రేడియో అక్కయ్య ఇక లేరు | Turaga Janaki Rani passes away | Sakshi
Sakshi News home page

రేడియో అక్కయ్య ఇక లేరు

Published Thu, Oct 16 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

రేడియో అక్కయ్య ఇక లేరు

రేడియో అక్కయ్య ఇక లేరు

* బహుముఖ ప్రజ్ఞాశాలి తురగా జానకీరాణి కన్నుమూత
* రేడియోలో బాలల కార్యక్రమాలతో చిరపరిచితురాలు
* ఆమె మృతికి పలువురు ప్రముఖుల సంతాపం
 
సాక్షి, హైదరాబాద్: రేడియో అక్కయ్య తెలుగు ప్రజలకు సుపరిచితురాలైన తురగా జానకీరాణి (78) బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. పంజాగుట్ట జర్నలిస్టు కాలనీలో ఉంటున్న ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయిత్రి, నృత్యకారిణి, వ్యాఖ్యాతగా, అనేక సంస్థల్లో సభ్యురాలిగా క్రియాశీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు.

ఆకాశవాణితో సుదీర్ఘమైన అనుబంధం ఉన్న ఆమె రేడియోలో బాలానందం, బాలవినోదం వంటి కార్యక్రమాలతో పిల్లలనే కాదు...పెద్దల హృదయాల్లోనూ స్థానం సంపాదించుకున్నారు. 1942 నుంచి ఆకాశవాణితో ఆమెకు అనుబంధం ఉంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఆమె నాలుగుసార్లు ఆకాశవాణి జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. ఆమె భర్త తురగా కృష్ణమోహన్ ఆకాశవాణిలో జర్నలిస్టుగా పని చేసేవారు. హాస్య రచయిత కూడా అయిన ఆయన చాలా ఏళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు ఉషారమణి న్యూస్ రీడర్ కాగా రెండో కూతురు వసంత శోభ ఆర్కిటెక్చర్‌గా పనిచేస్తున్నారు.
 
చలం స్ఫూర్తిగా...
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని దివిసీమ మందపాకల గ్రామంలో 1936 ఆగస్టు 31వ తేదీన జన్మించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. చరిత్ర, అర్ధశాస్త్రం, తెలుగు అంశాల్లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి స్వర్ణపతకాలను పొందారు. భరత నాట్యం, సోషల్ వర్క్ కోర్సుల్లో డిప్లొమా చేశారు. హైదరాబాద్ నిజాం కళాశాలలో ఎంఏ చదివారు. ఇంగ్లిష్‌లో ప్రతిష్టాత్మకమైన జనరల్ మెక్‌డోనాల్డ్ అవార్డును దక్కించుకున్నారు.

ప్రముఖ స్త్రీవాద రచయిత చలంకు స్వయానా మనుమరాలైన జానకీరాణి మూడు కథా సంకలనాలు, రెండు నవలలు, ఒక రేడియో నాటకాల సంకలనం రాశారు. ‘చేతకాని నటి’ కవితా సంకలనం వెలువరించారు. ‘తురగా జానకీరాణి కథలు’ పేరుతో ఆమె కథల సంపుటం ఏడాది క్రితమే వెలువడింది. ‘మా తాతయ్య చలం’ పేరుతో ఆమె రాసిన లేఖా సాహిత్యం ప్రాచుర్యం పొందింది. అయిదు వరకు అనువాద గ్రంధాలు, 35 పిల్లల పుస్తకాలు, వివిధ అంశాలపై వందలకొద్దీ వ్యాసాలు రాశారు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలు, రాష్ర్ట ప్రభుత్వ ఉగాది పురస్కారం, పింగళి వెంకయ్య స్మారక సత్కారం, సుశీల నారాయణరెడ్డి సాహితీ సన్మానం, బాలబంధు, బాలసాహితీ రత్న వంటి గౌరవాలను, అవార్డులను అందుకున్నారు. ఆంధ్ర మహిళా సభ, ఆంధ్ర యువతీ మండలి, శ్రామిక విద్యాపీఠం వంటి సంస్థల్లో ప్రముఖ పాత్ర పోషించారు. లోక్‌సత్తాలో క్రియాశీలక సభ్యురాలు. దేశ విదేశాల్లో 40కి పైగా సదస్సుల్లో పాల్గొని ప్రసంగించారు. యూనిసెఫ్, సేవ్ ది చిల్డ్రన్ యూకే, ఎన్‌సీఈఆర్‌టీ వంటి సంస్థలకు సమాచార సలహాదారుగా సేవలందించారు.
 
నేడు అంత్యక్రియలు..
జానకీరాణి మృతికి పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆరున్నర దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యంతో కలసి పయనించిన జానకీరాణి విలక్షణ రచయిత్రి అని ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి కొనియాడారు. ఆమె మరణం తెలుగు సాహితీలోకానికి తీరని లోటని తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ శివారెడ్డి అన్నారు. రచయిత వేదగిరి రాంబాబు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జానకీరాణి భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కూతురు ఉషార మణి తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement