కోహ్లి లేడు... కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమయ్యారు. గిల్, శ్రేయస్ బ్యాటింగ్‌లో తడబాటు కనిపిస్తోంది. తొలి టెస్టులో అనూహ్య ఓటమి జట్టు ఆత్మవిశ్వాసాన్ని కాస్త దెబ్బ తీసిన పరిస్థితి. స్పిన్ మన బలం అనుకుంటే గత మ్యాచ్‌లో అరంగేట్ర స్పిన్నర్‌కే ఆటను అర్పించేశాం. ప్రత్యర్థిని చూస్తే దేనికైనా సిద్ధం అన్నట్లుగా దూకుడుతో ‘సై’ అంటోంది. రెండో టెస్టుకు ముందు భారత్ పరిస్థితి ఇది. ఇలాంటి సమయంలో విశాఖ తీరాన మన జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ‘బజ్‌బాల్’కు చెక్ పెట్టి ‘భారత్ బాల్’తో సత్తా చాటాల్సి ఉంది.
2016లో భారత్‌లో ఇంగ్లండ్ సిరీస్... తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆధిక్యం ప్రదర్శించగా మ్యాచ్ ‘డ్రా’ అయింది. తర్వాతి నాలుగు టెస్టులు గెలిచి భారత్ చివరకు సిరీస్‌ను 4–0తో గెలుచుకుంది. 2021లో భారత్‌లో ఇంగ్లండ్ సిరీస్... తొలి టెస్టులో భారత్ ఓటమి. తర్వాతి మూడు టెస్టులు గెలిచి భారత్ 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు 2024లో భారత్‌లో ఇంగ్లండ్ సిరీస్... భారత్ తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. గత రెండు సిరీస్‌ల తరహాలోనే టీమిండియా ఈసారీ కోలుకొని తగిన రీతిలో సమాధానమిస్తూ ముందంజ వేస్తుందా!
సాక్షి, విశాఖపట్నం: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో 0–1తో వెనుకబడిన భారత జట్టు పోరును సమం చేసే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. హైదరాబాద్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా రోహిత్ శర్మ నేతృత్వంలో ప్రతీకారానికి సిద్ధమైంది.
మరోవైపు తమ జోరును కొనసాగిస్తూ సిరీస్‌లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని స్టోక్స్ బృందం పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీసీ–వీడీసీఏ స్టేడియంలో నేటి నుంచి జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్‌తో పోలిస్తే ఇరు జట్లలోనూ మార్పులు ఖాయమయ్యాయి.
పటిదార్ అరంగేట్రం!
తొలి టెస్టు ఓటమి తర్వాతి ఇప్పుడు రెండో టెస్టుకు తుది జట్టు ఎంపిక కూడా భారత్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు పరీక్ష పెడుతోంది. గాయాలతో దూరమైన రాహుల్, జడేజా స్థానాల్లో రెండు మార్పులు తప్పనిసరి. రాహుల్ స్థానంలో ఒక బ్యాటర్ స్థానం కోసం రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నారు.
గురువారం టీమ్ ప్రాక్టీస్, ఇతర అంశాలను బట్టి చూస్తే రజత్ వైపే ఎక్కువగా మొగ్గు ఉంది. భారత్ తరఫున పటిదార్ ఒకే ఒక వన్డే ఆడాడు. అశ్విన్, అక్షర్ మళ్లీ కీలకం కానుండగా జడేజా స్థానంలో మరో మాటకు తావు లేకుండా కుల్దీప్ మైదానంలోకి దిగుతాడు. అయితే కుల్దీప్ వస్తే బ్యాటింగ్ బలహీనంగా మారిపోతుంది. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్ తరహాలో ఒకే ఒక పేసర్‌ను ఆడించి బ్యాటింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకోవడం అవసరం.
అలా చేస్తే సిరాజ్ స్థానంలో సర్ఫరాజ్ అరంగేట్రం చేయవచ్చు. అయితే వీటన్నింటికంటే టాప్–4 బ్యాటింగ్ కీలకం కానుంది. ఓపెనర్లు రోహిత్, యశస్వి కాస్త ఓపిగ్గా ఆడితే భారీ స్కోరుకు కావాల్సిన శుభారంభం లభిస్తుంది. గిల్, అయ్యర్ ఇప్పటికైనా తమకు లభిస్తున్న వరుస అవకాశాలకు న్యాయం చేయాల్సి ఉంది.
