అసెంబ్లీ లాబీల్లో ‘జలీల్‌ఖాన్‌ ఫిజిక్స్‌’ | Ysrcp MLA Roja funny comments on Jalil Khan | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ లాబీల్లో ‘జలీల్‌ఖాన్‌ ఫిజిక్స్‌’

Published Wed, Mar 8 2017 1:31 AM | Last Updated on Mon, Oct 29 2018 8:10 PM

అసెంబ్లీ లాబీల్లో ‘జలీల్‌ఖాన్‌ ఫిజిక్స్‌’ - Sakshi

అసెంబ్లీ లాబీల్లో ‘జలీల్‌ఖాన్‌ ఫిజిక్స్‌’

‘హాయ్‌ ఫిజిక్స్‌’ అంటూ పలకరించిన రోజా

సాక్షి, అమరావతి: కామర్స్‌లో ఫిజిక్స్‌ ఉంటుందని, కామర్స్‌ కూడా మేథమెటిక్సేనని చెప్పి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ దానిపై విసు్తృతంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మంగళవారం అసెంబ్లీ లాబీల్లో జలీల్‌ఖాన్‌ ఫిజిక్స్‌ హాట్‌టాపిక్‌ అయింది. అసెంబ్లీకి వచ్చిన జలీల్‌ఖాన్‌ ఉదయం 11 గంటల సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న లాబీల్లోకి వచ్చారు. ఆయన్ను చూసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ‘హాయ్‌ ఫిజిక్స్‌’ అంటూ పలకరించారు. దీంతో ఆయన అక్కడే ఆగిపోయారు.

రోజాతో పాటు మిగతా మహిళా ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, పుష్పశ్రీవాణి, వంతెల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి తదితరులు ఆయన దగ్గరకు వచ్చారు. ‘మేము ధర్నాలు చేసినా, పోలీసులు అరెస్టులు చేసినా మాకు అంత పాపులారిటీ రాలేదు, మీరు కామర్స్‌లో ఫిజిక్స్‌ ఉంటుందని చెప్పగానే మీకు ఎవరూ ఊహించనంత పాపులారిటీ వచ్చింది..’ అంటూ రోజా ఛలోక్తి విసిరారు. దీనికి జలీల్‌ఖాన్‌ స్పందిస్తూ... ‘సీదాగా చెబితే ఏ మీడియా వాళ్‌లైనా సరిగా చూపిస్తారా? ఉల్టాగా చెబితేనే వేస్తారు..’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇంతలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌లు వచ్చి అన్నా బీకాంలో ఫిజిక్స్‌తో మీరు నేషనల్‌ ఫిగర్‌ అయ్యా రన్నా అంటూ జోకు వేశారు. దీనికాయన స్పందిస్తూ.. ‘నేను మాట్లాడింది అంతా వెయ్యలేదు. అయినా మీడియా వాళ్లు వాళ్లకేం కావాలో అదే వేసుకుంటారు. మనం మాట్లాడింది ఎడిట్‌ చేస్తారు..’ అని అన్నారు. దీనికి అనిల్‌ కుమార్‌ స్పందిస్తూ... ‘భవిష్యత్తులో బీకాంలో ఫిజిక్స్‌ పెట్టొచ్చేమోలే అన్నా...మీ సీఎం అమరావతిని సింగపూర్‌ చేస్తా, అది చేస్తా,  ఇదిచేస్తా అని చెబుతారుకదా...దానికంటే ఇదేమీ తప్పుకాదులే..’ అంటూ నవ్వులు పూయించారు. తర్వాత ఎమ్మెల్యే ముస్తఫాను పలకరించిన జలీల్‌ఖాన్‌ తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని, పవన్‌ కళ్యాణ్‌మీద అయినా పోటీ చేసి గెలుస్తానని నవ్వుతూ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement