ఏనుగు పేడ నుంచి ఖరీదైన కాఫీ | Would you try elephant dung coffee? | Sakshi
Sakshi News home page

ఏనుగు పేడ నుంచి ఖరీదైన కాఫీ

Published Wed, Jun 10 2015 7:16 PM | Last Updated on Thu, Jul 11 2019 6:30 PM

ఏనుగు పేడ నుంచి ఖరీదైన కాఫీ - Sakshi

ఏనుగు పేడ నుంచి ఖరీదైన కాఫీ

బ్యాంకాగ్: ప్రకృతి అందాలతో ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న థాయ్‌లాండ్‌లో భిన్న రుచులతో ఘుమఘుమలాగే కాఫీలు అందించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు, కాఫీ హౌస్‌లు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటాయి. ఇలాంటి పోటీ నుంచి పుట్టుకొచ్చిన అత్యంత ఖరీదైన‘బ్లాక్ ఐవరీ కాఫీ’కి ఇప్పుడు అన్ని రెస్టారెంట్లు బ్రహ్మరథం పడుతున్నాయి. పర్యాటకులు సైతం ‘ సేవింతును ఈ కాఫీనే’ అంటూ మధుర భావనతో లొట్టలేస్తున్నారు. ఇంతకు ఈ కాఫీ ఎలా తయారు అవుతుందో తెలిస్తే వారి భావనలు ఎలా ఉంటాయో తెలియదు మరి.

వగరు రుచితోనూ గమ్మత్తుగాను ఉండే ఈ కాఫీ తయారు చేసే విధానం గురించి దీన్ని కనిపెట్టిన బ్లేక్ డిన్‌కిన్ గొప్పగా చెప్పుకుంటున్నారు. భారతీయ కరెన్సీలో దాదాపు 850 రూపాయలకు దొరికే కప్పు కాఫీకి మూలం సాధారణ కాఫీ గింజలే. కానీ వాటి కుళ్ల బెట్టేందుకు అనుసరిస్తున్న విధానమే వేరు. ముందుగా ఏనుగుల చేత ఈ కాఫీ గింజలను తినిపిస్తారు. ఆ తర్వాత అవి విడిచే పేడలో ఈ గింజలను ఏరుతారు. వాటిని శుభ్రంగా కడిగి ఎండ పెడతారు. 19వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ కాఫీ మిషన్‌లో ఈ గింజలను వేసి పర్యాటకుల ముందే కాఫీని తయారుచేసి వేడి వేడిగా అందజేస్తారు.

థాయ్‌లాండ్‌లోని చియాంగ్ సయేన్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న ఏనుగుల ద్వారా ఈ ఐవరీ కాఫీ గింజలను తాను తయారు చేస్తున్నట్టు బ్లేక్ డిన్‌కిన్ తెలిపారు. ఏ ఏనుగుకి 35 కిలోల కాఫీ గింజలను తినిపిస్తే వాటి పేడ నుంచి ఒక కిలో మాత్రమే గింజలు లభిస్తాయని, కొన్ని సార్లు ఏనుగులు నీటిలో ఉండగానే పేడ వేయడం వల్ల కొన్ని కిలోల గింజలు వృధా అవుతాయని, పైగా ఈ గింజలను సేకరించినందుకు తాను మావటి వాళ్లకు కూలీ చెల్లిస్తానని, ఈ కారణాల వల్లనే కాఫీ ఖరీదు ఎక్కువవుతోందని ఆయన వివరించారు. తాను ఇలాంటి కాఫీ కోసం తొలుత పిల్లులు, సింహాల ద్వారా కూడా ప్రయత్నించానని, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో వాటికి స్వస్తి చెప్పానని చెప్పారు. నెమ్మదిగా జీర్ణం చేసుకునే శక్తి ఏనుగులకు ఉండడం వల్ల తన ప్రయోగం ఫలించిందని అన్నారు.

ప్రస్తుతం థాయ్‌లాండ్‌తోపాటు సింగపూర్, హాంకాంగ్‌లో అందుబాటులోవున్న ఈ కాఫీ గింజలను తాను త్వరలోనే పారిస్, జూరిచ్, కోపెన్‌హాగన్, మాస్కోలకు ఎగుమతి చేస్తున్నానని ఆయన తెలిపారు. దాదాపు లక్ష రూపాయలకు కిలో చొప్పున ఎగుమతి చేయనున్నట్లు చెప్పారు. తనకొస్తున్న ఆదాయంలో ఎనిమిది శాతం సొమ్మును జంతు పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఫౌండేషన్లకు విరాళంగా ఇస్తున్నానంటూ జంతువుల పట్ల తనకున్న కారుణ్యానికి ఖరీదుకట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement