ఉప ముఖ్యమంత్రి పదవుల్లో బీసీ, దళిత, మైనార్టీలకు అన్యాయం
2014లో ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు
ఇప్పుడు ఒక్కరితోనే సరిపెట్టారు
వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సీఎం చంద్రబాబు మరోసారి సామాజిక మోసానికి తెరతీస్తూ తన మొదటి సంతకం చేశారని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్ పేర్కొన్నారు. కేవలం ఒకరికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, ఈ విషయంలో బీసీ, దళిత, మైనార్టీలకు అన్యాయం చేశారని చెప్పారు. ఈ మేరకు పోతిన మహేష్ శనివారం విజయవాడలోని తన కార్యాలయం నుంచి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘చంద్రబాబు తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారు. 2014లో చంద్రబాబు ఇద్దరికి ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు.
వారిలో ఒకరు కాపు, మరొకరు బీసీ సామాజికవర్గం వారు ఉన్నారు. వైఎస్ జగన్ 2019లో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ చంద్రబాబుకు మిన్నగా కాపు, బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు. తద్వారా ఆయా సామాజికవర్గాల ఆత్మగౌరవాన్ని వైఎస్ జగన్ మరింత పెంచారు. వైఎస్ జగన్‌ను పదేపదే విమర్శించిన చంద్రబాబు... వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన సామాజిక న్యాయానికి మించి అట్టడుగు వర్గాలకు పదవులు కేటాయించాల్సింది పోయి ఉన్న పదవులను తగ్గించారు.
ఇది చంద్రబాబు నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తోంది. దీనిపై చంద్రబాబు ఆయా వర్గాలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గత పాలన అంతా దళితులు, బీసీలు, మైనారిటీలను అణగదొక్కడమే కనిపిస్తుంది. వైఎస్ జగన్ అమలు చేసిన సామాజిక న్యాయాన్ని ఇప్పటికైనా బీసీ, దళిత, మైనార్టీ, కాపు సామాజికవర్గాలు గ్రహించాలి. ఆయన ఆయా వర్గాలకు కేటాయించిన సీట్లను సైతం గుర్తించాలి.’ అని పోతిన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment