యావత్ సీనీ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘కల్కి 2989 ఏడీ’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ మూవీ ప్రచారాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ వినూత్నంగా ప్లాన్ చేశాడు. ప్రధాన పాత్రలు..వాటి నేపథ్యాన్ని ముందే ప్రేక్షకులను తెలిసేలా చేస్తున్నాడు. ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న ‘బుజ్జి’(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆలోచించే మెషీన్) పరిచయం కోసం ఓ ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేయడమే కాకుండా.. బుజ్జిని దేశంలోని ప్రధాన నగరాలలో తిప్పుతూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడు. అంతేకాదు బుజ్జి, భైరవ(ప్రభాస్) ఎలా కలిశారనేది తెలియజేయడానికి ఓ యానిమేటెడ్ సిరీస్‌ని కూడా రూపొందించారు. ‘బుజ్జి అండ్ భైరవ’ పేరుతో తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్..ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 31 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ యానిమేటెడ్ సీరిస్ ఎలా ఉందో చూద్దాం.
‘బుజ్జి అండ్ భైరవ’కథేంటంటే..
కల్కి సినిమాలోని ప్రధాన పాత్రలైన ‘బుజ్జి’, ‘భైరవ’లను పరిచయం చేస్తూ ఈ సిరిస్ సాగుతుంది. BU- JZ- 1 అనే కోడ్ నేమ్‌తో ఉన్న ఏఐ మిషన్(కీర్తి సురేశ్) చాలా ఏళ్లుగా కార్గో వెహికల్‌లో పని చేస్తుంటుంది. సరైన గైడెన్స్ ఇస్తూ 99 మిషన్స్ విజయవంతంగా పూర్తి చేస్తుంది. అయితే చివరగా 100వసారి కార్గో డెలివరీ చేసేందుకు వెళ్తుండగా.. ఓ దాడి జరుగుతుంది. రెబల్స్ అటాక్‌లో బుజ్జి ఉన్న వెహికల్ ధ్వంసం అవుతుంది. దీంతో బుజ్జికి కాంప్లెక్స్ సిటీతో ఉన్న కనెక్షన్ కట్ అయిపోయి స్క్రాప్‌లోకి వెళ్లిపోతుంది.
మరోపక్క భైరవ(ప్రభాస్) కాశీ పట్టణంలో సరదాగా తిరుగుతూ దొంగలను, దోపిడీదారులను పట్టుకొని యూనిట్స్(2898సంవత్సరంలో డబ్బు) సంపాదిస్తుంటాడు. ఎప్పకైనా కాంప్లెక్స్‌కు షిప్ట్ కావాలనేది అతని కోరిక. కానీ భైరవ ఏ పని చేసినా..నష్టాలే తప్ప లాభాలు రావు. అద్దె కూడా సరిగా చెల్లించకపోవడంతో యజమాని(బ్రహ్మానందం) ఇంటిని ఖాలీ చేయమని పోరు పెడుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో భైరవ చేతికి బుజ్జి దొరుకుతుంది. బుజ్జి ఇచ్చే సలహాలతో ఓ స్పెషల్ కారును తయారు చేస్తాడు? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ స్పెషల్ కారుని బుజ్జి ఎందుకు రెడీ చేయించింది? కాంప్లెక్స్‌కి వెళ్లాలనే భైరక కోరిక నెరవేరిందా లేదా? భైరవను బుజ్జి ఎందుకు మోసం చేయాలనుకుంది? అనేది తెలియాలంటే అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో పూర్తి సిరీస్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
‘కల్కి’లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ ప్రేక్షకులకు అంత ఈజీగా అర్థం కావు. ఇందులోని పాత్రలు..వాటి నేపథ్యం గురించి ముందే కొంచెం తెలిసి ఉంటే..సినిమా చూసినప్పుడు వాటితో కనెక్ట్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటాం. అందుకే ఇలాంటి లార్జర్ దేన్ లైఫ్ సినిమాల్లోని పాత్రలను, స్టోరీని ముందే చెబుతూ టీజర్, ట్రైలర్‌లను కట్ చేస్తుంటారు మేకర్స్. సినిమా ప్రమోషన్స్‌లో కూడా ప్రధాన పాత్రల ప్రవర్తన ఎలా ఉండబోతుందో చెప్పేస్తుంటారు. ‘బాహుబలి’సమయంలో రాజమౌళి ఇలానే చేశాడు. సినిమా కథ, అందులోని పాత్రలను ప్రేక్షకులను ముందే చేరువయ్యేలా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపట్టి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. ‘కల్కి’ సినిమా స్టోరీ ఏంటి? బుజ్జి, భైరవ పాత్రల స్వభావం ఏంటి? అనేది ముందే చెప్పేస్తున్నాడు. ప్రధాన పాత్రలపై ఎలాంటి సందేహాలు రాకుండా ముందే ఓ సిరీస్‌ని వదిలి మంచి పని చేశాడు.
యానిమేటెడ్ రూపంలో తీసుకొచ్చిన ఈ సిరీల్‌లో బుజ్జి, భైరవ పాత్రలు..వాటి స్వభావం ఎలా ఉంటుందనేది వినోదాత్మకంగా చూపించారు. అంతేకాదు కల్కి ప్రపంచం ఎలా ఉండబోతుందనేది కొన్ని సీన్లలో చూపించారు. 2898 సంవత్సరంలో డబ్బుని యూనిట్స్ అంటారని చెబుతూనే.. ఆ కాలంలో నిర్మాణాలు ఎలా ఉండబోతున్నాయనేది చూపించారు. ప్రభాస్ పాత్రకు యాక్షన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోడించడం బాగుంది. మధ్య మధ్యలో బ్రహ్మానందం చేసే కామెడీ డైలాగ్స్ నవ్వులు పూయిస్తుంది.
మొదటి ఎపిసోడ్‌లో బుజ్జి, భైరవ పాత్రలను పరిచయం..వాటి నేపథ్యాన్ని చూపించి..రెండో ఎపిసోడ్‌లో వారిద్దరు కలిసి ఏం చేశారనేది చూపించారు. తన సినిమా కాన్సెప్ట్ ఏంటనేది ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఇందులో కల్కి చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌ల గురించి ప్రస్తావననే లేదు. వారిద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయనేది ఇందులో చూపించలేదు. కానీ ఓ సీన్‌లో భారీ విగ్రహాన్ని చూపించారు. అది కమల్ హాసన్‌ని పోలి ఉంది. ఆ విగ్రహం స్టోరీ ఏంటనేది ప్రమోషన్స్‌లో చెబుతారో లేదా డైరెక్ట్‌గా సినిమా చూసే తెలుసుకోమంటారో చూడాలి. టెక్నికల్ పరంగా కూడా ఈ సిరీస్ చాలా బాగుంది. సినిమాటోగ్రపీ, బీజీఎం అదిరిపోయింది. మొత్తానికి 28 నిమిషాల నిడివి ఉన్న ఈ యానిమేటెడ్ సిరీస్ ‘కల్కి 2898’ ప్రపంచం ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment