నవనీత్ ధాలివాల్ (PC: ICC X)
క్రికెట్ చరిత్రలో అతి పురాతన సమరంగా అమెరికా, కెనడా మధ్య పోరుకు గుర్తింపు ఉంది. ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నా ఇదే నిజం. 1877లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగినా... దానికి చాలా ఏళ్ల క్రితమే అంటే 1844లో మూడు రోజుల క్రికెట్ మ్యాచ్‌లో అమెరికా, కెనడా తలపడినట్లుగా రికార్డులు చెబుతున్నాయి.
ఇక 180 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమెరికా, కెనడా మధ్య టి20 వరల్డ్ కప్‌లో పోటీ పడుతున్నాయి. ఇరు జట్లకు టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. డాలస్‌కు ఈ మ్యాచ్ వేదిక.
ఈ నేపథ్యంలో స్థానికంగా క్రికెట్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో మార్కెటింగ్ నిపుణులు కొత్త తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్యాడ్‌లు, బ్యాట్‌తో ‘స్కోర్ ఫోర్’ అని రాసి ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ బొమ్మ ముద్రించిన టీ షర్ట్‌లను అమ్ముతున్నారు.
పీజే గోడ్‌హాల్స్ అనే ఔత్సాహిక వ్యాపారి, క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్ వేదికపై అమ్మకానికి ఉంచాడు. 1849లో చికాగో, మిల్‌వాకీ నగరాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు లింకన్ అతిథిగా హాజరయ్యారు.
కెనడా భారీ స్కోరు
టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్ తొలి మ్యాచ్‌లో భాగంగా యూఎస్‌ఏతో తలపడుతున్న కెనడా భారీ స్కోరు సాధించింది. డలాస్ వేదికగా టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. కెనడా బ్యాటింగ్‌కు దిగింది.
ఓపెనర్లలో ఆరోన్ జాన్సన్(16 బంతుల్లో 23) రాణించగా.. నవనీత్ ధాలివాల్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ 44 బంతులు ఎదుర్కొని 61 పరుగులు సాధించాడు.
తొలి హాఫ్ సెంచరీ
తద్వారా టీ20 వరల్డ్‌కప్-2024లో తొలి హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నవనీత్ రికార్డు సాధించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ పగ్రాత్ సింగ్(5) నిరాశ పరచగా.. నాలుగో స్థానంలో వచ్చిన నికోలస్ కిర్టాన్ (31 బంతుల్లో 51) అర్ధ శతకంతో రాణించాడు.
ఇక వికెట్ కీపర్ బ్యాటర్ శ్రేయస్ మొవ్వా 32 పరుగులు చేసి దిల్లాన్ హేలిగెర్(1)తో కలిసి నాటౌట్‌గా నిలవగా.. దిల్‌ప్రీత్ సింగ్ 11 రన్స్ స్కోరు చేశాడు.
ఈ క్రమంలో కెనడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించింది. యూఎస్‌ఏ బౌలర్లలో అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరె ఆండర్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
చండీగఢ్‌లో జన్మించి
అక్టోబరు 10, 1988లో పంజాబ్‌లోని చండీగఢ్‌లో జన్మించాడు నవనీత్ ధాలివాల్. అనంతరం కెనడాకు మకాం మార్చిన 35 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. గతంలో కెనడా జాతీయ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment