Rohit Sharma Returns-Captaincy Hosts Aim Seal Series-2nd ODI Vs AUS - Sakshi
Sakshi News home page

IND Vs AUS: అమ్మమ్మ ఇలాకాలో రోహిత్ మెరిసేనా?.. సిరీస్‌ విజయంపై గురి

Published Sat, Mar 18 2023 4:18 PM

Rohit Sharma Returns-Captaincy Hosts Aim Seal Series-2nd ODI Vs AUS - Sakshi

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ఆదివారం(మార్చి 19న) విశాఖపట్నం వేదికగా జరగనుంది. భార్య సోదరుడి వివాహ వేడుకల కారణంగా తొలి వన్డేకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 

రోహిత్‌ గైర్హాజరీలో హార్దిక్‌ పాండ్యా జట్టును నడిపించాడు. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజాలు అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడి మ్యాచ్‌ను గెలిపించారు. అదే జోష్‌తో రెండో వన్డేకు సిద్ధమవుతున్న టీమిండియాకు గుడ్‌న్యూస్‌.

రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విశాఖ వన్డేకు అందుబాటులోకి రానున్నాడు. ఇక విశాఖపట్నం రోహిత్‌ శర్మకు ప్రత్యేక అనుబంధం ఉంది. రోహిత్‌ తల్లి పూర్ణిమా శర్మ స్వస్థలం విశాఖపట్నం. అమ్మమ్మ ఇలాకాలో రోహిత్‌ ఇరగదీయాలని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తొలి వన్డేలో ఓపెనర్‌గా విఫలమైన ఇషాన్‌ కిషన్‌ బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇది మినహా మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. తొలి వన్డేలో కోహ్లి, సూర్యకుమార్‌లు విఫలమైనప్పటికి రెండో వన్డేలో వారు రాణించడం కీలకం. 

గిల్‌ 20 పరుగులు చేసినప్పటికి బ్యాటింగ్‌లో స్థిరత్వం లోపించింది. రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్‌ జడేజా, కీపర్‌ కేఎల్‌ రాహుల్‌లు మరోసారి కీలకం కానున్నారు. షమీ, సిరాజ్‌, కుల్దీప్‌లతో బౌలింగ్‌ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో రెండో వన్డేలో విజయం సాధించి ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ గెలవడంపై దృష్టి పెట్టింది.

మ్యాచ్‌కు వర్షం ముప్పు..
అయితే విశాఖ వేదికగా జరగనున్న వన్డే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.మార్చి 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం మ్యాచ్‌ జరిగే సమయంలో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం పడే ఛాన్స్‌ ఉంది ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ఓ ప్రకటనలో పేర్కొంది. 

మరోవైపు వర్షం పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. స్టేడియం నిర్వాహకులు తెలిపారు. వర్షం నుంచి మైదానాన్ని రక్షించేందుకు అవసరమైన అత్యంత తేలికైన పిచ్‌ కవర్లు తమ వద్ద ఉన్నట్లు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కూడా ఓ ప్రకటనలో  వెల్లడించింది. కాగా ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. 

చదవండి: ప్రపంచ పొట్టి బాడీబిల్డర్‌ వివాహం.. వీడియో వైరల్‌

'రాహుల్‌ గెలిపించి ఉండొచ్చు.. కానీ నిన్ను మరువం'

Advertisement
 
Advertisement
 
Advertisement