అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డల్లాస్ (టెక్సాస్) :
ఇటీవల కాన్సాస్ లో జరిగిన కాల్పుల సంఘటన దురదృష్టకరమని 'ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్' జాతీయ సంఘానికి అధ్యక్షులు, తానా మాజీ అధ్యక్షులు డాక్టర్. ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలను కోల్పోయిన శ్రీనివాస్ కూచిబొట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఇదే సంఘటనలో గాయపడిన అలోక్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఎంతో సాహసోపేతంగా అలోక్ రెడ్డి ప్రాణాన్ని కాపాడిన ఇయాన్ గ్రిల్లాట్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ తరపున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తోపాటూ ఇటీవల యూఎస్ కాంగ్రెస్ కు ఎన్నికైన భారత సంతతికి చెందిన కమల హారిస్, ప్రమీల జయపాల్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, డాక్టర్. అమీ బెరాలకు ఈ దాడులను తీవ్రంగా పరిగణించి, మున్ముందు ఇలాంటివి జరగకుండా కఠిన చట్టాలను అమలు చేయాలని లేఖ రాశారు. ఇటీవలి కాలంలో ఇలాంటి దాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ అమెరికన్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
1. ఇరుగు పొరుగు వారితో పరిచయం:
► కనీసం మీ ఇంటి చుట్టుపక్కల నివసిస్తున్న వారి పేర్లు , వివరాలు తెలుసుకోండి.
► వారిని మీరు జరుపుకొనే కొన్ని భారతీయ సంప్రదాయ వేడుకులకు ఆహ్వానించి మన సంస్కృతితో అనుబంధం ఏర్పాటు చేయండి.
► వీకెండ్ పార్టీలు, విందులు, వినోదాలు చేసుకుంటున్నప్పుడు లౌడ్ మ్యూజిక్ పాటలతో మీ ఇరుగు పొరుగు వారికి అసౌకర్యం కలిగించకండి.
► తెల్లవారకముందే శబ్దంతో మీ గార్డెన్ , లాన్ మొయింగ్ పరికరాలతో ఇతరుల నిద్రకు భంగం కలిగించకండి.
► మీ కార్లు, మీ అతిథుల కార్లను మీ ఇరుగు పొరుగు వాళ్ల ఇంటి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ చేయండి.
2. అమెరికా జాతీయ జెండాను ఎల్లప్పుడు గౌరవించడం:
► ఎప్పుడూ భారతదేశపు జెండాను ఒంటరిగా ఎగరవేయకండి. దాని పక్కనే అమెరికన్ జాతీయ జెండాను కూడా ఎగరవేయండి.
► ఇరు దేశాల జెండాలను ఎగరవేసేటప్పుడు, జాతీయ గీతాలను ఆలాపించేటప్పుడు నిర్దిష్టమైన నియమావళిని పాటించండి.
► ఎల్లప్పుడూ అమెరికా రాజ్యాంగానికి, చట్టాలకు కట్టుబడి ఉండండి.
3. దుస్తులను ధరించే విధానం:
► మనం ధరించే దుస్తులు బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు వింతగా, ఇబ్బంది కలిగించే విధంగా ఉండనివ్వకండి.
4. ఇతరుల శాంతికు భంగం కలిగించకండి:
► కొన్ని సందర్భాలలో ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా నటీనటులు వచ్చినప్పుడు అత్యుత్సాహముతో కేరింతలు, నినాదాలు, బ్యానర్లు, ర్యాలీలతో వందల కొద్దీ సమూహంగా చేరి వారు బస చేస్తున్న హోటళ్లలోనూ, సినిమా హాళ్లలోనూ, ప్రధాన బహిరంగ వేదికల వద్ద నినాదాలతో హోరెత్తించడం తగని చర్య. ఇలాంటి కొన్ని సందర్భాలలో పోలీసులు వచ్చి అందరిని చెల్లాచెదురు చేసిన సంఘటనలు మన గౌరవ ప్రతిష్టను దెబ్బ తీశాయి.
5. భారత దేశం నుంచి వచ్చే సందర్శకులు:
తమ కుటుంబసభ్యులను చూడటానికి వచ్చే తల్లిదండ్రులకు, అతిథులకు ముందు గానే ఆమెరికా సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఒక రకమైన అవగాహన కల్పించడం విధిగా చేయవలసిన పని.
ఉదాహరణకు:
► అమెరికన్ల వైపు ముఖ్యంగా వారు స్విమ్ దుస్తుల్లో ఉన్నప్పుడు తదేకంగా వారి వైపు చూడటం గాని, వారిపై అపహాస్యంగా నవ్వడంగాని, పరాయి భాషలో మాట్లాడటం గాని తగని పని.
► అలవాటు ప్రకారం పిల్లలు ముద్దుగా ఉన్నారు కదా అని అమెరికన్ చిన్న పిల్లలను పట్టుకోవడం, ముద్దాడటం, మన తినుబండారాలు పెట్టడం చేయకూడదు.
► భారతదేశం నుంచి వచ్చిన తల్లిదండ్రులు / అతిథులు ను మన చుట్టూ ఉన్న పరిసరాలకు అలవాటు పడేవరకు ఒంటరిగా వదలకండి.
6. గుర్తింపు కార్డు:
► ఎల్లప్పుడూ మీ చట్టపరమైన పాస్ పోర్ట్ లేదా ఐడి కాపీలను , సెల్ ఫోన్ను అందుబాటులో మీ దగ్గరే ఉంచుకోండి.
► ఎల్లప్పుడూ పోలీసు, భద్రతాధికారుల సూచనలను అనుసరించండి.
7. వికలాంగ సంబంధిత:
► వికలాంగులకు కేటాయించిన స్థానాలను వారికే వదిలేయండి.
► కొన్ని నిముషాలకైనా వారి పార్కింగ్ స్థానాలను ఉపయోగించకండి.
► వాహనాలను నడిపేటప్పుడు పాదచారులకు ఎప్పుడు దారి ఇవ్వండి.
► పాఠశాల దగ్గర వేగ పరిమితుల ను అనుసరించండి.
► అడ్డదిడ్డంగా రోడ్లను దాట రాదు.
8. సామాజిక ప్రవర్తన:
► ఎల్లప్పుడూ వాస్తవాలను మాత్రమే చెప్పండి.
► సంబంధిత అధికారుల తో వ్యవహరించేటప్పుడు వారికి చాలా గౌరవ మర్యాదలు ఇవ్వండి. న్యాయం మీ పక్షాన ఉన్నప్పటికీ మీరు చెప్పే విషయం సరైనది అయినప్పటికీ అవతల వారితో ఎటువంటి వాదనకు, ఘర్షణకు దిగకండి.
► విమానాశ్రయాలు, రెస్టారెంట్లు, బార్లు, పార్కులు తదితర ప్రాంతాల్లోఎప్పుడూ జోక్స్, తమాషాలు చేయకండి.
► బహిరంగ ప్రదేశాల్లో మందు తాగడం, గట్టిగా అరవడం, మాట్లాడటం చేయడం చట్ట విరుద్ధం.
► మనకున్న మత / ఆధ్యాత్మిక స్వేచ్ఛను సద్వినియోగ పరచుకుంటూనే ఇతరుల మనోభిప్రాయాలకు విఘాతం కలగకుండా చూడండి.
► అర్థరాత్రుల వరకు బార్లు, రెస్టారెంట్లు, పబ్బులలో ఉండడం నివారించండి.
9. సాంఘిక ప్రసార మాధ్యమం
► సాంఘిక ప్రసార మాధ్యమాలైన వాట్సాప్ , ఫేస్ బుక్ , ట్విట్టర్ లలో ఈమెయిల్స్ , మెసేజెస్ ద్వారా పుకార్లను సరదాకు అయినా వ్యాప్తి చేయరాదు.
► అశ్లీల వెబ్ సైట్లలలో చాట్ చేయరాదు. అలా చేసిన వారిని రహస్యంగా అధికారులు పట్టుకొని వెంటనే దేశమునుండి బహిష్కరించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
10. చట్టపరమైన హక్కులు:
► మీ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతున్నదని భావించినప్పుడు చట్టాలను ఆశ్రయించండి.
► మిమ్మల్ని మీరు రక్షించు కొనే పరిస్థితిలో లేకపోతే వాటిని ఎదుర్కొనేందుకు ఎటువంటి వాదనకు, ఘర్షణలకు, సాహసాలకు పోకండి.