బరిలోకి బషీర్...
ఇంగ్లండ్ తమ తుది జట్టును గురువారమే ప్రకటించింది. గాయపడ్డ స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లోకి అడుగు పెడుతున్నాడు. గత మ్యాచ్‌లో భారత్‌ను దెబ్బ కొట్టిన హార్ట్‌లీ మళ్లీ చెలరేగేందుకు సిద్ధంగా ఉండగా... అన్నింటికి మించి ఏకైక పేసర్ గా సీనియర్ బౌలర్ అండర్సన్ పునరాగమనం చేస్తుండటం విశేషం. వుడ్ స్థానంలో అతడిని ఇంగ్లండ్ ఎంపిక చేసింది.
తొలి టెస్టులో ఎప్పటిలాగే తమ దూకుడైన బ్యాటింగే ఇంగ్లండ్‌ను గెలిపించింది. ఓపెనర్లు క్రాలీ, డకెట్ ధాటిగా ఆడుతుండగా పోప్ ఆట ఎలాంటిదో గత మ్యాచ్ చూపించింది. స్టార్ బ్యాటర్ రూట్ అటు బౌలింగ్‌లోనూ ప్రధానపాత్ర పోషించడం జట్టు బలాన్ని పెంచింది. అటు బ్యాటింగ్‌తో, ఇటు కెపె్టన్సీతో స్టోక్స్ విలువైన ఆటగాడు. ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లు ఈసారి భారత్‌ను ఎలా నిలువరిస్తారనేది ఆసక్తికరం.
అండర్సన్ @184
41 ఏళ్లు దాటిన పేసర్ అండర్సన్ తన కెరీర్‌లో 184వ టెస్టులో బరిలోకి దిగుతున్నాడు. అతనికి ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో 22వ ఏడాది కానుండడం విశేషం. తను అరంగేట్రం చేసినప్పుడు ఇంకా పుట్టని రేహన్, బషీర్‌లతో కలిసి అండర్సన్ బౌలింగ్ చేయబోతున్నాడు.
ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ తొలిసారి తన సొంత గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. వైజాగ్‌కే చెందిన వికెట్‌కీపర్ భరత్‌కు 6 టెస్టుల స్వల్ప కెరీర్ తర్వాతే ఈ అవకాశం దక్కడం విశేషం. ఈ టెస్టులో జట్టు అవకాశాల గురించి భరత్ మాట్లాడుతూ... ‘అన్ని ప్రణాళికలతో మేము సిద్ధంగా ఉన్నాం.
తొలి టెస్ట్ మ్యాచ్‌లో జరిగిన తప్పులపై చర్చించాం. స్వీప్ షాట్‌లపై సాధన చేశాం. మేం అలాంటి షాట్లన్నీ ఆడగలం. అయితే పరిస్థితిని బట్టే బ్యాటర్లు దానిని అమలు చేస్తారు. గత ఓటమి తర్వాత మేమేం ఆందోళనకు గురి కాలేదు. జట్టులో అంతా బాగుంది. సుదీర్ఘ సిరీస్ కాబట్టి కోలుకునే అవకాశం ఉందని మాకు తెలుసు’ అని అన్నాడు.
పిచ్, వాతావరణం
మంచి బ్యాటింగ్ వికెట్. కాస్త బౌన్స్‌తో పాటు మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్‌కు అనుకూలిస్తుంది. ఇక్కడ జరిగిన రెండు టెస్టుల్లోనూ భారీ స్కోర్లు నమోదు చేసిన భారత్ రెండు మ్యాచ్‌లూ (ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపై) గెలుచుకుంది. వర్ష సూచన లేదు.
తుది జట్లు
భారత్ (అంచనా): రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, శ్రేయస్, పటిదార్, భరత్, అశ్విన్, అక్షర్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్.
ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్‌స్టో, ఫోక్స్, హార్ట్‌లీ, రేహన్, బషీర్, అండర్సన్.
Comments
Please login to add a commentAdd a comment