఖాతా తెరువకముందే స్టీవెన్ టేలర్ (0) డకౌటయ్యాడు. మరో ఓపెనర్, కెపె్టన్ మోనంక్ పటేల్ (16) తక్కువే చేశాడు. 42/2 స్కోరు వద్ద కష్టాల్లో ఉన్న అమెరికాను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆరోన్ జోన్స్ (40 బంతుల్లో 94 నాటౌట్; 4 ఫోర్లు, 10 సిక్స్‌లు) అసాధారణ బ్యాటింగ్‌తో గెలిపించాడు.
భారీ సిక్సర్లతో విరుచుకుపడిన జోన్స్... మూడో వికెట్‌కు ఆండ్రీస్ గౌస్ (46 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి 131 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశాడు. ఈ క్రమంలో ఆరోన్ 22 బంతుల్లో, గౌస్ 39 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. 16వ ఓవర్లో 173 పరుగుల వద్ద ఆండ్రీస్ నిష్క్రమించగా... మరో రెండు ఓవర్లలోనే కోరె అండర్సన్ (3 నాటౌట్)తో కలిసి ఆరోన్ జోన్స్ 14 బంతులు మిగిలుండగానే అమెరికాను గెలిపించాడు. అమెరికా తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 6న పాకిస్తాన్ జట్టుతో, కెనడా తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 7న ఐర్లాండ్‌తో ఆడతాయి.
టి20 ప్రపంచకప్‌లో నేడు
నమీబియా X ఒమన్
వేదిక: బ్రిడ్జ్‌టౌన్; ఉదయం గం. 6 నుంచి
శ్రీలంక X దక్షిణాఫ్రికా
వేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
చదవండి: ICC ODI Player Of The Year: అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment