కేసీఆర్ కు సుచరిత లేఖ
హైదరాబాద్: నాలుగు రోజుల్లో నామినేషన్ల ఘట్టం ముగియనుండగా, పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరితారెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. ఖమ్మం జిల్లాకు తన భర్త చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని పోటీ నుంచి విరమించేలా నిర్ణయం తీసుకోవాలని ఆమె అభ్యర్థించారు. ఈ మేరకు సుచరిత ఆదివారం సీఎంకు ఒక లేఖ రాశారు.
రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో అనివార్యమైన పాలేరు ఉప ఎన్నికల్లో పలు విపక్షపార్టీలు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో పోటీకి దిగొద్దని, ఏకగ్రీవానికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ విపక్షాలను అభ్యర్థించింది. ఆ మేరకు వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీసీఐ, సీపీఎంలు పోటీకి దిగబోమని ప్రకటించాయి. ఇదే విషయాన్ని సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించిన సుచరితారెడ్డి టీఆర్ఎస్ కూడా ఏకగ్రీవానికి సహకరిస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు.
పాలేరు ఉప ఎన్నికకు ఈ నెల 22న నోటిఫికేషన్ వెలువడింది. 29 వతేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్లు పరిశీలన, మే 2న నామినేషన్ల ఉపసంహరణ, మే 16న పోలింగ్, 19న కౌంటింగ్ జరగనుంది. పాలేరులో అధికార టీఆర్ఎస్ తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పోటీ చేస్తున్నారు.
సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ మొదటి నుంచీ ఏకగ్రీవ పాట పాడుతున్నప్పటికీ దానిని సకాలంలో, బిగ్గరగా వినిపించడంలో విఫలమైంది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల అని తేలకముందు వరకు వైఎస్సార్ సీపీ తప్ప మిగతా పార్టీలైన టీడీపీ, సీపీఎం, సీపీఐలు పోటీకి కాలుదువ్వాయి. తుమ్మల రంగంలోకి దిగటంతో మళ్లీ ఏకగ్రీవం అంటూ మాటమార్చాయి. 'సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీకి దిగం' అనే రాసుకోని ఒప్పందానికి వైఎస్సార్ సీపీ ఒక్కటే కట్టుబడింది.