ప్రకాశం బ్యారేజీ
కృష్ణా నదిపై విజయవాడలో నిర్మించిన ప్రకాశం బ్యారేజీకి ముప్పు పొంచి ఉంది. భారీ వరదొస్తే ప్రకాశం బ్యారేజీ ఉనికే ప్రశ్నార్థకం కానుంది. అనుకోని విపత్తు ఎదురైతే బెజవాడ నగరానికి జలప్రళయం సంభవించే ప్రమాదం ఉంది. బ్యారేజీకి ప్రాణంగా భావించే 70 క్రస్ట్ గేట్లు తుప్పు పట్టాయి. పొరలు పొరలుగా ఊడిపోతున్నాయి. అయినా, ఇరిగేషన్ శాఖ అధికారులలో చలనం లేదు.
నాలుగు జిల్లాలకు వరప్రదాయిని అయిన ఈ ప్రకాశం బ్యారేజ్‌ని పట్టించుకునేవారు లేరు. రెండు అంగులాల మందం ఉండే 70 క్రస్ట్ గేట్లు తప్పు పట్టి పెచ్చులు ఊడుతున్నాయి. దీన్ని ఇలాగే వదిలేస్తే మరి కొద్ది రోజుల్లో ఈ గేట్లు తుప్పు పట్టి మరీ పలుచగా మారే ప్రమాదం ఉంది. 2009 తర్వాత ప్రకాశం బ్యారేజీకి భారీ వరద ఎప్పుడూ రాలేదు. మళ్లీ ఆనాటి పరిస్థితి వస్తే ఏమిటి అని ఆలోచించడానికే భయమేస్తోంది. విజయవాడను రాజధానిని చేస్తామని చెబుతున్నారు. ఈ బ్యారేజీని మాత్రం పట్టించుకునే నాధుడు లేడు.