దుమ్ములేస్తోంది.. సమ్మక్క వస్తోంది.. | Sakshi
Sakshi News home page

దుమ్ములేస్తోంది.. సమ్మక్క వస్తోంది..

Published Thu, Feb 17 2022 4:40 PM

medaram jathara special story sammakka arriving dust clouds - Sakshi

మేడారంలో ఇప్పుడు కొత్త రోడ్లు, బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్నాయి వందల కెమెరాలతో ఎప్పటికప్పుడు తాజా సమాచారం చేరుతోంది. కానీ మూడు దశాబ్దాల క్రితం ఇదో దట్టమైన అడవి. కనీసం కరెంటు కూడా లేదు, ఫోన్‌ అంటే ఏంటో కూడా సరిగా తెలియని పరిస్థితి. ఆ రోజుల్లో సమ్మక్క రాక భక్తులకు తెలిసేందుకు ఒకే ఒక కొండ గుర్తు ఉండేది. 

ఇప్పుడు మేడారం జాతరకు ఆర్టీసీ 3500ల బస్సులు నడిపిస్తోంది. లక్షల సంఖ్యలో ఆటోలు, జీపులు, ట్రాక్టర్లలో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. కానీ ఒకప్పుడు మేడారం వచ్చే భక్తులు ఎడ్లబండ్లలోనే ఎక్కువ వచ్చేవారు. ఆది, సోమవారాల్లో బయల్దేరి మంగళవారానికి మేడారం చేరుకునేవారు. ఇలా వచ్చే భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో అడవుల్లో బస చేసేవారు. జంపన్నవాగులో చెలమల్లో నీళ్లు తాగేవారు. 

అడవుల్లో కంకవనం నరికి పందిల్లు వేసుకునేవారు. వాటి కిందే బస చేసేవారు. కరెంటు వెలుగులు లేవు. సాయంత్రం ఆరు గంటల కల్లా వంటలు పూర్తి చేసి వెన్నెల వెలుగుల్లో సమ్మక్క, సారలమ్మల కోసం వేయి కళ్లతో ఎదురు చూసేవారు. బుధవారం సాయంత్రం సారలమ్మ, గురువారం సాయంత్రం సమ్మక్క వస్తుదన్న విషయం తెలిసి పొద్దుగూకే సమయంలో మొక్కులు చెల్లించేందుకు అనువుగా సిద్దమయ్యేవారు. ముఖ్యంగా జాతరలో కీలకమైన సమ్మక్క రాక ఎప్పుడెప్పుడా అని ఒకరినొకరు ఆరా తీసేవారు.

గురువారం సాయంత్రం అయ్యిందంటే భక్తులందరూ చిలకలగుట్టవైపుకు చూసేవారు. రహస్య పూజల అనంతరం సమ్మక్కను తీసుకుని వడ్డేలు చిలకలగుట్ట దిగేవారు. అంతే ఒక్కసారిగా అక్కడున్న భక్తులు సమ్మక్కను అనుసరించేవారు. ఆ కోలాహాలానికి మట్టిరోడ్డుపై దుమ్ము ఆకాశాన్ని తాకేలా పైకి లేచేది. ఈ దుమ్ము మేఘాలు కదలాడుతున్న దిశగా భక్తులు సమ్మక్కకు ఎదురెళ్లి స్వాగతం పలికేవారు. నలువైపుల నుంచి భక్తులు దుమ్ము మేఘాలను అనుసరిస్తూ కదిలేవారు. పసుపు కుంకుమ కలిపిన ఒడిబియ్యం సమ్మక్కపైకి జల్లుతూ,, మేకలు కోళ్లు బలిస్తూ తమ మొక్కులు చెల్లించడం చేసేవారు. ఒక్కసారిగా భక్తుల ఒత్తిడి పెరిగిపోవడంతో  తొక్కిసలాట కూడా చోటుచే సుకునేది. 

తర్వాత కాలంలో సమ్మక్క రాకను సూచిస్తూ  గాల్లోకి కాల్పులు జరిపే సంప్రదాయాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది‡. కాల్పుల శబ్దాన్ని బట్టి సమ్మక్క వస్తున్న సమాచారం జాతర ప్రాంగణంలో తెలిసేది. ఆ తర్వాత కాలంలో మేడారం చుట్ట పక్కల రోడ్లు, హోటళ్లు, సెల్‌ఫోన్‌ టవర్లు వచ్చి ప్రతీ సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement