కవల గున్న ఏనుగులు
ఆడ, మగ గున్నలకు జన్మనిచ్చిన గజరాణి
ఇది అత్యంత అరుదైన విషయమని ప్రకటించిన వెటర్నరీ వైద్యులు
అయూథలా: గజరాజును అత్యంత పవిత్రంగా భావించే థాయిలాండ్‌లో ఒక అద్భుతం జరిగింది. అరుదుగా సంభవించే కవలల జననానికి వేదికైంది. కవలలకు ఏనుగు జన్మనివ్వడం అరుదైన విషయమయితే అందులోనూ 36 ఏళ్ల ఒక ఏనుగు ఒక ఆడ, ఒక మగ గున్నలకు ఒకేసారి జన్మనివ్వడం అత్యంత అరుదైన సందర్భమని వెటర్నరీ వైద్యులు ప్రకటించారు.
థాయిలాండ్‌లోని అయూథలా ప్రావిన్స్‌లోని అయూథలా ఏనుగుల ప్యాలెస్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటన వివరాలను అక్కడి సిబ్బంది వెల్లడించారు. 36 ఏళ్ల ఛామ్‌చూరీ శుక్రవారం ఒక మగ గున్నకు జన్మనిచ్చింది. ప్రసవం సాఫీగా జరిగిందనుకుని సంతోషపడి ఆ గున్నను నిలబెట్టే ప్రయత్నం చేస్తుండగా ఛామ్‌చూరీ మళ్లీ నొప్పులు పడటం అక్కడి మావటి, సిబ్బందిని ఆశ్చర్యంలో పడేసింది.
అతి కష్టమ్మీద ఆడ గున్న బయటకురావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే మగ గున్నకు జన్మనిచ్చి బాగా నీరసించిపోయిన ఏనుగు వెంటనే మరో ఏనుగుకు జన్మనివ్వడంతో డీలాపడి కింద పడబోయింది. అప్పటికి ఆడ గున్నను కింద నుంచి తీయలేదు. ‘‘పెద్ద ఏనుగు మీద పడితే ఏమైనా ఉందా?. అందుకే వెంటనే ప్రాణాలకు తెగించి వెంటనే తల్లిఏనుగు కిందకు దూరి గున్న ఏనుగును బయటకు లాగేశా.
కానీ అంతలోనే ఏనుగు పడిపోవడంతో నా కాలు విరిగింది. పసికూనను కాపాడాను అన్న ఆనందంలో నాకు కాలు విరిగిన బాధ కూడా తెలీలేదు. ఆస్పత్రికి వెళ్లాకే నొప్పి తెలిసింది’ అని 31 ఏళ్ల మావటి చరిన్ సోమ్‌వాంగ్ నవ్వుతూ చెప్పారు. ‘‘ నేనూ ఇదే ఏనుగుల ప్యాలెస్, రాయల్ ప్రాంగణంలో పుట్టి పెరిగా. కవలల జననాన్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఇంతకాలానికి ఇలా కుదిరింది.
ఏనుగుల్లో కవలల జననం కేవలం ఒక్క శాతం మాత్రమే. ఇక ఆడ,మగ ఒకేసారి జననం అత్యంత అరుదైన విషయం’’ అని అక్కడి వెటర్నరీ మహిళా డాక్టర్ లార్డ్‌థోంగ్‌టేర్ మీపాన్ చెప్పారు. డాక్టర్ మీపాన్‌కు కూడా కవల పిల్లలున్నారు. కవల గున్నల జననం వార్త తెలిశాక స్థానికులు తండోపతండాలుగా ఏనుగుల పార్క్‌కు క్యూ కట్టారు. 60 కేజీల మగ, 55 కేజీల ఆడ గున్నలతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment