ప్రమాదాల ‘ఘాటు’ | Sakshi
Sakshi News home page

ప్రమాదాల ‘ఘాటు’

Published Wed, Apr 17 2024 8:15 AM

నంది ఘాట్‌ మలుపులో..   - Sakshi

గుంతలమయంగా

అనంతగిరి గుట్ట రోడ్డు

మలుపుల్లో పట్టు తప్పుతున్న వాహనాలు

ప్రాణాలు పోతున్నా పట్టించుకోని

అధికారులు

ఘాట్‌ రోడ్డులో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మలుపులు అధికంగా ఉన్న రహదారిలో గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు.

ధారూరు: జిల్లాలో పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న అనంతగిరి గుట్టల వాహనదారులకు చుక్కలు చూపుతున్నాయి. అసలే మలుపులున్న ఈ రహదారిలో భారీ గుంతలు ఏర్పడి వాహనాలు పట్టుతప్పుతున్నాయి. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఏ కాస్తా ఏమరుపాటుగా వాహనం నడిపినా పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

పదేళ్లలో వంద మీటర్ల మరమ్మతు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మొదటి ఘాట్‌లో వికారాబాద్‌ పరిధి వరకు కేవలం 100 మీటర్ల వరకు కొత్తగా రోడ్డు వేసి మమ అనిపించారు. ధారూరు మండల పరిధిలోని ఆర్‌ అండ్‌ బీ రోడ్డు ప్రారంభం నుంచి వదిలివేశారు. ఈ రోడ్డులో తరు చూ జిల్లా స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రయాణం సాగిస్తున్నా పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రయాణిస్తున్న వాహనాలు గుంతల్లోంచి వెళ్లడంతో వాహనాలు లోయలోకి పడిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు క్షతగాత్రులుగా మారడం పరిపాటయింది. ఇటీవల ఆర్టీసీ బస్సులకు జరిగిన ప్రమాదాల్లోనూ ఇద్దరు ప్రయాణికులు విగతజీవులయ్యారు. గుంతలకు మరమ్మతులు చేయించాల్సిన ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రిళ్లు ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు–హైదరాబాద్‌ మార్గంలోని అనంతగిరి కొండల్లోని ఘాట్‌ రోడ్డుకు దశాబ్ధాల నుంచి మరమ్మతుకు నోచుకోలేదని వివచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అనంతగిరిగుట్ట రోడ్డునైనా బాగుచేయించి ప్రమాదాలను అరికట్టాలని వాహనదారులు, పర్యాటకులు కోరుతున్నారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పర్యాటకులు

అనంతగిరిగుట్టలోని 9వ కిలోమీటర్‌ నుంచి ధారూరు వరకు ఉన్న ధారూరు ఆర్‌ అండ్‌ బీ రోడ్డు ప్రమాదకరంగా మారింది. అనంతగిరిగుట్టకు, కోట్‌పల్లి ప్రాజెక్టు వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైడ్‌బర్మ్‌లు సైతం ప్రయాణాన్ని ప్రమాదకరంగా మారుస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనంతగిరి రెండో ఘాట్‌ రోడ్డులో ఏర్పడిన గుంతలు
1/2

అనంతగిరి రెండో ఘాట్‌ రోడ్డులో ఏర్పడిన గుంతలు

మొదటి ఘాట్‌ సమీప రోడ్డు దుస్థితి
2/2

మొదటి ఘాట్‌ సమీప రోడ్డు దుస్థితి

 
Advertisement
 
Advertisement