India vs England, 2nd Test: భారత్‌లో పిచ్‌లు కేవలం స్పిన్‌కు మాత్రమే కాకుండా.. పేస్‌కు కూడా అనుకూలించేలా తయారు చేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తదితరుల బౌలింగ్ చూసినపుడల్లా తనకు ఇలాంటి ఆలోచన వస్తుందని పేర్కొన్నాడు.
పిచ్‌లు బాగుంటే ఆట మరింత రసకందాయకంగా ఉంటుందని.. ఐదు రోజులపాటు సాగే టెస్టును కూడా గెలిచే సత్తా టీమిండియా సొంతమని గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా ఉపఖండంలో పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువగా అనుకూలిస్తాయన్న విషయం తెలిసిందే.
అయితే, విదేశాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించే పిచ్‌లు ఉంటాయక్కడ. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా టెస్టు మ్యాచ్‌లు రెండు.. మూడు రోజుల్లోనే.. ఒక్కోసారి ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిపోతున్న తరుణంలో.. పిచ్‌ల రూపకల్పనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టర్నింగ్ ట్రాకులు మాత్రమే ఎందుకు?
ఈ విషయంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘బుమ్రా, షమీ, సిరాజ్, ముకేశ్ బౌలింగ్ చేయడం చూసినపుడు.. ఇండియాలో ఇంకా టర్నింగ్ ట్రాక్‌ల తయారీకే మనం ఎందుకు పరిమితం కావాలి అనిపిస్తుంది.
మంచి వికెట్ తయారు చేస్తే ప్రతి ఆట మరింత రసవత్తరంగా ఉంటుంది కదా! అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ పటేల్(స్పిన్నర్లు)లతో కలిసి మన పేసర్లు కూడా ఇక్కడి పిచ్‌లపై 20 వికెట్లు తీయగలరు.
నిజానికి సొంతగడ్డపై.. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ల మీద గత ఆరేడేళ్లుగా మన బ్యాటింగ్‌లో నాణ్యత లోపించడం చూస్తూనే ఉన్నాం. నాణ్యమైన వికెట్లు తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఐదు రోజుల మ్యాచ్‌ను గెలవగల సత్తా ఇంకా టీమిండియాకు ఉంది’’ అని గంగూలీ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఇంగ్లండ్‌పై ఆరేసిన బుమ్రా
కాగా టీమిండియా ప్రస్తుతం సొంతగడ్డ మీద ఇంగ్లండ్‌తో టెస్టులు ఆడుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో రోహిత్ సేన ఓడిపోయింది. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా శుక్రవారం రెండో మ్యాచ్ మొదలుపెట్టింది.
శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జస్‌ప్రీత్ బుమ్రా అత్యధికంగా ఆరు వికెట్లతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో గంగూలీ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకోవడం గమనార్హం.
చదవండి: ఇలాంటి బాల్ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్
When I see Bumrah Sami Siraj Mukesh bowl . I wonder why do we need to prepare turning tracks in india ..my conviction of playing on good wickets keeps getting stronger every game .. They will get 20 wickets on any surface with ashwin jadeja Kuldeep and axar .. batting quality…
— Sourav Ganguly (@SGanguly99) February 3, 2024
Comments
Please login to add a commentAdd a comment