ఇంకా రాదేం.. నాలుగో తేది! | AP Election Counting On 4th June | Sakshi
Sakshi News home page

ఇంకా రాదేం.. నాలుగో తేది!

Published Thu, May 30 2024 7:57 AM | Last Updated on Thu, May 30 2024 3:24 PM

AP Election Counting On 4th June

   సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ 

    ఎన్నికల ఫలితాలపై ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో టెన్షన్‌ 

    మరో ఐదు రోజులే ఉండటంతో  ఎవరి లెక్కల్లో వారు నిమగ్నం

     విజయం సాధించాలని కోరుకుంటూ ఆలయాల్లో మొక్కుబడులు 

    సర్వే సంస్థలు, జ్యోతిషులకు కాసుల పంట  

    కీలక ఘట్టానికి సర్వం సిద్ధం చేసిన  అధికార యంత్రాంగం

    నన్నయ యూనివర్సిటీలో అన్ని ఏర్పాట్లు  

  సాక్షి, రాజమహేంద్రవరం:  సార్వత్రిక సమరంలో చివరి ఘట్టం ఆవిష్కృతం కానుంది. మరో ఐదు రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండటంతో పోలింగ్, కౌంటింగ్‌ ప్రక్రియల్లో జాప్యం చోటు చేసుకుంది. మన రాష్ట్రంలో ఈ నెల 13న పోలింగ్‌ ముగిసింది. వచ్చే నెల 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. కౌంటింగ్‌ సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇటు ప్రజల దృష్టంతా ఫలితాలపైనే ఉంది. నాలుగో తేదీ ఎంత వేగంగా వస్తుందా.. ఎప్పుడెప్పుడు ఫలితాలు తెలిసిపోతాయా.. అన్న ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. గెలుపోటములపై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. టీడీపీ అభ్యర్థుల్లో మాత్రం అంతర్మథనం నెలకొంది. గెలుస్తామా? చతికిల పడతామా? అన్న ఆందోళన వెంటాడుతోంది.  

కౌంటింగ్‌కు కసరత్తు 
ఓట్ల లెక్కింపునకు అధికారులు ముమ్మర కసరత్తు నిర్వహిస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు, అధికారుల నియామకం, భద్రతా చర్యలపై జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తున్నారు. నన్నయ విశ్వవిద్యాలయం మొత్తం పోలీసు పహరాలో ఉంది. కౌంటింగ్‌కు అవసరమైన టేబుళ్లు సైతం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 

విహార యాత్రలకు ముగింపు 
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు విదేశీ, స్వదేశీ పర్యటనలకు వెళ్లారు. ఇన్నాళ్లూ ఎన్నికల ప్రచారాల్లో బిజీగా గడిపిన ద్వితీయ శ్రేణి నేతలు చిల్‌ అయ్యేందుకు గోవా చెక్కేశారు. మరికొందరు విహార యాత్రలు, ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎక్కువ శాతం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు స్వగ్రామాల్లోనే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. ఇన్నాళ్లూ ఇంటికి దూరమైన లోటును పూడ్చుకుంటున్నారు. సొంత పనులు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమీపిస్తుండటంతో దేశ, విదేశాలకు వెళ్లినవారు ఇప్పుడు సొంత నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటములపై సన్నిహితులతో ఆరా తీస్తున్నారు. పోలింగ్‌ సరళిని బట్టి ఎన్ని వేల ఓట్లతో గెలుస్తామన్న విషయమై అంచనాలు వేసుకుంటున్నారు. ఫలితాలు వెలువడే వరకు ఆగలేక తమ విజయావకాశాలపై వివిధ మార్గాల ద్వారా ప్రాథమిక అంచనాకు వస్తున్నారు.  

జ్యోతిషం, న్యూమరాలజీకి డిమాండ్‌ 
ఎన్నికల్లో గెలుపోటములపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అభ్యర్థులు వివిధ మార్గాలను వెతుకుతున్నారు. కొందరు జ్యోతిషులను ఆశ్రయిస్తున్నారు. తమ జాతకం ప్రకారం విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. ఏమైనా దోషాలు ఉంటే వాటిని తొలగించుకునే ప్రక్రియలు నిర్వహిస్తున్నారు. న్యూమరాలజీ ప్రకారం తాను గెలిచే అవకాశం ఉందా? అంకెలు అనువుగా ఉన్నాయా? లేదా? అన్న విషయమై స్పష్టత తీసుకుంటున్నారు. దీంతో జ్యోతిషులకు బాగా గిట్టుబాటు అవుతోంది.

కార్యకర్తలకు దిశానిర్దేశం 
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ అనంతరం విహార, ఆధ్యాతి్మక యాత్రలకు వెళ్లిన నేతలంతా సొంత నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. కౌంటింగ్‌ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై సన్నిహితులు, పార్టీ శ్రేణులతో చర్చించుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కీలకమైన ఏజెంట్లు, ఇతర ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. కౌంటింగ్‌ సరళి పరిశీలించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యకర్తలకు అభ్యర్థులు దిశానిర్దేశం చేస్తున్నారు.

సర్వేలతో సతమతం 
అభ్యర్థుల విజయంపై రోజుకో సర్వే మార్కెట్‌లో దర్శనమిస్తోంది. ఒక సర్వేలో ఒక అభ్యర్థి గెలుస్తారని స్పష్టం చేస్తే మరో సర్వేలో ఓటమి చెందుతున్నట్లు వెల్లడిస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అభ్యర్థుల వంతవుతోంది. మరోవైపు అభ్యర్థుల పర్సనల్‌గా సర్వే సంస్థలను ఆశ్రయించి మరీ సర్వే చేయించుకుంటున్నారు. సర్వే చేయించుకునే అభ్యరి్థకి మీదే విజయమంటూ నమ్మబలికి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. వేల మెజార్టీతో గట్టెక్కుతారని వెల్లడిస్తుండటంతో అభ్యర్థులు ఇక తమ విజయం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. బూత్‌ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పోలైన ఓట్ల లెక్కలతో ఏ పారీ్టకి ఎన్ని ఓట్లు వస్తాయో.. స్వతంత్రుల ప్రభావం ఎవరిపై ఉంటుందో.. నోటా ఎవరి ఎవరి పాలిట శాపంగా మారనుందో వంటి అంశాలు ఆయా పారీ్టల నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో ప్రధాన పారీ్టలు ఇప్పటికే అంతర్గత సర్వేలు నిర్వహించి విజయంపై ఓ అంచనాకు వచ్చాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement