అమెరికా పర్యటనకు లోకేశ్ దూరం
- సీఎంతో పాటు లోకేశ్, సీఎం పీఎస్ అమెరికా పర్యటనకు వెళ్తారని తొలుత జీవో
- వాళ్లిద్దరూ వెళ్లరని ఇప్పుడు మరో జీవో జారీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ కూడా ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు గత నెల 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు అమెరికా పర్యటనకు లోకేశ్‌తో పాటు సీఎం పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు అమెరికా పర్యటనకు వెళ్లడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, లోకేశ్‌తో సహా మొత్తం 17 మంది అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు గత నెల 28వ తేదీన జారీ చేసిన జీవోలో పేర్కొ న్నారు.
అయితే మంత్రి లోకేశ్, సీఎం పీఎస్ శ్రీనివాసరావు అమెరికా పర్యటనకు వెళ్లడం లేదని, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఇతర అధికారులు మొత్తం 15 మంది మాత్రమే అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు మంగళవారం జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలతో లోకేశ్ ఒప్పందాలు చేసుకుంటారని ప్రభుత్వ వర్గాలు ముందుగా ప్రచారం చేశాయి. తీరా అమెరికా పర్యటనలో ఆశించిన స్థాయిలో ఒప్పందాలు జరగకపోతే పరువు పోతుందనే భావనతో పాటు రాజకీయంగా కూడా సరికాదనే భావన కూడా దీనికి తోడైనట్లు తెలుస్తోంది.