► మీ దగ్గర ఉన్న నగదు, విలువైన వస్తువులు కన్నా ఎల్లప్పుడూ మీ ప్రాణం అత్యంత విలువైనదని భావించండి.
11. చట్ట వ్యతిరేకపు ప్రవర్తన:
► వైద్య, ఆరోగ్య, న్యాయ, ఆర్ధిక, ఐటి రంగాలలో ఉన్న ప్రముఖులు కొంత మంది దురాశకు పోయి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడి, ఆర్ధిక నేరాల్లో ఇరుక్కొని జైళ్లలో మగ్గుతున్న వారు ఎందరో ఉన్నారు.
► అమెరికా లో అక్రమంగా నివసించే వారికి ఎటువంటి ఆశ్రయం ఇవ్వడం కానీ, ఉద్యోగంలో పెట్టడం కానీ చేయకూడదు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే దేశం నుంచి వెనువెంటనే వారిని బయటకు పంపుతారు/బహిష్కరిస్తారు.
12. వ్యక్తిగత భద్రత:
► ఎల్లప్పుడూ ఇంటి తలుపులు వేసుకొని ఉండండి.
► ఎవరైనా తెలియనివారు, క్రొత్త వారు వచ్చినప్పుడు తలుపు తీయకండి.
► అతి తక్కువ సమయానికి ఇంటి నుండి బయటకు వెళ్ళవలసివచ్చినప్పుడు ఇంటికి సంబంధించిన భద్రత అలారం ను ఆన్ చేయాలి.
► పార్టీలకు, శుభ కార్యాలకు వెళ్ళినప్పుడు మనకు బంగారం బాగా ధరించడం అలవాటు. ఇది మన భద్రతకు చాలా ముప్పు. అమెరికాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నో వేలాది దొంగతనాలు జరగడానికి ఇదొక కారణం. కాబట్టి, మన విలువైన వస్తువులను, బంగారు నగలను బ్యాంకు లాకర్ లలో సంరక్షించుకోవాలి.
► ఇంటి బయటకు కానీ, లోపలకు కాని వచ్చేటప్పుడు మన పరిసర ప్రాంతాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి.
13. పిల్లల సంరక్షణ:
► మన కోపాన్ని, విసుగును, నిరాశ ను మన పిల్లల మీద చూపించకండి.
► పిల్లలను ఏనాడూ కొట్టడం లాంటివి చేయకండి.
► పిల్లలను ఒంటరిగా ఏనాడూ ఇంట్లో వదలరాదు. అలాగే బయటకు వెళ్ళినప్పుడు మన వాహనాలలో కొన్ని నిముషాలకైనా సరే, వాళ్ళని ఒంటరిగా వదిలేయకండి.
► పిల్లల పై దురుసుగా ప్రవర్తిస్తే, పిల్లల రక్షిత సేవా సంస్థ (చైల్డ్ ప్రొటెక్టీవ్ సర్వీసెస్) వారు పిల్లలను తీసుకొని వెళ్లి పోతారు. పేరెంట్స్ ను కూడా శిక్షిస్తారు.
14. పౌరులుగా మన భాద్యత:
► మనం అమెరికాలోనే స్థిరపడటానికి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి, ఈ దేశపు జన జీవన స్రవంతిలో మనము కలిసిపోవాలి.
►మన దేశపు సంప్రదాయ విలువలను కాపాడుతూ, వాటిని పాటిస్తూనే, ఇక్కడి సమాజంలో ఇమడగలగాలి.
►స్థానిక అధికారులు, రాజకీయ నాయకులతో పరిచయం కలిగి ఉండండి.
►అలాగే మనము కొంత సమయాన్ని స్వచ్ఛందంగా సామజిక సేవ కోసం కేటాయించగలగాలి. ఉదాహరణకు వివిధ పాఠశాలలో, గ్రంథాలయాల్లో, ఆసుపత్రుల్లో, ప్రభుత్వ కార్యకలాపాలలో పాలుపంచుకోవడానికి స్వచ్ఛదంగా కృషి చేయాలి.
సంబంధిత వార్తా కథనాలకై చదవండి..
రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే
‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’
శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి
అమెరికాలో జాతి విద్వేష కాల్పులు
శ్రీనివాస్ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐల బాసట
అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి